Chai Bisket’s Story Series – యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి! (Part -3)

(కథ మొదటి భాగం)
 
(కథ రెండవ భాగం)
 
ఆయన రాసిన స్క్రిప్ట్ కి మార్పులు ఉండవు, ఇంప్రూవ్మెంట్ ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా నీకు నచ్చినట్టుగా కొన్ని సార్లు, చచ్చినట్టుగా ఇంకొన్ని సార్లు నటించక తప్పదు. అందరూ ఆయన్ని దేవుడు అంటున్నారు నాకు మాత్రం ఆయనో ప్రశ్న. నా తెలివికి అందని, ఆలోచనకు చిక్కని, మనసును వదలని ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వెతకలేని వాళ్ళు, దేవాలయాలు కట్టి ఇదే నిజం అని తృప్తి పడుతున్నారు, వెతుకుతున్న వాళ్ళు అనంత విశ్వాన్ని కొంత కూడా విరామం లేకుండా శోదిస్తున్నారు, దొరికినవాళ్ళు అప్పటివరకు పడిన శ్రమని చూసి నవ్వుకుంటున్నారు. నేను ఏ వర్గానికి చెందినవాడినో తెలుసుకోలేక సతమతమవుతున్నాను. ఈ కథ కూడా ఆయన రాసిన స్క్రిప్ట్ యే కదా, ఫస్ట్ ఇయర్ లో నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. గమ్మత్తు ఏంటంటే ఆయన మా ఇద్దరికీ ఒకే పేరు రాసుకున్నాడు, హరి(హరిణి & హరీష్) అనే పిలుస్తారు అందరూ. భలేగా కలిపారు స్వామీ మీరు, మీకు చాలా రుణపడి ఉన్నాను ఒక్కసారి కనపడండి మహాప్రభు కృతఙ్ఞతలు తెలుపుకోవాలి. “రేయ్ నువ్వు మొదలెట్టింది ఏంటి…చెప్తుంది ఏంటి…అసలు కథ చెప్పరా డోంగ్రీ !!” అంటూ నా డిప్ప మీద ఒక్కటి వేసాడు(వేసినట్టు అనిపించిందో, అనుకున్నానో లేక నిజంగానే వేసాడో ఖచ్చితం గా చెప్పలేను!). ఇదో వింత ఊహ నాకు, ఆయన నేను చెప్పేది వింటునట్టు, నాకు సలహాలు ఇస్తునట్టు అనిపిస్తుంటుంది. “రేయ్ ఇక చాలు, అసలు కథ మొదలెట్టు !!”.
 
నేను, హరిణి, కార్తీక్ ముగ్గురం ఒకే ఏరియాలో బస్సు ఎక్కేవాళ్ళం. బస్సు స్టాప్ లో కలవటం అక్కడే బస్సు వచ్చేదాకా సొల్లు కబుర్లు చెప్పుకోవటం తో మొదలయ్యేది మా దినచర్య. మొదటి సంవత్సరం లో మేము జూనియర్స్ కనుక సీనియర్ లు జన్మ హక్కులా భావించే రాగింగ్ కు మేము రెడీ గా ఉన్నాం. మమ్మల్ని రాగ్ చేయటంతో మొదలయ్యేది మా సీనియర్స్ దినచర్య. అప్పట్లో ఇంకా రాగింగ్ పెద్ద నేరం కాదు, కాబట్టి మా సీనియర్స్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు మాతో. నిజానికి రాగింగ్ వల్లనే నేను హరి ఎక్కువ దగ్గరయ్యాం. తను నాకు కలవటానికి మా సీనియర్, అర్జున్ గాడు ఓ పెద్ద కారణం. అర్జున్ మా అన్న ఫ్రెండ్, పైగా మా వీధిలోనే ఉండేవాడు, సో నాకు క్లోజ్ ఏ. ఆ అమ్మాయి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందన్న విషయం చెప్పగానే నేను చూసుకుంటాలేరా అన్నాడు. అప్పుడు అర్ధం అవ్వలేదు ఏం చేస్తాడో వీడు అనుకున్నాను, కాని గొప్ప సాయం చేసాడు. ఇప్పటికే మీకు అర్ధం అయ్యుంటది నాకు రాగింగ్ ఏ రేంజ్ లో జరిగుంటుంది అనేది. స్టాప్ లోకి రాగానే అర్జున్ గాడు కూడా వచ్చేవాడు ఓ 5 నిమిషాల్లో, వాడు రావటం హరిణి ని పిలవటం ఆ తర్వాత నన్ను పిలవటం, ఒకరి గురించి ఇంకొకరు చెప్పుకొని, తన గురించి నేను నా గురించి తనని చెప్పమనేవాడు. ఆ తర్వాత పాటలు డైలాగులు జోకులు అంటూ వాడికి నచ్చింది చేయమనేవాడు. వాడు రాగ్ చేసేది మా ఇద్దరినే. అతడు సినిమా లో “నువ్వు ఆ తలుపు దగ్గర కూర్చొని ఎందుకు తెరుచుకోదా అని చూస్తున్నావ్…”అనే డైలాగ్ నేను హరి ఎన్ని సార్లు చెప్పుంటామో. మా అన్నకి తెలిసినవాళ్లు ఎక్కువ మంది నా సీనియర్స్ గా ఉండటం వలన రాగింగ్ నాకో ఫన్ లా ఉండేది. తనతో ఎప్పుడు మాట్లాడాలి అనిపించినా అర్జున్ గాడిని పిలిచేవాడిని వాడు తనని పిలిచేవాడు. అలా ఓ నెల రోజులు రాగింగ్ పేరుతో రోజు తనతో మాట్లాడేవాడిని. మొదట్లో తను పెద్దగా పట్టించుకునేది కాదు చిన్నగా పలకరించటం మొదలెట్టింది. బస్సు లో తను ముందు సీట్ లలో, నేను కార్తీక్ వెనక నుండి మూడో వరసలో కూర్చునేవాళ్ళం. అదేంటి అంత నిర్దిష్టం గా అంటారా, మరీ వెనకైతే మా బస్సు చేయించే బెల్లీ డాన్సులు తట్టుకేలెం అండి బాబు. రోజు కలిసి వెళ్ళటం, రావటం, ఇల్లు కూడా దగ్గరలోనే ఉండటం వలన నేను హరి కార్తీక్ ముగ్గురం మంచి స్నేహితులం అయ్యాం.
 
నాకు రాగింగ్ అంటే మర్చిపోలేని ఇంకో వ్యక్తి అంజలి అనే సీనియర్. మా సీనియర్స్, వాళ్ళ సీనియర్స్ లో తనకు లైన్ ఎయ్యని వాడు ఒక్కడు కూడా లేరంటే నమ్మండి. మన తెలుగు వాళ్ళకి అందం అంటే బాపు బొమ్మ కనుక తను బాపు బొమ్మలా ఉండేది. మంచి కట్టు, మైమరిపించే నడక, తన పెదాలు దాటుకు వచ్చేవి మాటలా సిరివెన్నెల రాసిన పాటలా అర్ధం అయ్యేవి కాదు. తనకు నేనంటే అభిమానం, ఎందుకంటే మనకి టాప్ రాంకర్ అనే బాక్గ్రౌండ్ చాలా దృడంగా ఉంది కదా. నా అదృష్టం తను కూడా మా స్టాప్ యే. నన్ను పలకరించకుండా ఒక్క రోజు కూడా ఉండేది కాదు. తను ఆ తర్వాత నాకు అత్యంత ఆప్తుల లిస్టు లో మిగిలిపోయింది, ఇప్పటికి కాంటాక్ట్ లో ఉంది. అర్జున్ గాడు అడగ్గానే ఎందుకు అంత హెల్ప్ చేసాడో అప్పుడు అర్ధం అయ్యింది. అంజు తో మాట్లాడటానికి వాడు నన్ను వాడుకున్నాడు. రాగింగ్ అంటూ నాకు చేసే హెల్ప్ కి ఈ అమ్మాయి తో వాడు మాట్లాడటానికి నేను హెల్ప్ చేసేవాడిని. ఇక మా కార్తీక్ గాడికి చదువు తక్కువ, తెలివి తేటలు ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ రాజకీయాలు సినిమాలు అన్నిటి మీదా మంచి గ్రిప్ ఉండేది వాడికి. చిన్నప్పుడు ఎప్పుడో విపరీతంగా ఆడిన బాస్కెట్ బాల్, వీడి వలన మళ్ళీ అంటుకుంది నాకు. మా కాలేజి గురించి చెప్పుకోటానికి ఉన్న ఒకే ఒక్క మంచి విషయం బాస్కెట్ బాల్ కోర్టు. క్లాస్ లు అవ్వగానే నేను కార్తీక్ కనపడేది కోర్టులోనే. కార్తీక్ గాడు పొట్టిగా ఉండేవాడు కాబట్టి గార్డ్ చేసేవాడు, నేను ఫార్వర్డ్ లో ఉండేవాడిని. పొట్టోడైనా ఫ్రీ త్రో వేయటం లో వాడి తర్వాతే ఎవడైనా, ఒక్కటి కూడా మిస్ అయ్యేది కాదు. నేను కెప్టెన్ గా కార్తీక్ గాడు ఇంకొంతమంది క్లాస్ లో వాళ్ళు కలిసి ఫస్ట్ ఇయరే కాలేజ్ గేమ్స్ లో రిజిస్టర్ చేసాం. నాకూ వాడికి తప్ప మిగత వాళ్ళకి ఎవ్వడికి అప్పటివరకు బాస్కెట్ బాల్ అనే గేమ్ ఒకటి ఉందని కూడా తెలీదు, సో ఫస్ట్ రౌండ్ లోనే బయటకి వచ్చేసాం. ఆ తర్వాత నేను వాడు కాలేజ్ టీం లో జాయిన్ అయ్యాం అనుకోండీ. అలా కొంత మంది సీనియర్స్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు మాకు.
 
ఫస్ట్ ఇయర్ మొదలై కొన్ని నెలలు దాటింది అనుకుంటా, ఒక రోజు హరిణి రాలేదు, అంత నిర్దిష్టం గా ఆ రోజు గురుండి పోవటానికి కారణం కార్తీక్ గాడి నుండి ఊహించని మాటలు వినటం. గేమ్ ఆడి ఇంటికి వెళ్తున్న టైం లో వాడు మామ నీకో విషయం చెప్పాలి రా అన్నాడు. ఏంట్రా! కొత్తగా ఈ నసుగుడేంది చెప్పు. “అది కాదు బే…కొద్దిగా నాసీరియస్ మేటరు”. ఏంట్రా ఇంట్లో ఎవరు లేరా! చందమామ కథలు(18+) తెమ్మందామా రాజ్ గాడిని !? “నీ అయ్యా అది కాదు రా అందుకే ముందే చెప్పా సీరియస్ అని, సర్లే వదిలేయ్”. ఓహ్ సీరియస్ ఆ సరే ఏంటి చెప్పు. “నువ్వెవరికీ చెప్పానని మాటిస్తేనే”. రేయ్ చెప్పరా బాబు మన గురించి చెప్పినా ఎవడు పట్టించుకుంటాడు చెప్పు, ఇంతకీ ఏంటి మేటరు. “అదే రా మన హరి ఉంది గా తను ఎందుకో నాకు ఈ మధ్య బాగా నచ్చేస్తుంది రా, రోజు చూడాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది తనతోనే ఉండాలనిపిస్తుంది తానంటే నాకు ఇష్టం మామ నువ్వే చెప్పాలి తనకి రేపు”. ఓర్నీ దీనికా ఇంతసేపు బస్సు కి బొక్కపడేలా కాలితో గీకుతున్నావ్, అంతేగా చెప్తాలే. “నువ్వు కేక మామ రేపు పార్టీ చేసుకుందాం”. సర్లే పదా మన స్టాప్ వచ్చేసింది. దిగేసి ఎవ్వరింటికి వాళ్ళు వెళ్ళాం. నాకు తనంటే ఇష్టమే కాని నేను చెప్పలేదు వాడు ముందు చెప్పాడు. చిన్న వయసులో అమ్మాయి మాట్లాడితే చాలు ప్రేమ అనుకునే పసి తనం కదా. ఇప్పుడు ఏం చేయాలి కార్తీక్ గాడు నాకు మంచి ఫ్రెండ్ మనిషి కూడా మంచోడు, హరిణి కూడా నాకు మంచి ఫ్రెండ్ నాకు తనంటే ఇష్టమే ఇప్పుడు ఏం చేయాలి వాడి ఇష్టం గురించి చెప్పకుండా నాకు ఇష్టం అని చెప్పేద్దమా !? చెప్పు తెగిపోదు కదా. పోనీ వాడి ఇష్టాన్ని చెప్పి చూద్దాం ఎలా రియాక్ట్ అవుద్దో తెలుస్తుంది కదా. అక్సేప్ట్ చేస్తే పరిస్తితి ఏంటి అనే భయం. వీడేంటి ఇలా షాక్ ఇచ్చాడు పోనీ రేయ్ తనంటే నాకు ఇష్టమే రా అని చెప్పేద్దామ వాడికి !? ఏం అనుకుంటాడో అని బాధ. ఏం చేయను చెప్తే నేను బెస్ట్ ఫ్రెండ్ గా మిగిలిపోతాను, చెప్పకపోతే ఓ మంచి ఫ్రెండ్ ని కోల్పోతాను…
 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,