6 Eternally Beautiful Relationships In “Rangasthalam” Explained In The Best Possible Way!

 

“ఈ ప్రపంచమే ఓ నాటకరంగం, ఇందులో మనమందరం పాత్రదారులం” అని అంటారు షేక్స్పియర్. అవును ఎవరి పాత్రను వారు పరిపూర్ణంగా అనుభవించి, రక్తికట్టించడమే జీవితమంటే. “కనపడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలమంటా” అంటూ రంగస్థలం సినిమా కూడా సరిగ్గా ఇదే థీమ్ తో నడుస్తుంది. బహుశా 2018లో ఇదే కథను సినిమాగా తీస్తే ఇంతటి హృదయాన్ని మెలిపెట్టేంతటి భావోద్వేగాలు రాకపోయుండేవేమో. రంగస్థలంలో ఏ దాపరికం లేకుండా, ఏమి దాచుకోకుండా వారి భావోద్వేగాలను వెలిబుచ్చుతారు. కడుపునిండా ఏడుస్తారు, ప్రేమిస్తారు, కోప్పడతారు, వారికోసం కొట్లాడతారు. అలా ఇందులో ఒక్కోబంధం ఒక మరుపురాని జ్ఞాపకంలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది.

 

1. రంగమ్మత్త – చిట్టిబాబు:

చిట్టిబాబుకు మనసులో ఒకటి, బయటకు ఒకటి రాదు. తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడు తప్ప దాని పర్యవసానాలు అస్సలు పట్టించుకోడు. రంగమ్మత్త పై రంగస్థలం గ్రామంలో ఓ విధమైన నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా కాని అవ్వేమి పట్టించుకోడు, తన కళ్ళకు కనిపిస్తే తప్పా. చిట్టిబాబు మనస్తత్వం తెలిసిన వ్యక్తులలో రంగమ్మత్త కూడా ఒకరు. చిట్టిబాబు బాధలో ఉంటే తనతో కలిసి మందుతాగుతూ ఓదార్చింది. ఇంటికి గొడవ పెట్టుకోవడానికి వచ్చినా ఓ ముద్ద అన్నం పెట్టి ప్రేమను పంచుతుంది. తన భర్త వాచ్ ని తనకే అమ్మడానికి తీసుకువస్తే చిట్టిబాబుకు బహుకరించి ఓ స్వచ్చమైన ఆత్మీయతను పంచుతుంది. అప్పటివరకు సరదాగా ఉన్న చిట్టిబాబు రంగమ్మత్తల బంధం ఎప్పుడైతే భర్త ప్రెసిడెంటు గారిని ఎదురుంచి చనిపోయాడో అప్పుడే సరదాగా తన కళ్ళముందు తిరుగుతూ ఉన్న రంగమ్మత్త గుండె చాటున ఇంతటి విషాదం ఉంటుందని తెలుసుకుంటాడు. కుమార్ బాబు మరణం తర్వాత ప్రెసిడెంటు బాధ్యతను తానే తీసుకోకుండా రంగమ్మత్తకు అప్పగించడం రంగమ్మత్తపై తనకున్న అపార నమ్మకానికి ప్రతీక.

 

2. చిట్టిబాబు – ప్రాణ మిత్రుడు:

“ప్రపంచమే కాదన్నా పైన ఉన్నోడే రాకున్నా నీతో ఉండే దైవం నేస్తం రా..” అని చంద్రబోస్ గారు ఓ పాటలో అంటారు. స్నేహం ప్రేమకు మల్లే ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవ్వరమూ చెప్పలేము. పైకి ఎదో చెవులు వినిపించవు తన కళ్ళముందు జరిగే వివిధ సంఘటనలు పరిపూర్ణంగా తెలుసుకోవడం కోసం ఎప్పుడూ మహేష్ పక్కనే ఉంటాడని గ్రామ ప్రజలు అనుకుంటారు కాని చిట్టిబాబు రెండు అడుగులు వేస్తె అందులో ఒక అడుగు మహేష్ ది. చిట్టిబాబు ప్రేమలో తోడు ఉంటాడు మహేష్, ఎన్నికల ప్రచారంలో తోడు ఉంటాడు మహేష్, కుమార్ బాబు మరణం తర్వాత ఫణీంధ్ర భూపతిని తెగనరకడానికి సైతం మహేష్ తోడుంటాడు. ఆఖరికి జిగేల్ రాణితో ఆడిపాడే సమయంలోనూ మహేష్ తోడుంటాడు.

 

3. చిట్టిబాబు – రామలక్ష్మీ:

రెండు అయస్కాంతం ముక్కలు దూరంగా ఉంటే కలుసుకోలేవేమో కానీ దగ్గరికొస్తే కలుసుకోవడం ఎంతసేపు చెప్పండి. రామలక్ష్మీ చిట్టిబాబు ఇద్దరు కూడా గ్రామీణ ప్రాంతాలలో మనకు కనిపించే ప్రేమికులలానే సాధారణంగానే ఉంటారు. బరువైన ప్రేమ మాటలు వీరిద్దరి మధ్య లేకపోయినా కానీ మాటల్లో వర్ణించలేనంతటి ఓ బంధం వీరిద్దరి మధ్య అల్లుకుని ఉంటుంది. మొదట అనుమానంతో ప్రేమలోకి దిగడం, తర్వాత ఒకరికి ఒకరు ప్రాణంగా ప్రేమించుకోవడం, ఆ తర్వాత తల్లిదండ్రులను ఎదురించి ఒక్కటవ్వడం ప్రతి స్వచ్ఛమైన ప్రేమకథలా వీరి కథ ఉన్నా కాని వీరి మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా మొదలై బరువు బాధ్యతల మధ్య సాగుతున్న కొద్ది మరింత పై స్థాయికి చేరుకుంటుంది.

 

4. కుమార్ బాబు – గ్రామ ప్రజలు:

చాలామందికి ఊహించి శక్తి లేకపోవడంతో ఏదయినా కొత్తది మొదలుపెట్టాలంటే అది మొదట హేళనతోనే మొదలవుతుంది. కళ్ళముందే దశాబ్ధాల తరబడి మోసం జరుగుతుంది. సొంత బిడ్డల్లా పెంచిన పంటను గద్దల్లా తన్నుకుపోతున్న వారికి ఎదురుతిరిగే శక్తి లేక వారి బ్రతుకే ఇంత అని నమ్ముతున్న వారిని అక్కునచేర్చుకున్న మొదటి సూర్య కిరణం కుమార్ బాబు. “మీ బ్రతుకులను నేను మారుస్తాను నాకు సహాయం చెయ్యండి” అంటూ ఆ ఊరంతటికి ఒక పెద్దకొడుకయ్యాడు. కుమార్ బాబు సంకల్పం తన సిద్ధాంతాలను నమ్మించడమే. అది నెరవేరింది, తన పాత్ర ముగిసిపోయింది అంతే.! ఈ రోజు రంగస్థలంలో స్వేచ్ఛగా తిరిగే ప్రతి అడుగులో, దారిలో కుమార్ బాబు ఉంటాడు. కడుపునిండా తినే ప్రతి బియ్యపు గింజలోనూ కుమార్ బాబు ఉంటాడు. తరిచి చూడండి ప్రతి నవ్వులోనూ కుమార్ బాబు కనిపిస్తాడు.

 

5. కుటుంబం:

సూర్యుడు వేరు సూర్యుడి నుండి వచ్చే వెలుగు కిరణాలు వేరు కాదు. భూమి వేరు ఆ భూమిపై పెరుగుతున్న సమస్త జీవరాశి వేరుకాదు. తల్లిదండ్రులు, కుమార్ బాబు, చిట్టిబాబు, చెల్లెలు కూడా అందరూ ఒక్కటే అన్నట్టుగా కుటుంబం అంతా కలిసే ఉంటుంది. ఒక్క సీన్ లో రామలక్ష్మీ ఇంట్లో నుండి నేరుగా చిట్టిబాబు ఇంటికి వచ్చినప్పుడు మరో ప్రశ్న లేకుండా తమ కుటుంబంలోకి వచ్చిన మరో సభ్యురాలిగా భావించి వెంటనే కలిసిపోతారు. కొన్ని చోట్ల అభిప్రాయా భేదాలున్నా గాని అవి వారిని కాపాడుకోసమే తప్ప మోసం చెయ్యడం కోసం ఎంత మాత్రమూ కాదు అని నిరూపించిన సంఘటనల నుండి నేటి కుటుంబాలు నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది.

 

6. కుమార్ బాబు – చిట్టిబాబు:

ఒక్కసారి గమనించండి. కుమార్ బాబుని నవ్వుతూ సాదరంగా చిట్టిబాబే ఊర్లోకి తీసుకువస్తాడు. గుండెల నిండా టన్నుల బరువుతో కుమార్ బాబు శవాన్ని కూడా అదే చిట్టిబాబు ఊర్లోకి తీసుకువస్తాడు. తన అన్న గొప్పతనాన్ని ప్రజలందరికి చిట్టిబాబే వివరిస్తాడు. కుమార్ బాబును చంపాలంటే ముందు నన్ను దాటాలి అని ప్రాణానికి ప్రాణం అడ్డువేస్తాడు. అన్న ముందు ఈ ప్రేమ ఎంతా అని ప్రేమనే త్యాగం చేస్తాడు. భవిషత్తులో అన్న కోరుకున్న లక్ష్యానికి ఏది అడ్డు రాకూడదు అని ప్రెసిడెంటు నుండి దక్షిణా మూర్తిని సైతం మట్టుబెట్టి కుమార్ బాబు ఆత్మకు శాంతి చేకూరురుస్తాడు. నాడు లక్ష్మణుడు, భరతుడు శ్రీరాముని కోసం ఇంత చేశారో లేదో తెలియదు కాని కుమార్ బాబు కోసం చిట్టిబాబు రెండో ఆలోచన లేకుండా తన సర్వస్వాన్ని ధారపోశాడు.

 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,