జరిగిన కథ... (Parts 1, 2, 3, 4, 5, 6)
మీ అల్లుడు అవ్వటానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ముందు మీ దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం ఉందేమో ఆలోచించుకోండి. మూడు రోజులు మంచిగా ఉనంత మాత్రాన మంచోడు అయ్యానా ? మీకు నక్చితే చాలా మీ అమ్మాయి అభిప్రాయం అవసరం లేదా ? తన మీద ప్రేమతో ఈ పెళ్లి అంటున్నారా లేక తనెవరినైనా ప్రేమిస్తుందేమో అనే భయంతో అంటున్నారా ?. వీటికి సమాధానం నాకు చెప్పాల్సిన అవసరం లేదండి, మీకు తెలిసుండాలి లేకపోతె మొన్న చూసినట్టు బాధలో ఉండే అమ్మాయే మీకు జీవితాంతం కనిపిస్తుంటుంది. అంకుల్, అల్లుడంటే మీకు నచ్చినట్టు ఉండే వాడు కాదు, మీ అమ్మాయికి నచ్చాల్సిన వాడు. అల్లుడి దగ్గర చూడవలసినది భరోసా కాదు , భాద్యతగా చూసుకోగలడా అని చూడాలి. బాధలో ఉన్నప్పుడు ఓదార్చటమే కాదు, బాధ పెట్టకుండా ఉండేవాడు కావాలి, అల్లుడు అంటే మీకు ఓ గౌరవం మాత్రమే, కానీ మీ అమ్మాయికి అతనే జీవితం. అలాంటిది, తన జీవితానికి సంబందించిన అత్యంత కీలక విషయం పై తన అభిప్రాయం కొంత కూడా తీసుకోకుండా మీకు నచ్చినట్టు ఎలా నిర్ణయిస్తారండి !? నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్ధం అవుతునట్టు లేదు, కొద్దిసేపటి తర్వాత తేరుకున్నారు కాని అర్ధం అయ్యిందో లేదో తెలీదు. మీ అమ్మాయి మా ఇంటికి కోడలిగా రావాలని నాకు ఉందండి, కాని నాకు భార్య గా కాదు ఇంకో అమ్మ గా, వదినమ్మ గా వస్తే మా ఇంట్లో అందరికి సంతోషమే.
"రేయ్...నువ్వేనా మాట్లాడేది, వెర్రి వెలక్కాయ్ వి అనుకున్నాను రా నిన్ను, నీలో ఇలాంటి ఆలోచనలు పెట్టిన నన్నే మైమరపించావ్, నీ వయసుకు మించిన మాటలే అయినా మంచి మాటలు చెప్పావ్." అని ఆయన మెచ్చుకున్నాడేమో అనిపించింది.
అవును వదినమ్మ గా రావాలి ఎందుకంటే మా అన్నకి అంజు అంటే ఇష్టం.వాడి గురించి చెప్పలేదు కదా...మా అన్నకి అంజు అంటే మొదటి నుండి ఇష్టం, అంజు కి అర్జున్ గాడిపై ఇష్టం ఉండేది. అన్న ఎప్పుడు చెప్పలేదు అంజుకి వాడి ఇష్టం గురించి. కాని అంజు వెంటే ఉండేవాడు ఎప్పుడూ. అర్జున్ గాడు అంజు ని టచ్ చేయలేదంటే అన్న వల్లనే. అర్జున్ గాడి దరిద్రపు చూపులు అంజుని తాకకుండా కాపాడే వాడు మావోడు. అంజు కి అర్జున్ పై ప్రేమో ఇష్టమో తెలీదు కాని, అర్జున్ గాడి మాటలకు అమ్మాయిలు వాడ్ని ఇష్టపడకుండా ఉండలేరు. అంజు కూడా అంతే అనుకుంటా, ఆ ఇష్టాన్నే ప్రేమని అనుకోని ఉంటుంది. మా వాడు చాలా ముక్కుసూటి మనిషి, ఏదైనా ముఖం పై చెప్పే మనస్తత్వం, నిజానికి వాడి ప్రవర్తన చూస్తే ఈ టైం పాస్ లవ్ జనరేషన్ కి ఇసుమంత కూడా సరిపోడు వాడు. ఎన్నో సార్లు చెప్పాను వాడికి, ఎంత ముక్కు సూటి మనిషైన తక్కువ ఎత్తు గుమ్మం వస్తే తల దించుకు వెళ్ళాలి రా, అలా కాదు నేను నిటారుగా వెళ్తా అంటే ముక్కు పగిలేది ఎవడికి అని. అస్సలు పట్టించుకునే వాడు, వాడి సిద్ధాంతాలు వాడివి, అలా చెప్పినప్పుడల్లా మనుషులు ఎంతగా ఎదిగినా తినాల్సింది నోటితోనే కదరా అనేవాడు. మా అన్నయ్య అని చెప్పటం కాదు కాని మంచితనంతో, కొన్ని సిద్ధాంతాలు, కట్టుబాట్లు పెట్టుకు బతికే అతికొద్దిమంది గొప్పవాళ్ళలో మా వాడు ఒకడు. వాడి ఆకారం ఇష్టపడేట్టుగా, ప్రవర్తన మెచ్చుకునేట్టుగా, మాటలు సూటిగా, ఆలోచనలు మనం అర్ధం చేసుకోలేనట్టుగా ఉంటాయి.
అలాంటివాడు ప్రేమిస్తాడని నేను ఊహించలేదు. వాడూ మనిషే కదా. అంజు ని ప్రేమించాడు అంటే తక్కువ మాట అవుతుంది ఆరాధించాడు అనటం సమంజసం. అంజు పై వాడి ప్రేమ సముద్రం కంటే లోతైనది, ఆకాశం కంటే విశాలమైనది. అర్జున్ ఎపిసోడ్ తెలిసిన రోజు చాలా బాధ పడ్డాడు, అర్జున్ తో అంజు కట్ చేసుకుంది కదా ఆనందపడతాడేమో అనుకున్నాను నేను.నిజమైన ప్రేమ లో ప్రేమించిన వ్యక్తి ఆనందం గా ఉంటేనే కదా ఏ ప్రేమికుడికైనా ఆనందం. అర్జున్ తో పెద్ద గొడవ పెట్టుకునేవాడు నేను లేకపోయుంటే. అర్జున్ నుండి అంజు బయటకి రావటానికి మా అన్న ప్రేమ బాగా ఉపయోగపడింది. అలా అని చెప్పి, అంజు బాధని అవకాశంగా వాడుకోలేదు వాడు, కేవలం ఒక స్నేహితుడుగా అంజు ని ఓదార్చాడు. అప్పట్లో తనని రోజు మా ఇంటికి తీసుకొచ్చేవాడిని కొత్త ప్లేస్ లో కొన్ని ఆలోచనలకు దూరంగా ఉంటుందని. ఇంటికి తీసుకురావటం, తీసుకెళ్లటం వరకే నా పని మా ఇంట్లో ఉన్నంతసేపు మావోడు తనని చూసుకునేవాడు. కొన్ని రోజులకు వాడి ఇష్టం గురించి అంజు కి చెప్పేసాడు మా వాడు, తనకి మా అన్నయ్య పై ఇష్టం మొదలయ్యింది.
నేను ఇదంతా అంజు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పాను, వాళ్ళు మా అన్నయ్యని చూడాలన్నారు. మా వాడ్ని చూసాక, వాడి మాట తీరు, పద్దతి అన్ని నచ్చేసాయ్ వాళ్ళకి. అంజు ని అడిగారు, తనకేలాగు ఇష్టమే కదా వెంటనే ఒప్పేసుకుంది. కాని మా వాడు పెళ్లి ఇప్పుడే వద్దు, నేను సెట్టిల్ అయ్యాక చేసుకుంటాం, అప్పటిలోపు మీకు ఇబ్బంది అంటే మా ఇంటికి తీసుకువెళ్తాను తనని, మా అమ్మా నాన్నకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పాడు. వాళ్ళకి అలా చెప్పటంతో మా వాడి మీద అభిమానం ఎవరెస్ట్ ఎత్తుకు ఎదిగింది. అర్జున్ గాడి వల్ల మా అన్నయ్యకి నచ్చిన అమ్మాయే మా వదిన అవ్వటంతో నాకు వాడి మీద కోపం లేకుండాపోయింది. ఎంతైనా నువ్వు గ్రేట్ స్వామీ, పిర్ర మీద గిల్లి ఎడ్చేలోపు పల్లి చెక్క నోట్లో పెట్టేస్తావ్, నా కథలో నువ్వు పెట్టె మలుపులు కనపడక మొదట ఇబ్బందిగా అనిపించినా, ఆ మలుపుల మాటున దాచిన ఆశ్చర్యకరమైన ఆనందాల కోసం ఎన్ని మలుపులైన అలుపు లేకుండా వెళ్ళాలనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది గురువు గారు చాలా చాలా థాంక్స్.
దేవుడు నవ్వుతున్నాడు నేను ఇలా చెప్తుంటే, ఈ సారి రాబోయేది మలుపు కాదు గోతి అన్నట్టు, దానికి నేనెలా స్పందిస్తానో అనే ఉత్సాహం కనిపిస్తుంది ఆయన నవ్వులో... అలా ఆలోచన వచ్చిందో లేదో ఇలా మెలిక పెట్టేసాడు. అంజు మేటర్ లో పడి హరి ని పెద్దగా పట్టించుకోలేదు, తనకు నా మీద కోపం అంటూ లేదు కాని కొద్దిగా బాధపడినట్టు తెలుస్తుంది. ఆయన పెట్టిన మెలిక కొన్నిరోజుల వరకు నాకు తెలీలేదు, హరి నాతో ఒక విషయం చెప్పటానికి సంకోచిస్తుంది అని తెలిసింది ఓ రోజున. హరి కి పెళ్లి చేయాలని వాళ్ళింట్లో వాళ్ళు అనుకుంటున్నారు, అది నాకు ఎలా చెప్పాలో తెలీలేదు తనకి, మొత్తానికి నేనే అడిగాను ఏంటి విషయం అని. తను చెప్పింది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావ్ అన్నాను. తన దగ్గర సమాధానం లేదు.
మా ఇంట్లో చెప్పటానికి నాకేం సమస్య లేదు, మా వాళ్ళు ఒప్పుకుంటారు, కాని తనకి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ, వాళ్ళ నాన్నకి తన మీద ఉన్న ప్రేమ వలన మా ప్రేమ గురించి తను చెప్పలేక పోతుంది. మా ప్రేమ గురించి చెప్పటానికి ఆ ప్రేమొక్కటే కారణం కాదు, భయం, బాధ కూడా ఉన్నాయి. మా ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కాదన్న భయం, ఈ విషయం తెలిస్తే ఒప్పుకోరన్న బాధ. మొదటి సారి నాకో కొత్త అనుభూతి, ఇద్దరు మనుషులు కలిసి ఉండటానికి కావాల్సింది ప్రేమ కాదు, అంతకంటే అతి ముఖ్యం సామాజిక వర్గం అనే కొత్త విషయం నా మనసులో ముద్రించుకుపోయింది. చాలా రోజులు నడిచింది ఈ వ్యవహారం, తనకు చెప్పే ధైర్యం లేకపోతె నేను చెప్తాను అన్నాను, కాని తనకి అలా ఇష్టం లేదు. మొత్తానికి ఒక రోజు తనకు కావాల్సిన ధైర్యం వచ్చేసింది, ఆ రోజు తను వాళ్ళ నాన్నకు చెప్పేసింది మా గురించి. ఆయన ఏమన్నారో తర్వాత రోజు చెప్తాను అని చెప్పింది. ఆ తర్వాత రోజుని నేను కలలో కాదు కదా, కోమాలో ఉన్నా మర్చిపోలేను, ఎందుకంటే ఆ రోజు వల్లనే ఈ రోజు నేను ఈ కథ రాస్తున్నాను, లేకపోతె మా కథ ఇంతమందికి తెలిసే అవకాశం వచ్చుండేది కాదు...
మిగతాది Part-8 లో...