(మొదటి భాగం)
(రెండవ భాగం)
(మూడవ భాగం)
కార్తి గాడు నువ్వే అడగాలి రా అని నాతో సులువుగా చెప్పేసాడు, కాని హరి ని ఆ విషయం గురించి అడగాలంటే అప్పటి వరకు నాకు పరిచయం లేని కొత్త భావన ఒకటి కలిగింది నాకు. తనని అడగటం వలన నాకు రెండు విషయాలపై స్పష్టత వస్తుంది. ఒకటి తనకి కార్తీ గాడంటే ఇష్టమా కాదా అని, రెండు ఇలాంటి ఇష్టం పైన తన అభిప్రాయం ఏంటి అనేది. ఈలోపు స్టాప్ కి వచ్చింది తను, వస్తూనే "ఏంటి సర్ ఈ రోజు టైం కంటే ముందే వచ్చారు ఏంటి సంగతి ?". నిన్న మేడం గారి దర్శనం అవ్వలేదు కదా చూద్దాం అన్న తొందరలో వచ్చేసా."అబ్బో ! ఈ కొత్త మార్పులు ఎప్పటి నుండో ? ". మొదటి నుండి ఉంది నీకే తెలీలేదు. "ఏంటో అది ?". ఓ విషయం అడుగుతా తప్పుగా తీసుకోవుగా. "ఏంటోయ్ కొత్తగా...అడుగు మనలో మనకేంటి చెప్పు". తనేంటి ఇంత సాధారణంగా తీసుకుంటుంది, తనకి అర్ధం అవ్వటం లేదా, లేక కావాలనే నటిస్తుందా !. నాకు ఇలాంటి పరిస్తితి వస్తుందని కలలో కూడా కలగనలేదే, ఎవడి కోసమో నేను అడగటం ఏంటి నా కర్మ కాపోతే, ఎవడో కాదులే కార్తీ గాడు చాలా మంచోడు మొదటి సారి సాయం అడిగాడు చెయ్యాలి, కాని వాడు చేయమన్న సాయం నాకు అన్యాయాం చేసేలా ఉందే, ఏవయ్య ఇదేమైన బావుందా...హరి నాది అని చెప్పావ్ మరి ఇదేంటి, కార్తి గాడికి తన మీద ఇష్టం కలిగేలా ఎందుకు చేసావ్, అస్సలు బుద్దుందా నీకు, ఒక్క సారి కనపడు చెప్తా నీ సంగతి, దేవుడు అంటే ఇలానేనా చేసేది ఇద్దరి మిత్రుల మధ్య గొడవ పెట్టి నవ్వుకుందాం అనుకున్నావా, నీ పప్పులు నా దగ్గర కాదు, అడిగేస్తా హరి ని, నాకేమన్న భయమా, నా మనసులో జరుగుతున్న ఈ అలజడికి నా పరిస్తితి చూసి నీల్లోచ్చేలా నవ్వుతున్నట్టు ఉన్నాడు ఆయన, వర్షపు జల్లులు కురిపిస్తున్నాడు. ఇలా నాలో నేను మాట్లాడుకుంటుంటే...
"ఏయ్...నువ్వు ఇప్పట్లో అడిగేలా లేవ్ కాని నేనో విషయం అడగనా ?". ఆయనతో నా చాట్ కట్ చేసి, హరి తో ఏంటో అడగండి మేడం. "ఉన్నట్టుండి ఏదో ఆలోచనలోకి వెళ్లి పోతావ్, పిలుస్తున్నా పలకావ్ నీకేమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా !?". హ హా హ హా..."ఎందుకు నవ్వుతున్నావ్, ఇదోటి...ఏదైనా అడిగితె ఇలా అసహ్యంగా పల్లికిలిస్తావ్". వెంటనే నవ్వటం ఆపేసి,సమస్య అంటూ ఏం లేదమ్మా, అప్పుడప్పుడు నాలో నేనే మాట్లాడుకుంటా అంతే, దాన్నే అంతరంగిక శోధన అంటారు ఆధ్యాత్మిక బాషలో. "అవునా...దాన్నేవెర్రి అని కూడా అంటారేమో వ్యవహారిక బాషలో". మనకు అర్ధం కాని దానికి ఏదోక పేరు పెట్టి తప్పించుకోవటమే కదా మనకు తెలిసింది. "అంతగా అర్ధం కానివి ఏమున్నాయో తమరికి ?". ఆ విషయాల గురించి చెప్పే ఆసక్తి నాకుంది కాని వినే అర్హత నీకుందా ? "ఏంటో నువ్వు...అప్పుడప్పుడు ఏం మాట్లాడుతావో నీకైనా అర్ధం అవుద్డా ! ఇంతకీ కార్తీ ఏడి ? ". వాడు లేట్ గా వస్తా అన్నాడు. "తను ఉన్నా బావుండేది చక్కగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం". ఏంటో నాతో చెప్పకూడని అంత రహస్య కబుర్లు ? ". నీకు నాతో మాట్లాడే టైం ఎక్కడిది బాబు, నీలో నువ్వు మాట్లాడుకోటానికే సరిపోతుందో లేదో కదా !". హ హా హ హా...ఇంకెప్పుడు నీతో ఉన్నప్పుడు అలా ఉండనులే. అదోలా చూస్తుంది తను...కనీసం ఉండటానికి ప్రయత్నిస్తా సరేనా. ఏంటి విషయాలు, అవును నిన్నెందుకు రాలేదు. "మా మామ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటేను వెళ్ళాను." మామ అనగానే అంతరంగాలు సీరియల్ పేరు పడేప్పుడు చక్రం తిరిగినట్టు గా గిర్రున తిరిగాయ్ ఎన్నో ప్రశ్నలు నా మైండ్ లో, పెద్దోడా చిన్నోడా, పెళ్లయిందా లేదా, అయితే పిల్లలు పెద్దోల్లా చిన్నోల్లా, తనకి వరస అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా...బాబోయ్ ఏంటి నేనేనా, ఈ ప్రశ్నలేంటి అనుకుంటూ, ఆ ప్రశ్నోత్తరాల ఛానల్ మార్చేసి, తన ఛానల్ కి ట్యూన్ అయ్యి, మీ మామ వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ అని అడిగాను. "మా మామకి ట్విన్స్ పుట్టారు, వాళ్ళ నామకరణం చేసారు నిన్న". హమ్మయ్య ! "ఏంటి ?". ఏం లేదు బస్సు వస్తుంది పదా అని బస్సు ఎక్కి కూర్చున్నాం.
మా కాలేజికి వెళ్ళటానికి 45 నిమిషాలు పట్టేది మా ఏరియా నుండి. అప్పటివరకు ముందు కూర్చునే తను ఆ రోజు నేను కూర్చున్న సీట్ ముందు సీట్ లో కూర్చుంది. అదేంటి ఈ రోజు సీట్ మారింది అని అడిగాను. "నీతో మాట్లాడుదాం అని వచ్చాను, ఏ వద్దంటావా !?". అలా అని కాదు స్వామీ, సర్లే చెప్పు. "ఇంతకీ ఏదో అడగాలి అన్నావ్, ఏంటది." అదా మన కార్తీ గాడికి నువ్వంటే ఇష్టం అంటా, వాడి మీద నీ అభిప్రాయం ఏంటో నన్ను తెలుసుకోమన్నాడు. అలా అడగ్గానే తన ముఖ కవళికల్లో చాలా మార్పొచ్చింది. "ఇప్పుడే చెప్పాలా రేపు చెప్పినా ఓకే నా ?". నీ ఇష్టం అమ్మా, ఇప్పుడు అయితే నాకు చెప్పు, రేపైతే వాడికి నువ్వే చెప్పేయ్. తన ముఖం లో ఏదో సందిగ్దం, బాధ, కోపం, చిరాకు అన్నీ, కొద్ది కొద్దిగా ముబ్బుల మాటున దాగిన వెన్నెల లా కనిపించి కనిపించకుండా కనిపిస్తున్నాయ్. "సరే నేను ముందుకు వెళ్తున్నా". అదేంటి నాతో మాట్లాడటానికి కూర్చున్నా అన్నావ్. " రాధ తో కొద్దిగా పని ఉందిలే" అంటూ ఆతురుతగా ముందుకు వెళ్ళిపోయింది. ఏంటో ఏం మాట్లాడాలని నా ముందు కూర్చుంది, ఏం పని గుర్తోచి ముందుకు వెళ్ళిపోయింది, ఏంటో ఈ అమ్మాయిలు చేసే వాటిని అర్ధం చేసుకోవటం కన్నా బుద్దితక్కువ పని ఇంకోటి ఉండదు అనుకుంటా. తన సమాధానం కోసం రెండు హృదయాలు రెండు భావనలతో వేచిచూస్తున్నాయి, ఒప్పుకోవాలని ఆశతో కార్తిగాడు, ఒప్పుకుంటుందేమో అన్న భయం తో నేను. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నేను మనిషినే కదా, స్వార్ధం అనే పదార్ధం గట్టిగా పట్టి ఉన్న ఒళ్ళు కదా మనది, వాడి కోసం అనే చేసాను కాని నా కోరిక అది కాదు, వాడ్ని రిజెక్ట్ చేయటమే నాకు కావాల్సింది, నేను ఇంత తక్కువగా ఆలోచిస్తానని ఎప్పుడు అనుకోలేదు, అదేదో వాడికే చెప్పేయొచ్చు కదా నా వాళ్ళ కాదురా నేను ఇష్టపడుతున్నా తనని అని, తప్పు చేస్తున్నాను అనే భావన నన్ను వదలటం లేదు.
కార్తీ ఆ రోజు మధ్యానం అడిగాడు ఏమైంది అని. ఏమో రా, తను రేపు చెప్తా అన్నది, నీకే చెప్తుంది అనుకుంటా, నువ్వు అడగమన్నట్టు అడిగాను నేను, ఇక తన అభిప్రాయం తెలుసుకోవటం నీ పని రా. "అదేంటి మామా, నువ్వే కనుక్కొని చెప్పు రా, మధ్యలో వదిలేస్తావా !?". రేయ్(బాధతో కూడిన చిరాకు వళ్ళ పుట్టిన కోపాన్ని వెటకారం లోకి మార్చి) ...అవును మరి ఇదో కురుక్షేత్రం, నువ్వో అర్జునుడివి, నేను కృష్ణుడిలా నిన్ను యుద్ధం వరకు తీసుకొచ్చి వదిలేసి వెళ్తున్నా కదా, ఓరి నా బుజ్జి ముంజికాయ్ ఇలాంటి విషయాలు ఎవ్వడివి వాడే చేసుకోవాలి బే. అదిగో మాటల్లోనే వస్తుంది అడుగు నువ్వే, నేను వెళ్తున్నా అంటూ లేచివచ్చాను, హరి కార్తి గాడి దగ్గర కూర్చుంది వెళ్తున్న నన్ను చూస్తూ, నా గుండె 10 నిమిషాలు ఆగకుండా పరిగెడితే కొట్టుకునేంత వేగంగా కొట్టుకుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో అనే ఆందోళనతో. ఓ పావు గంట ఇలా కాంటీన్ బయట కూర్చొని నాలో నేను మదన పడుతుంటే, తను తినేసి క్లాసు కి వెళుతుంది. వెనకాలే కార్తి వచ్చాడు. నేను అడిగేలోపే వాడు "ఛా...ఎంత తక్కువ గా అలోచించాను మామ, హరి చాలా మంచిది రా, స్నేహానికి మోహానికి తేడా తెలీకుండా వాగేశాను, తను నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ రా ". ఏమైంది రా, ఏం అన్నది తను. "హరికి ఓ అన్నయ్య ఉండేవాడట రా వాళ్ళ పక్కింట్లో, ఆయనకి హరి అంటే చాలా అభిమానం అంట, ఆయన పేరు కూడా కార్తీక్ ఏ అంట, లాస్ట్ ఇయర్ అనుకోకుండా ప్రమాదం లో చనిపోయడంట, నాలో వాళ్ళ అన్నయ్యని చూసుకుంటుంది అంట రా...." అంటూ ఏడుస్తున్నాడు వాడు. రేయ్ ఆపరా బాబు. సర్లే నువ్వు చేసిందేం పెద్ద తప్పు కాదు లే, పదా క్లాసు కి వెళ్దాం. కార్తిక్ గాడికి మైండ్ పెద్దగా ఎదగలేదు, చిన్న చిన్న వాటికే ఏడ్చేస్తాడు, అమ్మాయి నవ్వితే లవ్వంటాడు, ఒక్క మాటలో లోకం పోకడ తెలీని సుద్ద అమాయకుడు, అందుకే నాకు నచ్చిన అమ్మాయితో వాడి ఇష్టం గురించి అడిగాను, చాలా మంచోడు పాపం ఎలా బతుకుతాడో ఏంటో. మొత్తానికి నాకో పెద్ద భారం తప్పింది తనకి వీడి మీద అలాంటి అభిప్రాయం లేదు, సో మనం హ్యాపీ కదా. అలా హ్యాపీ గా ఉన్న రెండు క్షణలా తర్వాత, వాడి మీద లేదు సరే, మరి నా మీద ? ఇంత నీచంగా ఆలోచిస్తావ్ అనుకోలేదు అంటే ? నాలో ఇంకో తమ్ముడ్ని చూసుకుంటున్నా అంటే...?