జరిగిన కథ... (Parts 1, 2, 3, 4, 5, 6, 7)
వాళ్ళ నాన్న తనకేం తలంటు పోసాడో తెలీదు కాని తర్వాత రోజు తను వచ్చి "ఇక మన మధ్య ఏం లేదు" అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే అంతకు మించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎంత పక్కగా రాసాడో మా స్క్రిప్ట్ దేవుడు, ఆ రోజే మా కాలేజి చివరి రోజు, ఇకపై తనని చూసే అవకాశం లేదు నాకు. ఎందుకంటే తను చెప్పిన మాట కంటే తను చూసిన చూపు నా మనసు ని చీల్చేసింది. అన్ని రోజులు నాపై ప్రేమ కురిపించిన ఆ కళ్ళు, ఆ రోజు నన్నో ద్రోహిగా చూసాయి. నిజంగా నేను తప్పు చేసుంటే, తన చూపు నాకేం అనిపించేది కాదు, కాని నేనేం చేసానని, కనీసం తను కారణం చెప్పినా బావుండేది. తను ఆ మాట చెప్పి వెళ్ళిపోయింది, నేను మాట రాక చూస్తూ ఉండిపోయాను. నా మైండ్ లో న్యురాన్స్ మధ్య బంధం తెగిపోతునట్టు అనిపిస్తుంది, ఏమి ఆలోచించలేక పోయాను, అసలు నా తప్పేంటి !? వెళ్ళిపోయింది మూడేళ్ళ బంధాన్ని ముక్కలు చేసి మళ్ళీ రానంత, నేను చేరుకోలేనంత దూరం పెంచి వెళ్ళిపోయింది. దూరాన్ని కూడా దగ్గర చేయగల మా ప్రేమని దూరం చేసి వెళ్ళిపోయింది. చేయని తప్పుకు శిక్ష వేసి, జీవితాంతం ఏడుస్తూ కూర్చోమనే తీర్పు ఇచ్చి వెళ్ళిపోయింది. దారం తెగినప్పుడు గాలి పటాన్ని వదిలేసినంత సులువుగా వదిలేసి వెళ్ళిపోయింది. మా ప్రేమని ఓ పీడ కలలా మార్చేసి నిద్ర మత్తు వదిలించి మరీ వెళ్ళిపోయింది. మాటతో మనసుని, చూపుతో హృదయాన్ని కోసి నాపై తన ప్రేమ ని తీసుకు వెళ్ళిపోయింది. ప్రేమించుకోవటానికి రెండు మనసులు ఉంటె చాలు, పెళ్ళికి రెండు కుటుంబాలు అంతకంటే ముఖ్యంగా ఒకే సామాజిక వర్గం కావాలనే నిజం తెలిసేలా చేసి తలవంచుకు వెళ్ళిపోయింది.
నా కళ్ళలో తన పై ప్రేమ, నా మాటల్లో తన పేరు, నా మనసులో తన ఆలోచనలు, నా గుండెలో తన రూపం అన్నిటిని ఒక్క మాటతో తీసెయ్యటం ఎలా కుదురుతుంది. మర్చిపోవటానికి తను జ్ఞాపకం కాదు, నా జీవితం. నన్ను నేను చూసుకున్నాను తనలో, ఒక్క సారిగా నువ్వు వేరు నేను వేరు అంటే మనసు ఒప్పుకోలేదు. చాలా రోజులు జీర్ణించుకోలేక పోయాను, నేనేం చేసానని అనే ప్రశ్న తప్ప ఇంకేం ఆలోచనలు రాలేదు. నిజాయితిగా ప్రేమించటం, ఎక్కడా హద్దు దాటకపోవటం, తన అభిప్రాయలు గౌరవించటం కూడా తప్పా !? కారణం తెలుసుకోవాలని ఎంతో కుతూహలం కాని తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నాకు. తనకి నా మీద అంత ద్వేషం కలగటానికి కారణం తెలిసుంటే బావుండు అనే బాధ తప్ప తనపై కొంత కూడా కోపం రాలేదు. తనే పరిస్తితుల్లో చెప్పిందో అనిపించింది.
ఏవయ్యా మరీ ఇంత ఘోరమా !? నేనేం తప్పు చేసాను, ఎందుకు ఇలా చేసావ్ !? కనీసం తనతో కారణం చెప్పించవచ్చు కదా !? అయినా నిన్నని ఏం ప్రయోజనం నీకు ప్రేమంటే తెలిస్తే కదా. నీ గురించి తెలీక పిచ్చి మనుషులు నిన్నో దేవుడ్ని చేసారు, నిజానికి నువ్వెలా దేవుడివి !? సీతమ్మని కష్టాలు పెట్టినందుకు నువ్వు దేవుడివా ? కర్ణుడిని కుట్రతో చంపించటం వలన దేవుడివా !? కష్టాలు పడ్డ సీతమ్మ దేవత అంటే నమ్మవచ్చు, నీ కుట్ర తెలిసి కూడా ప్రాణాలు కోల్పోయిన కర్ణుడిని దేవుడిగా ఒప్పుకోవచ్చు కాని తప్పులతో గెలిచే నిన్ను ఎందుకు దేవుడు అనాలి !? నీ నుండే అన్నీ పుట్టాయి అంటారు కదా మరి ఈ సామాజిక వర్గాలు ఏంటి, మట్టిలో పుట్టిన మట్టికి వర్గాలు ఏంటి ? మట్టిలో కలిసే మట్టికి మతం ఎక్కడినుండి వచ్చింది ? మనిషి పుట్టుక రహస్యం ఒక్కటే, చావు ఒక్కటే మరి మధ్యలో ఇవన్నీ ఏంటి ? మతాలూ, వర్గాలు సృష్టించి కొట్టుకు చావమని చెప్పే నువ్వేం దేవుడివి !? మనసుకి మతానికి బంధం ఏంటి, ఒక మతం మనసు ఇంకో మతం మనసుని ప్రమించకూడదా !? మనుషుల కోసం మతాలూ, కులాలు, వర్గాలు కాని వాటి కోసం మనుషులు కాదు కదా, మరీ నువ్వేం చేస్తున్నావ్ ఈ విషయం చెప్పకుండా !? మనుషుల కన్నా మహా దారుణంగా ఉన్నావ్ నువ్వు, ఇంత వింత ప్రపంచాన్ని సృష్టించి అందులో అందరు తన్నుకు చస్తుంటే వినోదం చూస్తూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండుంటావ్... ఇంకా ఏదో అనబోతుంటే
"నాని...నువ్వు ఆవేదనలో ఉన్నావ్, అందుకే ఇలాంటి ప్రశ్నలు వేదిస్తున్నాయ్ నిన్ను. నువ్వు చూసేదంతా నిజం కాదు, నువ్వు చూడలేనంత మాత్రాన నిజం కాకుండా పోదు. సీతమ్మ కష్టాలు, కర్ణుడి చావు అనేవి ధర్మం ప్రకారం జరగాలి జరిగాయి అంతే. మనుషులను సృష్టించిన నేనే, వాళ్ళకి నచ్చినట్టు బతికే స్వేచ్చను ఇచ్చాను. ఆ స్వేచ్చను దుర్వినియోగం చేసుకుంది మీరు, నేను ధర్మాన్ని చెప్పాను, మీరు న్యాయాన్ని సృష్టించారు. అందరికి ఒకేలా ఉండేది ధర్మం, మీకు నచ్చినట్టు మారేది న్యాయం. నువ్వు న్యాయం తరుపున వకాల్తా పుచ్చుకున్నావ్, ధర్మాన్ని అర్ధం చేసుకోగల స్థాయి నీకు లేదు. తప్పక వస్తుంది ఓపికపట్టు. ఈ సందర్భం లో నీకు నేను ఒకే మాట చెప్పగలను, గుర్తుంచుకో మిత్రమా... అంతా కొంతకాలమే ! " అని దేవుడు చెప్పినట్టు అనిపించింది. అందులో చాలా మట్టుకు అర్ధం అవ్వలేదు నాకు,మిగిలినవి అర్ధం చేసుకోలేనేమో అని పట్టించుకోలేదు.
ఆ తర్వాత చాలా రోజులు ఒంటరిగా తిరిగాను ఓ వెర్రి వాడిలా, నేనేం చేస్తున్నానో తెలీలేదు. అందరు నవ్వుతున్నారు, బాధపడకురా అని ధైర్యం చెప్పేవాళ్ళే అందరు, అమ్మని చూస్తుంటే బాదేసింది, నేను ఏమై పోతానో అన్న భయం తనని వేధిస్తుంది. నాన్నపైకి కనపడటం లేదు కాని కంటికి కూడా కనపడకుండా కన్నీరు కారుస్తున్నారు అనిపిస్తుంది. అన్నయ్య ఏం చెప్పాలో తెలీక, ఎప్పుడు నాతోనే ఉంటున్నాడు, బహుశ నేనేమైన చేసుకుంటానేమో అనే అనుమానం ఉందేమో వాడికి. అంజు కి తెలుసు హరి అంటే నాకెంత ఇష్టం అనేది, అందుకే తనేం చెప్పటం లేదు, చెప్పలేకపోతుంది. హరి విడదీసి వెళ్ళిపోయిన రోజు నాకేం పెద్దగా బాధనిపించలేదు, కాని రోజులు గడుస్తున్నా కొద్ది భరించలేకపోతున్నాను. ఏడుపొస్తుంది, మత్తు ఇవ్వకుండా గుండెని కోస్తునట్టు, నరాలు గుండెని బందిస్తునట్టు, ఊపిరి కదలలేక కదలలేక కదులుతునట్టు అనిపిస్తుంది. ఆకలి కుంభకర్ణుడి నిద్రలో ఉంది, ఎన్ని రోజులయ్యిందో గుర్తులేదు ఆకలి మాత్రం అవ్వటంలేదు, ఆనందం చనిపోయిందేమో అన్న అనుమానం, నవ్వు దరిదాపుల్లో కనపడటం లేదు, నా భావనల్లో ఆవేదన, కోపం, బాధ, నిస్సహాయత తప్ప ఇంకేం లేవు నా దగ్గర. తిరిగాను ఆకాశంలో నక్షత్రాలు లేక్కెట్టాలని చూసే అమాయకుడిలా, పగటిపూట వెన్నెలని వెతికే పిచ్చివాడిలా. కొన్నాళ్ళకు ఇంట్లో వాళ్ళని చూడలేక నన్ను నేను మార్చుకోవటానికి ప్రయత్నించాను, తనని మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో కొన్ని రోజులు కష్టపడితే ఐటీ లో జాబు వచ్చింది, పని లో పడిన తర్వాత తన ఆలోచనలు కొద్దిగా తగ్గాయి.
అలా రోజులు గడిచిపోతుంటే, హరి బస్సు లో నా పక్కన కూర్చునేట్టు చేసాడు దేవుడు, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు తనని చూసాను. తను ఆ రోజు ఎందుకు అలా అనిందో చెప్పింది. ఇంట్లో వాళ్ళకు మా గురించి చెప్పినప్పుడు, వెంటనే మా పెళ్లి కుదరదని చెప్పేశారు. తను బాధ పడి, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండేందుకు వాళ్ళమ్మ ఇంకొంచెం ముందుకు వెళ్లి, మా ఇద్దరి పెళ్లి జరిగితే తలెత్తుకు బతకలేం అని చెప్పిందంటా. హరి, వాళ్ళ అమ్మ నాన్న ని ఒప్పించటానికి ఎంతో ప్రయత్నించింది కాని ఓడిపోయింది. వాళ్ళమ్మ నాన్న చేసిన ఎమోషనల్ బ్లాకు మెయిల్ కి లొంగిపోయింది. వాళ్ళ నాన్న ప్రాణం ముఖ్యమా, తన ప్రేమ ముఖ్యమా అనే ప్రశ్న హరి మనసులో నాటుకునేలా చేయటంలో విజయం పొందారు వాళ్ళు. ప్రేమలో ఉన్నా, బాధలో ఉన్నా ఆలోచన మసకబారుతుంది, ఆ సమయం లో తీసుకున్న నిర్ణయం ప్రభావం చాల గట్టిగా ఉంటుంది. తను తప్పు చేస్తుంది అనేలా తనతోనే చెప్పించారు వాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్న చేసింది ఒక ఎత్తు అయితే, వాళ్ళన్న చేసింది హైలెట్టు. నాకు అంజు కి మధ్య ప్రేమని సృష్టించాడు ఆ నీచుడు. ఎంతలా అంటే నా మీద ఎంతో నమ్మకం ఉన్న నా హరి కూడా వాడి మాటలు నమ్మేలా. ఏం చెప్పాడో, ఎలా చూపించాడో, ఎవ్వరితో చెప్పించాడో తెలీదు కాని, హరి కి నేను అంజు ని ప్రేమిస్తూ తనని మోసం చేస్తున్నాను అనే స్థాయికి తీసుకెళ్ళాడు వాడు. వాళ్ళందరూ తన మైండ్ మెమరీ ని ఫార్మటు చేసి, నన్నో నీచ నికృష్టపు అష్ట దరిద్రుడుగా అనుకోటానికి కావాల్సిన సాఫ్ట్వేర్ అంతా లోడ్ చేసారు. నాతో కుదరదు అని చెప్పిన కొన్నాళ్ళకు తను నన్ను అపార్ధం చేసుకున్నట్టు గ్రహించిందట, కాని ఇది సినిమా కాదు కదా ప్రేమించిన వాడితోనే పెళ్లవ్వటానికి, ప్రేమకోసం ఎవరో ఒకర్ని వదులుకోవాలి ఇక్కడ, తల్లితండ్రులనో లేక ప్రేమించినవాడినో. తనో గొప్ప కూతురు అందుకే వాళ్ళ అమ్మ నాన్నకు నచ్చినట్టు బతికేందుకు నిర్ణయించుకుంది అందుకే నన్ను వదిలేసింది. నన్ను అడిగుంటే నేను అదే చెప్పుండే వాడినేమో, ఎందుకంటే కన్నోల్లని కన్నీళ్ళు పెట్టించి మేము ఆనందంగా ఎలా ఉండగలం చెప్పండి.
ఇదంతా తెలిసేప్పటికి నేను హరి ని దాదాపు నా ఆలోచనల నుండి తొలగించేసాను. నేను బాధపడటం అంటే మా వాళ్ళని బాధపెట్టటమే అనిపించింది, అయిన నాకు రాసిపెట్టి ఉంటె జరిగి ఉండేది కదా, అన్నయ్య అంజు కి రాసుంది కనుక జరిగింది అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని హరి ని మర్చిపోయాను, అదే మర్చిపోటానికి ప్రయత్నిస్తున్నాను. అదే సమయం లో హరి నే కారణం చెప్పేప్పటికి నాకు చాల వరకు బాధ తీరిపోయింది, ఆ రోజుతో తనని మొత్తంగా తీసేసాను నా మనసులో నుండి. తనకు పెళ్లి కుదిరిందట, నాకు చెప్పటం ఇష్టం లేదు తనకి కాని నా పక్కనే కూర్చునేలా చేసాడు కదా ఆయన, సో ఇక చెప్పక తప్పలేదు. నన్ను రావద్దని చెప్పింది పెళ్ళికి, నేను రాలేనని చెప్పాను. ఎలా వెళ్తాం ఎంతైనా తను నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్, మర్చిపోలేను కదా ఆ జ్ఞాపకాలు. ఆ రోజు తనని నా పక్కనే వేసి చాలా మంచి చేసాడు దేవుడు, లేకపోతె తను ఎందుకు వెళ్ళిపోయింది అనే ప్రశ్న ఎప్పుడో ఒకసారి బాధపెడుతూనే ఉండేది నన్ను. ఆ తర్వాత్ తనని నేను చూసింది లేదు. లండన్ లో సెటిల్ అయ్యిందని విన్నాను, ఏదైనా హ్యాపీ తనకు నచ్చినట్టు ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత నేను అన్నయ్య చేసే కంపెనీ లో ఉద్యోగంలో చేరాను, అన్నయ్యకు అంజు కి ఈ మధ్యనే పెళ్లి చాలా సంబరంగా జరిగింది. రేడియో లో యెచటి నుండి వీచెనో పాట పూర్తయ్యింది, ఆ బస్సు ప్రయాణం నుండి ఇప్పుడు నేను ప్రయనించాల్సిన బస్సు దగ్గరికి వచ్చేసాను, ఈ సారి నా పక్కన సీట్ ఖాళీ కాదు నాతోడుగా నాకు కాబోయే భార్య కూడా ఉంది, ఇంకొన్ని రోజుల్లో మా పెళ్లి. :)
పాట అయిపొయింది, కథ పూర్తయ్యింది.