Meet Karnati Varun, A Telugu Guy Who Bagged 7th Rank In Civil Service Exam & His Story

కర్నాటి వరుణ్ కు చిన్నతనం నుండి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని కల. నాన్న జనార్దన్ గారు కంటి డాక్టర్, అమ్మ నాగమణి గారు ఏడీఏ గా పనిచేస్తుంటారు. మాములు లక్ష్యాలు వేరు ఐఏఎస్ లక్ష్యం వేరు. ప్రతీ సంవత్సరం లక్షల్లో పరీక్షలు రాస్తే అందులో కేవలం దాదాపు 150 నుండి180(ప్రతి సంవత్సరం స్వల్ప తేడా ఉండొచ్చు) అభ్యర్థులను మాత్రమే అర్హులుగా పరిగణిస్తారు. ఐఏఎస్ అవ్వాలని కోట్ల విద్యార్థుల నుండి లక్షలమంది ప్రిపరేషన్ మొదలుపెడితే అందులో వడపోత జరిగి లక్షలు నుండి రెండు వందలలోపు సెలెక్ట్ అవుతారు. మిగిలిన తల్లిదండ్రులు భయపడ్డట్టుగా వరుణ్ తల్లిదండ్రులు అంతగా సంకోచించలేదు, ఎందుకంటే వరుణ్ చిన్నతనం నుండి చదువుల్లో మేటి. ఐతే వరుణ్ ఒకానొక పరిస్థితిలో తనమీద తను నమ్మకం కోల్పోయాడు.

రైతు కూలీల మాటలు మార్చాయి:
ఐఐటీ బాంబే లో ఇంజినీరింగ్ పూర్తిచేశాక ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా తన చిన్ననాటి కల వైపే నడిచాడు. 2014లో ప్రిపరేషన్ మొదలుపెడితే 2015 సివిల్స్ రిజల్ట్స్ లో ఆశించిన ఫలితం రాలేదు. అదొక కుదుపు, ఊహతెలిసినప్పటి నుండి ఎదురవ్వని అతిపెద్ద ఓటమిలా తనని క్రుంగదీసింది. “ఇది చాలా కష్టం, ఎలాగూ ఇంజినీరింగ్ చేశాను.. జీఆర్ఈ టోఫెల్ రాసి అమెరికా వెళ్లిపోవడం ఉత్తమం” అని అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మానాన్నలకు ఇదే విషయం చెప్పి ఇంటిదగ్గర కొన్నిరోజులు గడుపుతున్న సమయంలో సరదాగా ఓరోజు వారి పొలానికి వెళ్ళాడు. ఎండకు వానకు బెదరక ఎన్ని అడ్డుంకులు ఎదురైనా చెయ్యాల్సిన పనులను పూర్తిచేస్తున్న రైతు కూలీలను గమించాడు. ఇంత శక్తి వీరిలో ఎలా నిక్షిప్తమయ్యింది.? వీరి కష్టం ముందు నాది ఏపాటిది.? అని రకరకాల ఆలోచనలు తన నిర్ణయాన్ని మార్చివేస్తున్నాయి..


వాళ్ళందరూ పేదవారు.. ఉన్న శక్తిని ఉపయోగిస్తే తప్ప కొత్త శక్తిని సృష్టించుకోలేని వారు.. ఓటమితో బాధపడుతున్న వరుణ్ కు వారి మాటలు స్వాంతన కలుగజేశాయి. “వీరి జీవితాలను బాగు చేయగలిగే శక్తి నాకు రావాలి” అని మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఆ రైతు కూలీలలానే రోజుకు ఎక్కువ గంటలు కష్టపడ్డాడు. 2016 సివిల్స్ లో 166వ ర్యాంక్ సాధించి ఐ.ఆర్.ఎస్ కు క్వాలిఫై అయ్యాడు. ఐనా సరే ప్రిపరేషన్ కొనసాగిస్తూ 2017లో మళ్ళీ పరీక్ష రాశాడు, ఈసారి 225వ ర్యాంక్ వచ్చింది. ఇది నా ర్యాంక్ కాదు ఎక్కడో ఎదో లోపం జరిగింది అని లోపాలను సరిచూసుకుని ఓపికతో పరీక్షకు వెళ్ళాడు.. ఫలితంగా అతను కోరుకున్న లక్ష్యం నెరవేరింది.. ఆలిండియాలో 7వ ర్యాంక్ సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో 2018కి గాను సివిల్స్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. తల్లిదండ్రులతో పాటు, తను ఈ స్థాయికి చేరుకోవడానికి స్పూర్తినిచ్చిన రైతు కూలీలకూ వరుణ్ అండగా ఉండాలి.. వారి జీవితాలను మార్చడానికి వరుణ్ అన్ని రకాల ఆటంకాలు దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..

If you wish to contribute, mail us at admin@chaibisket.com