ఒక వెలుగుతున్న దీపం దానిలాగే మరెన్నో దీపాలను వెలిగేలా చేయగలదు అలాగే ఉన్నత ధృడ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తన లాగే ఎందరో వ్యక్తులను తయారుచేయగలడు. ఈ అక్షరాలకు రవి రాఘవేంద్ర ఒక పరిపూర్ణమైన ఉదాహరణ. ప్రతి మనిషి జీవితంలో అత్యున్నత శక్తి ఉండే కాలం యువకాలం. ఈ యువకాలంలో ఎందరో యువకులు తమ శక్తిని గుర్తించి తమని మార్చుకుని వ్యవస్థను మార్చే పనిలో పడ్డారు. రవి రాఘవేంద్ర మాత్రం తనకు ఓటు హక్కు కూడా(17) రాని రోజుల నుండే వ్యవస్థను మార్చే ఉద్యమంలో పాల్గొన్నాడు. రవి చేసిన కొన్ని గొప్ప ఘన కార్యాల గురించి తెలుసుకుందాం.
100కోట్ల విద్యార్ధుల సొమ్ము: మన ప్రభుత్వాలు పేద విద్యార్ధులు కూడా ఉన్నత చదువులు చదవాలని అర్హులైన విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్ షిప్స్ అందిస్తుంటే కాలేజీ యాజమాన్యాలు వాటిని విద్యార్ధులకు అందకుండా పందికొక్కులా మెక్కేశాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇందులో చదువుకునే పేద విద్యార్ధులకు అందించిన స్కాలర్ షిప్స్ లను కాలేజి యాజమాన్యం వారే తీసుకుని ఇంకా విద్యార్ధుల నుండి కూడా ఫీజు వసూలు చేశారు. ఇది ఒక్క విద్యార్ధికి మాత్రమే నష్టం కలిగించదు రేపటి దేశ భవిషత్తుకే నష్టం అని భావించి రవి రాఘవేంద్ర సమాచార చట్టం(RTI) ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. 2010 నుండి 2013 కాలంలో మహబూబ్ నగర్ జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్ధులు చదువుకున్నారు వీరికి గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్ షిప్ లను, ఫీజ్ రీఎంబర్స్ మెంట్లను కాలేజ్ యాజమాన్యలు విద్యార్ధులకు అందజేయలేదు.. ఈ డబ్బు విలువ సుమారు 100కోట్లు ఉంటుందని అంచనా. ఈ దోపిడిని బట్టబయలు చేశాడు రాఘవేంద్ర. ఇలాంటి దోపిడీలు ప్రతిచోట జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం అప్పటి నుండి నేరుగా విద్యార్ధుల ఖాతాలోకే డబ్బును జమచేస్తుంది.
యూత్ పార్లమెంట్ (2016): చట్టాలే మన దేశ భవిషత్తుకు పునాది వంటివి. అలాంటి చట్టాలను రూపొందించడంలో ప్రజలు, యువత కూడా భాగం కావాలనే ఈ యూత్ పార్లమెంట్ ను 2016లో స్థాపించాడు రాఘవేంద్ర. యూత్ పార్లమెంట్ లో పాల్గొనే సభ్యులందరూ దేశ చట్టాలలో, వ్యవస్థలో ఏ విధమైన లోపాలున్నాయి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలంటే ఏ విధమైన చట్టాలు అవసరం అని చర్చించి అందుకు అవసరమైన నమూనా బిల్లులను పరిశోధన చేసి పెద్దల సలహాలతో రూపొందిస్తారు. ఈ నమూనా బిల్లును దేశ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేలా అందుకు తగిన విధంగా పోరాడతారు. ఇప్పటి వరకు జరిగిన ఆరు యూత్ పార్లమెంట్ సభలలో మూడు నమూనా బిల్లులను రూపొందించారు. అవి..
1. Right To Service Act: భగవంతుడు ఉన్నాడో లేదో తెలియదు కాని ప్రభుత్వ ఆఫీసులలో అవినీతి మాత్రం ఉందని చెప్పొచ్చు. వారికిచ్చే డబ్బును బట్టే మనం కావాలనుకునే సర్టిఫికెట్ వేగం ఆధారపడే దౌర్భగ్య రోజులు ఇవి. యూత్ పార్లమెంట్ ఇందుకు పరిష్కార చట్టాన్ని తయారుచేసింది. దీని ప్రకారం దరఖాస్తు దారుడు పెట్టిన అర్జికి నిర్ణీత గడువులోపు ఆ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఆధికారి ఆ గడువు లోపు ఇవ్వలేకుంటే దరఖాస్తు దారునికి ఆలస్యమైన ప్రతిరోజుకు ఇంతా అని డబ్బు నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టం మూలంగా ప్రభుత్వ ఆఫీసులలో అవినీతి జరగకుండా పనులు వేగంగా జరుగుతాయి.
2. National Educational Policy: ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను ప్రక్షాలన చేసి బట్టి పట్టి మార్కుల కోసం, ర్యాంకుల కోసం చదివేలా కాకుండా ఏ విధంగా ఐతే విద్యార్ధి ఉన్నతంగా ఎదగగాలరో అలాంటి విద్యను అందించేలా దానిని అమలు చేసేలా నమూనా చట్టాన్ని రూపొందించారు.
3. Agriculture Suicides & Solutions: స్వాతంత్రం రాక ముందు నుండి మన దేశీయ రైతు జీవితాలలో పెద్దగా మార్పులు లేవు. ఆత్మహత్యలు, సరైన గిట్టుబాటు ధర అందకపోవడం, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు మొదలైన అన్ని సమస్యలకు ఈ చట్టం పరిష్కారం చూపగలదు. రైతులు ఏ పంట వేయాలి, విత్తనాల కొనుగోలు దగ్గరి నుండి పంట చేతికి వచ్చి సరైన ధరకు అమ్మే వరకు ఎలాంటి పద్దతులు అవలంబించాలో ఈ నమూనా చట్టంలో పొందుపరచారు.
సురాజ్య ఉద్యమం: ఈ మధ్య నేను ఒక బ్యాంక్ కు వెళ్ళాను, అక్కడ ఒక డిగ్రీ చదువుకున్న యువకుడు బ్యాంక్ ఫామ్ నింపడానికి చాలా కష్టపడుతున్నాడు.. ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తే ఇంత ఇబ్బంది పడితే ఇంకా పల్లెటూరులలో అక్కడి రైతులు, రైతు కూలీలు ఎంతలా ఇబ్బందులు పడతారో ఊహించుకోవచ్చు. రవి రాఘవేంద్ర ఇంకొంతమంది యువకులు కలిసి ఇలాంటి ఇబ్బందుల కోసం సురాజ్య ఉద్యమాన్ని ప్రారంభించారు. పల్లెల్లో పర్యటించి అక్కడి యువతకు వారి రోజువారి సమస్యలను ఎదుర్కోవడంలో ప్రత్యేకంగా ట్రైన్ చేశారు. రేషన్ కార్డుల దరఖాస్తు దగ్గరి నుండి ఆసరా పెన్షన్లు మొదలైన అన్ని ప్రభుత్వ పధకాలను వారు ఏ దళారి సహాయం లేకుండా పొందాలి అనే వాటి మీద ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు.
రవి రాఘవేంద్ర మరియు ఆయన మిత్రుల ప్రస్తుత లక్ష్యం ఒక్కటే రేపటి కోసం పటిష్టమైన రాజకీయ నాయకులను తయారుచేయడం. ప్రతి వ్యవస్థ ఉన్నతంగా ఉండాలంటే అందుకు మూలం అధికారం. అవును ప్రజలు నాయకునికి ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగిస్తే కేవలం 5సంవత్సరాలలోనే నియోజికవర్గాన్ని మార్చవచ్చు ఇందుకు తగ్గట్టుగానే వారి ప్రణాళికలు జరుగుతున్నాయి.. ఆసక్తిగల నిజాయితీ, దేశభక్తి గల యువకులను తయారుచేసే పనిలో జయప్రకాష్ గారి నాయకత్వంలో రవి రాఘవేంద్ర మరియు అతని మిత్రులు ముందుకు సాగుతున్నారు.