Devi Prasad: A Classic Director, Genuine Actor, & A Remarkable Painter Who Worships Cinema!

Updated on
Devi Prasad: A Classic Director, Genuine Actor, & A Remarkable Painter Who Worships Cinema!

సత్తెనపల్లి గవర్నమెంట్ స్కూల్..

ఓరోజు క్లాస్ టీచర్ పిల్లల మనస్తత్వాలను, వారి లక్ష్యాలను తెలుసుకోవడం కోసం అందరిని "పెద్దయ్యాక నువ్వేమి అవ్వాలని కోరుకుంటున్నావు రా.." అని ప్రతి ఒక్క విద్యార్థిని అడగడం మొదలుపెట్టారు.. నేను డాక్టర్ అవుదామని అనుకుంటున్నాను సార్, నేను లాయర్, నేను ఇంజినీర్, నేను టీచర్, నేను కూడా టీచర్ అవ్వాలనుకుంటున్నాను సార్.. రేయ్ దేవి ప్రసాద్ మరి నువ్వు.? "నేను టూరింగ్ టాకీస్ లో ఆపరేటర్ అవ్వాలనుకుంటున్నాను సార్, క్లాస్ అంతా ఒకేసారి పిడుగు పడ్డట్టుగా నవ్వులు.. ఎందుకు రా అని అడిగిన ఆ మాష్టారుకు, పిల్లలకు ఓ అపరిపక్వమైన సమాధానం వినపడింది. "ఇంట్లో ఎప్పుడు డబ్బులాడిగినా వారానికి ఒక్కసారే సినిమా చూపిస్తున్నారు.. నేను ఆపరేటర్ ని ఐతే ప్రతిరోజూ సినిమాలు చూడొచ్చు కదా.." కాని అక్కడున్న వాళ్ళల్లో ఏ ఒక్కరికి తెలియదు భవిషత్తులో అలాంటి క్లాస్ రూం లో గొప్ప టీచర్ పాత్రలో కనిపించబోతున్నారని.. ఆ విషయం తెలియకే నవ్వి ఉంటారు.

ఇంతకంటే గొప్ప సంఘటన ఏముంటుందండి చిన్నతనం నుండే సినిమా అంటే దేవి ప్రసాద్ గారికి ఎంత ప్రేమ అని.. గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతంలోని కనగాల అనే గ్రామం వీరిది. మధ్యతరగతి కుటుంబం నాన్న ఫార్మసిస్ట్. బాబాయ్ పుల్లారావు గారు సినిమాలలో పని చేస్తుండడం, ఇంటికి వస్తున్నప్పుడల్లా సినిమా కబుర్లు, షూటింగ్ వివరాలతో రావడంతో దేవి ప్రసాద్ గారికి సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది. ఐతే సినిమా రూపొందించడమే కెరీర్ గా ఎంచుకోవాలనే ఊహ కూడా లేని వయసది.

కోడిరామకృష్ణ గారి దగ్గర:

డిగ్రీ చదువుకునే రోజుల్లో విద్యార్థి నాయకునిగా ఎదగడంతో గిట్టనివాళ్ళతో రకరకాల తగాదాలు జరిగేవి. అమ్మానాన్నలకు ఇవన్నీ ఇబ్బందులకు గురిచేసివి. ఇలా కాదు అని బాబాయ్ పుల్లారావు గారు సినీ పరిశ్రమకు తీసుకువచ్చి కోడిరామకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. కోడిరామకృష్ణ గారికి 24 విభాగాలలో మంచి అనుభవం ఉండడంతో దేవి ప్రసాద్ గారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలిగారు.

ఆడుతుపాడుతూ:

నీది నాది ఒకే కథ లో బరువు బాధ్యతలు కలగలిసిన సీరియస్ పాత్రలలో కనిపించారు కాని దేవి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన చాలా సినిమాలు చాలా వరకు హాస్య ప్రధాన చిత్రాలే. శ్రీహరి హీరోగా మొదట దాస్ అనే సినిమా ప్రారంభమయ్యి, షూటింగ్ మధ్యలోనే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరువాత శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రలలో "ఆడుతుపాడుతూ" సినిమా మొదటిసారి డైరెక్ట్ చేశారు. అది మాంచి సక్సెస్ సాధించింది.

ఆ తరువాత రూపొందించిన ఆర్యన్ రాజేష్ హీరోగా లీలా మహల్ సెంటర్ కూడా పెద్ద హిట్. అల్లరి నరేష్ గారి కామెడీ టైమింగ్ కు, దేవి ప్రసాద్ గారి డైరెక్షన్ కు మంచి సింక్ ఉండేది. ఆ కలయికలోనే వచ్చిన బ్లేడ్ బాబ్జి కూడా సూపర్ హిట్. దీనిని తమిళం, కన్నడలో కూడా రీమేక్ చేశారు.

పెయింటర్ గా:

ఒక్కసారి దేవీప్రసాద్ గారి ఫేస్ బుక్ పేజ్ ని ఓపెన్ చేస్తే ఆయన ప్రేమగా గీసిన రకరకాల పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. ఇంత అందంగా రావడానికి కూడా ఒక ప్రధాన కారణముందండి. చిన్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న సమయంలో గోడ మీద సినిమా పోస్టర్లు అంటించి ఉన్నవి తీక్షణంగా గమనించేవారు. వాటిని చూస్తూ బొమ్మలు గీయడం ప్రారంభించారు. అలా సినిమా మీద ఉన్న ప్రేమ డైరెక్టర్ని మాత్రమే కాదు మంచి పెయింటర్ ని కూడా చేసింది.

నటుడిగా:

అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఇంకా తానే డైరెక్ట్ చేసిన సినిమాలలో అడపా దడపా చిన్న చిన్న రోల్స్ లో నటించేవారు కాని ఫుల్ లెన్త్ గా ఓ సినిమాలో ఇంతవరకు నటించలేదు. వేణు ఉడుగుల గారు చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో మరో థాట్ లేకుండా ఆనందంగా నటిస్తానని ఒప్పుకున్నారట. ఇండస్ట్రీలో నుండి సామాన్య ప్రజానీకం వరకు దేవి ప్రసాద్ గారి నటనకు ముగ్ధులయ్యారు. డైలాగ్ డిక్షన్ దగ్గరి నుండి బాడీ లాంగ్వేజ్, ముఖకవళికలు ఇలా ప్రతి ఒక్క భావాన్ని స్పష్టంగా పలికించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే టాలీవుడ్ కు ఓ కొత్త నాన్న దొరికేశాడు..

చిన్నప్పుడు సినిమాల కోసం ఆపరేటర్ అవ్వాలనుకున్నారు.. సినిమా పోస్టర్లను చూస్తూ అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం నేర్చుకున్నారు. ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్, తరువాత డైరెక్టర్, ఇప్పుడు యాక్టర్. సినిమా కోసమే ఆయన ఇన్ని నేర్చుకున్నారు.. సినిమా కోసమే ఆయన అప్ డేట్ అవుతూ వస్తున్నారు. సినిమానే దేవి ప్రసాద్ గారిని ప్రయోజికుడిని చేసింది.. ఒక వ్యక్తికీ సినిమా మీద ఇంతటి మమకారం ఉండడం అత్యంత అరుదు.