Chai Bisket’s Story Series – యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి! (Part -1)

దిల్షుఖ్ నగర్ బస్సు స్టాండ్, రాత్రి 12 గంటలు దాటి ఐదు నిముషాలు కావొస్తుంది, పక్కనే ఉన్న టీ షాప్ లోని రేడియో లో తరువాత రాబోయే పాట అప్పు చేసి పప్పు కూడు(1959) సినిమాలోని “యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి” అని వినిపిస్తుంది. ఆ షాప్ కి దగ్గరలో కూర్చుని బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను నేను, వాడ్ని కొద్దిగా సౌండ్ పెంచమని అడిగాను. పాట మొదలైంది, యాబై ఏళ్ళ వెనుకటి పాట తో పాటు నేను కూడా అందులో పదో వంతు అంటే ఐదేళ్ళు వెనక్కి వెళ్లాను. తేది గుర్తులేదు కాని సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇక్కడే కలిసాను తనని, ఒక్క పది సెకండ్లు లేటు అయినా నా జీవితం వేరేలా ఉండేదేమో.
 
అది ఏదో పండుగ టైం, హైదరాబాద్ లో తెలిసిందేగా ఆ టైం లో బస్సులు ఎంత కిక్కిరిసి పోతాయో, నేను ఉండేది కూకట్ పల్లి లో ఐనా అదృష్టవశాత్తు నాకు రిజర్వేషన్ దొరికింది దిల్షుఖ్ నగర్ నుంచి. ఆఫీసు నుండి త్వరగా వచ్చేసి ఫ్రెష్ అయ్యి లగేజి తీసుకొని దిల్శుఖ్ నగర్ బయలుదేరాను. కిక్కిరిసిన లోకల్ బస్సులో విశ్వ ప్రయత్నం చేసి లగేజి తో సహా ఎక్కేసాను మొత్తానికి. అది బస్సా, జెమినీ సర్కస్సా అనేది తెలీలేదు ఓ రెండు క్షణాలు, ఎందుకంటే సర్కస్ లో చేసే విన్యాసాలు ఇక్కడ చూసే వాటికి ఏ మాత్రం సరిపోవంటే నమ్మండి. 40 మంది కూర్చునే సామర్ధ్యం ఉన్న బస్సు లో 120 మంది వరకు ఉండి ఉంటారు. వారిలో ముసుగులు ధరించిన ఆడపిల్లలు, సీట్ కోసం మల్లయుద్ధాలు చేస్తున్న మహిళలు, నిలబడ లేక, కూర్చునే చోటు లేక అవస్థ పడుతున్న ముసలివాళ్ళు, అంత గందరగోళం లోను అమ్మాయిలకు సైట్ కొట్టే కుర్రాళ్ళు, దొరకునా ఇటువంటి సమయం అనుకుంటూ తమ హస్త కళ ప్రదర్శించే చొర శిఖామణులు, దిగాల్సిన చోటు ఎప్పుడు వస్తుందో తెలీనివాళ్ళు, దిగాల్సిన చోటు దాటినా పట్టించుకోలేనంత నిద్రలో ఉన్న అలసిన మనుషులు మరియు ఊరికి వెళ్ళాల్సిన బస్సు మిస్ అవుద్దేమో అని ఆరాట పడే నాలాంటి వాళ్ళు.
 
సాధారణంగా 45 నిముషాలు పట్టే ప్రయాణం ఆ రోజు ఉన్న రద్దీ వలన దాదాపు రెండు గంటలు పట్టింది. మొత్తానికి దిగ్విజయంగా రాత్రి 11.45 కు దిల్శుఖ్ నగర్ చేరాను. టైం చూసాను, నేను రిజర్వు చేయించుకున్న బస్సు బయలుదేరాల్సిన సమయం దాటి దాదాపు గంట ఎక్కువ అయ్యింది. కాని నా అదృష్టం, ఆ బస్సు ఇంకా రాలేదని చెప్పారు. నిద్రపోకుండా ఉండేందుకు ఓ టీ తీసుకొని వాడి షాప్ ఎదురుగా తాగుతూ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను, టీ షాప్ లోని రేడియో లో “యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి” పాట వస్తుంది, ఎంత యాదృశ్చికం నిజంగానే చల్లటి పవనం వీస్తుంది నా వెనుక నుండి. అప్పటివరకు పట్టించుకోలేదో లేక ఈ పాట వలన పట్టించుకున్నానో తెలీదు కాని సడన్ గా గాలి ఎక్కడి నుండి వస్తుందా అని వెనక్కి తిరిగి చూస్తున్నాను, అంతసేపు వెనుక ఉన్న బస్సు, అప్పుడే వెళ్తుంది, ఓహ్ అదా సంగతి అనుకోని ముందుకు తిరుగబోతుంటే ఎవరో అమ్మాయి వస్తున్నట్టు కనిపించింది. మళ్ళీ వెనక్కు తిరిగి చూసాను, చల్లటి గాలిలో మెల్లగా నడుచుకుంటూ వస్తుందో ఆడపిల్ల. మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఉన్నా కూడా నాకెందుకో నచ్చేసింది. ఒక్కసారిగా నిద్రమత్తు వీడి పోయింది, తననే చూస్తూ ఉండిపోయాను. తను నేను కూర్చున్న వరస లోనే పక్క బల్లపై కూర్చుంది. నిమిషానికి 20 సార్లు కొట్టుకునే నా కళ్ళు ఇరవై నిమిషాలైన కదలకుండా చూస్తూనే ఉన్నాయ్ తనని.
 
టీ కి డబ్బులు ఇచ్చి వచ్చేలోపు ఎటో వెళ్ళిపోయింది. బస్సు స్టాండ్ మొత్తం వెతికాను కాని ఎక్కడా కనిపించలేదు. భ్రమ కాదు కదా అనే సందేహం, భ్రమ కాకూడదు అనే బాధ, భ్రమ ఏమో అనే భయం ఒకేసారి నాకు కలిగాయి. ఈ లోగా నేను ఎక్కాల్సిన బస్సు వచ్చేసింది, నేను తనకోసం వెతుకుతున్నాను. మైక్ లో నా సీట్ నెంబర్ చెప్తున్నారు, అది నిద్రలో వచ్చిన కలేమో అని సర్దిచెప్పుకొని బస్సు ఎక్కాను. నా పక్క సీట్ లో ఎవరో అమ్మాయి కూర్చుంది ముఖానికి ముసుగుతో, తనే అయితే బావుండు అనే ఆశతో వెళ్లి కూర్చోబోతున్నాను, ఈలోపు మీరు నా సీట్ లో కూర్చుంటారా బాస్, తను నా గర్ల్ ఫ్రెండ్ ప్లీజ్ అని అడిగాడు ఒకతను. నేను ఎలా నమ్మాలి అన్నట్టు చూసాను వాడిని. కావాలంటే ఫోటో చూడండి అని వాడి ఫోన్ చూపించాడు, దానితో తను ఈ అమ్మాయి కాదు అని తెలిసింది. మీ ఇద్దరి ని విడదీసిన పాపం నాకెందుకులే అనుకోని వెళ్లి వాడి సీట్ లో కూర్చున్నాను. నా పక్క సీట్ ఖాళీగా ఉంది, బస్సు స్టార్ట్ అయ్యింది. విండో మూసేసి నిద్రలోకి జారుకున్నాను.
 
కొద్దిసేపటి తర్వాత బస్సు ఆగింది, మిగిలిన సీట్ లన్ని ఫిల్ అయ్యాయ్. మన పక్కనా ఎవరో కూర్చున్నారు. కూర్చునే ముందు సీట్ మార్చండి అని కండక్టర్ తో గొడవ పడుతుంది, కాని అందరూ కపుల్స్ ఏ అవ్వటం వలన ఎవ్వరూ మారటానికి ఒప్పుకోలేదు అనుకుంటా, తప్పక నా పక్కనే కూర్చున్నారు. ఇవన్నీ నిద్రలో ఉన్న నాకు కొద్ది కొద్దిగా వినిపిస్తున్నాయ్. ఒక పావు గంట తర్వాత దాహం వేసి లేచాను, నా పక్క సీట్ లో అమ్మాయి ఫోన్ లో చాట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిద్ర మత్తు లోనే తను బస్సు స్టాండ్ లో చూసిన అమ్మాయే అని తెలిసింది నాకు. స్కార్ఫ్ వలన మొహం మట్టుకు కనిపించటం లేదు, ఒక్క సారిగా నిద్రమత్తు వీడిపోయింది. సడన్ గా ఎక్కడికి మాయం అయ్యారండి అని అడిగాను నేను. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది కదా వినిపించలేదు తనకు. పరిచయం లేని అమ్మాయిని వెంటనే అడిగేస్తే బావోదు అనిపించి, నీళ్ళు తాగుతున్నట్టుగా నటిస్తూ తన మెడ, కాళ్ళ వైపు చూస్తూ పెళ్లయిందా లేదా అనే బేసిక్ పాయింట్ ని చెక్ చేసుకున్నాను. హమ్మయ్య పెళ్లి కాలేదు.
 
కాలేదు సరే మాట్లాడటం ఎలా, అప్పటివరకు పెద్దగా అమ్మాయిలతో మాట్లాడింది లేదు, నిజానికి ఎలా మాట్లాడాలో తెలీదు. వాస్తవానికి చిన్నప్పటి నుండి బాయ్స్ స్కూల్ లో పెరిగిన వాళ్ళం కదా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో అంత అలవాటు లేదు. పైగా మనం పెద్ద అందగాళ్ళం కూడా కాదు కదా అదో భయం. గతం లో జరిగిన కొన్ని సంఘటనల ప్రభావం కూడా గట్టిగా ఉంది లెండి. కాని చాలా కాలం తరవాత ఒక అమ్మాయిని చూసి మనసులో ఏదో అలజడి మాటల్లో చెప్పలేనిది, మీకూ ఎప్పుడో ఒకసారి కలిగే ఉండొచ్చు, మాట్లాడటం ఎలా అని నాలో నేను ఈ విధం గా తర్జన భర్జనలు పడుతుంటే, తనే పిలిచింది నన్ను. కొద్దిగా విండో క్లోజ్ చేస్తారా అంటూ. లూజ్ గా ఉందండి ఇందాకటి నుండి ఇదే పని నాకు, నిద్ర కూడా సరిగా పట్టటం లేదు అని చెప్తూ క్లోజ్ చేసాను. ఇంతకీ పెళ్లయిందా అని అడిగింది తను. నాకు మొదట అర్ధం కాలేదు, ఏం అడిగారు ? పెళ్లయిందా అనేనా, లేదండి. మీకూ ? అవ్వలేదులే. ఒక్క సమాధానం తో నాలో ఎన్నో సందేహాలు రేపింది, ముందుగా లే అంటూ ఏదో తెలిసిన వాళ్ళకి చెప్పినట్టు మాట్లాడుతుందేంటి, ఇంతకీ అమ్మాయిలు పెళ్లి గురించి అడుగుతారా అంత సడెన్ గా. ఇలా నాలో నేను మాట్లాడుకుంటుంటే… ఇంకా ఏం మారలేదబ్బాయ్ నువ్వు అంది తను. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది నాకు, అబ్బాయ్ అని పిలిచేది తనే, ఆ స్వరం కూడా.. నా గుండె నిమిషానికి సాధారణం కంటే రెట్టింపు సార్లు కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది నాకు, తనా కాదా, తనేనా…నాలుగేళ్ళ క్రితం నేనేం చేసానో తెలుసుకోకుండా, కనీసం అడగకుండా విడిచి వెళ్ళిపోయిన తనేనా నా పక్కన ఉంది. తను వెళ్ళిపోతూ చూసిన చివరి చూపు, ఆ క్షణం లో నా మనసు పడిన వేదన, నా చుట్టూ ఉన్న వాళ్ళు అన్న మాటలు, తను ఎందుకు వెళ్తుందో తెలీని ఆవేదన అన్నీ గుర్తున్నాయ్ నాకు. ఎలా మరచిపోగలను, మర్చిపోవటానికి అవేమైనా జ్ఞాపకాలా…కాదు శాసనాలు, నా జీవితం లో ఆనందాన్ని, సంతోషాన్ని హరించి వేసిన మరణశాసనాలు…
 

మిగతాది
యెచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి – కథ రెండవ భాగం లో

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , ,