Chai Bisket’s Story Series – యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి! (Part -2)

(కథ మొదటి భాగం)
 
సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం అంటే మా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అన్నమాట…నాకు మంచి ర్యాంకు వచ్చినా హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక మా టౌన్ లోనే టాప్(వాళ్ళు అలానే పబ్లిసిటీ ఇచ్చేవారు మరి) కాలేజి లో చేరాను. నా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా హైదరాబాద్ లో జాయిన్ అయ్యారు, సో కాలేజి మొదటి రోజు ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చింది. కాలేజి గేటు దగ్గర నేను చూసిన మొదటి వ్యక్తి తను. వాళ్ళ నాన్న ని కూడా లోపలకి పంపమని అడుగుతుంది నిజానికి గొడవ పడుతుంది వాచ్ మెన్ తో. అంతగా అరిచినా, గొడవ చేసినా, బతిమాలినా కోపంగా చూసినా పంపలేదు వాడు. నేను వెనుక వుండి మొత్తం చూస్తున్నాను. మొత్తానికి ఓ పదిహేను నిమిషాల తర్వాత లోపలకి వెళ్ళింది, వాళ్ళ నాన్న సాయంత్రం కాలేజి అయ్యేలోపు ఇక్కడే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్న పిల్లలా ఏడుపు మొహం తో వెనక్కి చూస్తూ వెళ్తుంది తను. నేను తననే చూస్తున్నాను. తన కళ్ళు మాట్లాడిన కొత్త భాష నాకు అర్ధం అవ్వలేదు కాని ఎందుకో తెలీదు చాలా బావుంది. తను చూసిన చూపు నా మస్తిష్కం లో ఇప్పటికీ నిలిచిపోయుంది. తన నడకలో భయం, మాటల్లో బెరుకు, కళ్ళలో కోపం, ముఖంలో బాధ చూసాను తోలి చూపులోనే. తను నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
 
నేను గేటు లోపల నిలబడి తన నుండి కళ్ళను మళ్ళించి మొదటి సారి కాలేజి చూసాను, నిజానికి అప్పుడు నాకు తెలీదు…నాకే కాదు ఆ వయసులో, ఆ సమయం లో ఎవ్వరికి తెలీదు…ఇక్కడే నాకు నిజమైన స్నేహం, అసలైన ద్రోహం, సిసలైన నమ్మకం, నాకే నేను గుర్తురాకుండా చేసే మరో హృదయం కలుస్తాయని, అన్నిటికంటే ముఖ్యంగా జీవితం అంటే ఏంటో తెలిసేది కూడా ఇక్కడే అని. ఇక మా కాలేజి ఎలాంటిది అంటే చెప్పుకోలేనంత చిన్నది కాదు అలా అని పెద్దగా చెప్పటానికి కూడా ఏమి ఉండేది కాదు. ఏదో…కూర్చోటానికి సౌకర్యంగా లేని బల్లలు, టీచ్ చేయటానికి అర్హతలేని మాష్టార్లు, భోంచేయటానికి పనికిరాని క్యాంటీను, ఆడుకోటానికి ఉపయోగపడని ఖాళీ స్థలం, కొన్ని వాహనాలకు మించి సరిపోని పార్కింగు, గాలి ఇవ్వని ఫ్యానులు, వెలుగు ఇవ్వని లైట్లు, ఇటుకలు కనిపించే గోడలు, క్రిటికల్ గా ఉండే ల్యాబులు, పని చేయని ఎక్విప్మెంట్లు, పని రాని అసిస్టెంట్లు, ఎప్పటికీ పూర్తవ్వని బిల్డింగులు, ఎప్పుడూ వేస్తూ ఉండే రంగులు, బోరుకొచ్చిన బస్సులు, తినలేని హాస్టల్ మెస్సులు…సింపుల్ గా చెప్పాలంటే మా కాలేజి గురించి ఎంత నీచంగా చెప్పినా తక్కువే… ఒక్క మాట గొప్పగా చెప్పినా ఎక్కువే.
 
మొదటి రోజు క్లాస్ లో పరిచయ వేదిక గురించి తెలిసిందే కదా, నూట ముప్పై కు పైగా ఉన్నాం మా బ్రాంచ్ వాళ్ళం. కాలేజీల్లో దిక్కుమాలిన పద్దతులు తెలిసిందే కదా, ర్యాంక్ పరంగా పిలవటం మొదలెట్టారు. నాదే మొదటి పేరు, ర్యాంక్ చదివారు, అంతా చప్పట్లు కొడుతున్నారు ఎందుకంటే నాకొచ్చిన ర్యాంక్ కు ఆ కాలేజి లో ఇంతవరకు ఎవ్వరు చేరింది లేదు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్నో వింత మనిషిలా, రోదసి నుండి వచ్చిన గ్రహాంతర వాసిలా కొత్తగా కూసింత ఆతురుత తో చూస్తున్నారు. నిలబడిన నన్ను అందరూ అడిగిన ప్రశ్న ఎందుకు ఈ కాలేజి అని, నేను అడిగాను ఎందుకు ఈ కాలేజి కాకూడదు అని. నా గురించి చెప్పి వచ్చేసాను. నా తర్వాత తన పేరు వచ్చింది, తనంటే గేటు దగ్గర అమ్మాయి, నాకు తనకు మధ్య దాదాపు పది హేను వేల ర్యాంకుల వ్యత్యాసం ఉంది. తను మా క్లాసే అని ఆనందం, తన గురించి అన్ని విషయాలు చెప్పింది, అవి తెలుసుకోవటం అదో ఆనందం. అప్పటికి ఇంకా మా దగ్గర ఫోన్ లు లేవు, ఏదో ఒకరిద్దరు రిచ్ కిడ్స్ దగ్గర తప్ప. ఆ తర్వాత అందరి పరిచయాలు అయిపోయాయ్. రెండు సెక్షన్స్ గా విడదీసిన తర్వాత మీది ఆ ధియేటర్ పక్కనా మాది అక్కడే ఇంతకీ ఎక్కడ మీ ఇల్లు. మీరూ ఆ ఊరు నుండే వస్తారా మాది ఆ పక్క ఊరే. మీరు ఆ కాలేజా నేను అదే. ఇలా ఎవ్వరికి వారు గుంపులుగా విడిపోయారు. నూట ముప్పై మందిని రెండు క్లాసులుగా విడదీసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో హాజరు పట్టిక తయ్యారు చేసారు. దేవుడికి నా మీద ఎంత ప్రేమో ఆ రోజే తెలిసింది, ఎలా అంటే తనని నా క్లాసు లో నే వేసాడు, తన రూల్ నెంబర్ కూడా నా తర్వాతే, బస్సు రూట్ కూడా ఒకటే, తను హరిణి చిన్నబోయిన, నేను హరీష్ సందెపోద్దుల .
 
మొత్తానికి మొదటి రోజు కొంత మంది పేర్లు తెలుసుకున్నాను, తన పేరు తప్ప ఇంకేం గుర్తులేవనుకోండి. కొత్త పరిచయాలు పరిమళించిన పరవశంలో కొన్ని రోజులు అలా అలా గడిచిపోయాయ్. రోజులు రైలు కంటే వేగం గా పరిగెత్తాయ్. నాకు ఇంజనీరింగ్ అనగానే గుర్తొచ్చే ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు కార్తిక్ ఇంకోడు వంశీ. ఒకడు నిజమైన స్నేహానికి నిదర్శనం అయితే ఇంకోడు వంచనకు ద్రోహానికి ప్రతిరూపం. ఇష్టపడిన అమ్మాయిని మర్చిపోయి సాయం చేసిన గుణం ఒకడిది, అమ్మాయి కోసం స్నేహితుడ్ని మోసం కాదు ద్రోహం చేసిన గుణం ఇంకొకడిది. అసలు కథ మొదలయ్యింది ఫస్ట్ ఇయర్ మొదలైన ఆరు నెలల తర్వాత, అప్పటివరకు ఎవరు ఎలాంటి వారో తెలీలేదు. ఆరు నెలలు ఎక్కువో తక్కువో తెలీదు కాని ఆ రోజు జరిగిన విషయానికి నాకు దిమ్మ తిరిగి పోయింది. అంత నీచంగా కూడా ఉంటారా మనుషులు, మరీ అంత దారుణంగా నా…
 
మిగతాది
యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి – కథ మూడవ భాగం లో…

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,