Meet The Telugu Kid Who Holds A Guinness Record For Singing 105 Songs In 105 Languages At A Time

రెండున్నర ఏళ్లకు తన వయసు పిల్లలు అమ్మ నాన్న అనే పదాలు నేర్చుకుంటుంటే రహత్ దేశాల పేర్లు, వాటి రాజధానులు, జాతీయ పతకాలను చూసి ఆయ దేశాల పేర్లు గుర్తుపెట్టుకుని మరి చెప్పేవాడు. అమ్మ నాన్నలిద్దరూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు. “సమాజం ఇంటి బయటినుండి కాదు ఇంటి నుండే మొదలవుతుంది” స్కూల్ లో ఇతర పిల్లలకు భోదించినట్టే అమ్మ నాన్నలిద్దరూ రహత్ కు టీచింగ్ ఇచ్చేవారు. రహత్ కూడా మిగిలిన వారి కన్నా ప్రత్యేకమైనవాడు కావడంతో వేమన పద్యాలు, భగవద్గిత శ్లోకాలు మొదలుకుని ఇదిగో ఇప్పుడు ఒకేసారి 105 భాషలలో 105 పాటలు పాడి గిన్నిస్ బుక్ లోకి తన పేరును నమోదు చేసుకున్నాడు.

రహత్ ప్రస్తుతం విజయవాడలోని ఓ ప్ర్తెవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అమ్మ నాన్నలకు సంగీతం అంటే మహా ఇష్టం. ఒడిలో కూర్చోబెట్టుకుని వెన్నముద్దలు ఎలా తినిపించారో అక్షరాలను, సంగీతాన్ని నేర్పించారు. ఎదుగుదల, నేర్చుకోవడం, నేర్వడం అందరికన్నా ముందుగా ప్రారంభమవడంతో పురస్కారాలు గౌరవాలు కూడా చిన్నతనం నుండే మొదలయ్యాయి. చిన్న చిన్న ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు నాలుగో తరగతి లోనే తిరుపతిలో జరిగిన తెలుగు మహా సభలో “ఆంధ్ర వైభవం”పై ప్రసంగించి అక్కడే కొలువుతీరిన ఉద్ధండులను ఆశ్చర్యచికుతులను చేశాడు. మొదట అమ్మ, ఆ తర్వాత బుచ్చయ్య చార్యులు, అంజనా సుధాకర్, కృష్ణమోహన్ ల దగ్గర కర్ణాటకా సంగీతం నేర్చుకున్నాడు.

105 భాషలలో 105 పాటలు:
గజల్ శ్రీనివాస్ వారు ఒకే పాటను 76 భాషలలో పాడారు. అప్పటివరకు అది ఒక చరిత్ర. ఒకే పాటను అన్ని భాషలలో ఎలా పాడగలిగారా అని అందరూ తమ ఊహకు మించిన ప్రదర్శనగా అభినందించారు. రహత్ మాత్రం “ఈ రికార్డ్ ఎలా బీట్ చేయగలను.?” అని మాత్రమే ఆలోచించాడు. ఒక్క పాటను అన్ని భాషలలో అంటే రొటీన్, అదే ఒక్కో భాషలో ఒక్క పాట పాడితే అద్భుతంగా ఉంటుంది అని రీసెర్చ్ మొదలుపెట్టాడు. పాటలను సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ లో చూస్తూ లిరిక్స్ కి అర్ధాలు తెలుసుకుని సాధన చేశాడు. సచిన్ అలవోకగా 6 కొట్టాడంటే అందుకే సంవత్సరాల శ్రమ ఉంటుంది, అలాగే గాయకులు పాటలను అలవోకగా పాడినా సంవత్సరాల కృషి ఉంటుంది. రహత్ ఎంపిక చేసుకున్న పాటలు అలాంటి గాయకులు పాడినవే. వినడానికి హాయిగా ఉన్నా వాటిని సాధన శ్రమతో కూడుకున్నది.

శృతి, లయ, పదాల ఉచ్చారణ, పాటకు తగిన భావం ఇవన్నీ సరిగ్గా పలికించాలి. కొన్ని పాటల విషయంలో ఇబ్బంది ఎదుర్కొన్నాడు ఇందుకోసం ఒరిజినల్ గా పాడిన గాయకులను, సంగీత దర్శకులకు మెయిల్ చేసి తప్పులను సరిదిద్దుకున్నాడు కూడా. అలాగే విజయవాడ eflu యూనివర్సిటీలో విదేశీ భాషలకు సంబంధించిన కోచింగ్ కూడా తీసుకున్నాడు. జనవరి 6 న విజయవాడలో జరిగిన ఈ గిన్నిస్ ప్రదర్శన అద్భుతంగా సాగింది. మొదటి పాట తెలుగులో సరస్వతి అమ్మవారిని స్మరిస్తూ పాడుతూ తర్వాత 36 భారతీయ భాషల్లో, ఆ తర్వాత విదేశీ భాషలు చివరి పాట మూగ చెవిటి వారికై “సైన్ లాంగ్వేజ్” తో 105 పాటలు పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో తన ప్రత్యేకతను ప్రదర్శించాడు.

చిన్నతనం నుండి అందుకున్న అవార్డులు కొన్ని:
1. బాల సాహిత్య పరిషత్ నుండి గోల్డెన్ చైల్డ్.
2. ఉత్తమ బాలరత్న మానస కల్చరల్ అకాడమీ నుండి.
3. అభినందన కల్చరల్ ఆర్గనైజేషన్ నుండి బాలరత్న.
4. అలాగే జెమినీ టీవీ బోల్ బేబీ బోల్ కు ఎంపికవ్వడం, 5,6 సిరీస్ లో యాకరింగ్ కూడా చెయ్యడం రహత్ ప్రతిభకు మరో ఉదాహరణ.

If you wish to contribute, mail us at admin@chaibisket.com