30 Lines From 'Venna Mudhalu', A Novel By Janardhana Maharshi, That Will Touch Your Heart

Updated on
30 Lines From 'Venna Mudhalu', A Novel By Janardhana Maharshi, That Will Touch Your Heart

నా మిత్రుడు నాకో అద్భుతమైన మాట చెప్పాడు "పుస్తకమంటే చదివేది కాదు, చదివించేది" అని.. 'ఈగ' సినిమాకు మాటలు అందించడంతో పాటు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన జనార్ధన మహర్షి గారు రాసిన "వెన్న ముద్దలు" కూడా మిమ్మల్ని అదే విధంగా తనని తాను చదివించుకుంటుంది. ఈ వెన్న ముద్దలు తల్లి బిడ్డకు మాత్రమే తినిపించదు.. భర్త భార్యకు, మహిళ పురుషునికి, సామాన్యుడు రాజకీయ నాయకునికి, ఒంటరి వాడు సమాజానికి తినిపిస్తాడు. ఇందులో కారం ఉంటుంది, తీపి ఉంటుంది, చేదు కూడా ఉంటుంది.. జనార్ధన మహర్షి గారు మనకోసం ప్రేమతో తయారుచేసిన ఈ వెన్న ముద్దల పూర్తి రుచి పుస్తకంలో ఉన్నాగాని రుచి ముందుగానే కొంత తెలిపే ఆర్టికల్ ఇది..

1. నా దృష్టిలో కవి అంటే కష్టాన్ని వివరించేవాడు.. కలని విశదీకరించేవాడు.. కలతని విసర్జించే వాడు.. కన్నీటిని విస్మరించని వాడు..

2. సృష్టి దర్శనానికి నయనమే ప్రధానం. అట్టి నయనాలు నాకునూ రెండే.. మా అమ్మ మా ఆవిడ నా రెండు కళ్ళు.. ఒకదానికొకటి చూసుకోవు.

3. కడుపులో బిడ్డ తిరగబడ్డాడు. పెద్దాపరేషన్!! కోలుకోవడానికి రెండేళ్ళు పట్టింది.. ఇరవై రెండెళ్ళ తర్వాత మళ్ళి తిరగబడ్డాడు ఇంకేం కోలుకుంటుంది.!

4. భగవంతుని అవతారం మత్స్యం వలేసి, వండేసి తినడమే మా లక్ష్యం.. ఎన్ని చేపల ఏడుపో.. సముద్రం ఉప్పు.

5. మూడు ముళ్ళు.. ఏడడుగులు దంపతులుగా నూరేళ్ళు.. చాలదన్నట్టుగా భార్యా భర్తల బంధం ఏడు జన్మలదంటారు. అప్పటికైనా ఒకరికొకరు అర్ధం అవుతారేమోనని...

6. ఒకటే చూసే రెండు కళ్ళు ఒకదానికొకటి చూసుకోవు. ఎప్పుడు కలిసుండే రెండు పెదాలు ఒక్కమాటలో విడిపోతాయి అందుకే.. "కళ్ళకి ధ్యానం కావాలి, పెదాలకి మౌనం కావాలి".

7. నీవు కప్పయితే నీ మెదడు 'బావి' నువ్వు చేపైతే అది 'చెఱువు'. నువ్వు తిమింగలమైతే అది సముద్రం. నువ్వెంత ఎదిగితే అదంత ఒదుగుతుంది.

8. నాకు సూర్యుడంటే చాలా ఇష్టం బతుకు తెరువు కోసం తిరుగుతుంటే రోజంతా తోడుగా నాతోనే ఉండేవాడు. చంద్రుడికి నేనంటే మరీ ఇష్టం రాత్రుళ్ళు ఒంటరిగా భయం భయంగా ఉంటే చల్లగా చూసుకునేవాడు.. వాళ్ళిద్దరూ ఉండగా ఎవ్వడూ 'అనాధ' కాడు.

9. నిచ్చెనెక్కాడు.. పైకి ఎదిగాడు, నిచ్చెనని మర్చిపోయాడు. నిచ్చెన మాత్రం ఎప్పటిలాగే ఇంకొకర్ని ఎక్కిస్తోంది.

10. చెట్టుని నరికేశారు భోరుమంది, నీడలేకుండా పోయానని ఆ కన్నీటికి వేర్లు తడిశాయి మొక్కలు మొలిచాయి మళ్ళి గొడ్డలి సిద్ధం..

11. మా ఊరెళ్ళాను బాగా డెవలప్ అయ్యింది. ఒకప్పుడు కొండ ఉండేది.. ఫ్యాక్టరీ వచ్చింది చెఱువుండేది.. కాలనీ వచ్చింది సత్రం ఉండేది స్టార్ హోటల్ వచ్చింది. మనుషులుండేవారు కొమ్ములొచ్చాయి.

12. ఆమె అంది నన్ను ముట్టుకోకు గొంగళి పురుగు పాకుతున్నట్టుంది. అతను అన్నాడు 'ఎప్పటికైనా అదే సీతాకోక చిలుక అవుతుందని'..

13. పుటుక్కున ఒక ఎలుక చచ్చినట్టో కాలికింద పడి చీమ చచ్చినట్టో మనిషి కూడా పుటుక్కున చావడం నచ్చదు.. వేటాడుతూ సింహం బతికినట్టో, పాతుకుపోయి వటవృక్షం పెరుగుతున్నట్టు మనిషి కూడా గాఢంగా జీవించాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నా.

14. దెయ్యాలున్నాయన్న నిజం అతను పెళ్ళయ్యే వరకూ నమ్మలేదు.. ఆమె కూడా అంతే. అవి మగరూపంలో ఉంటాయని మొదటి రాత్రే తెల్సుకుంది. ఇప్పుడు అతనేమో కార్లని, అమేమో కుక్కల్ని ప్రేమించుకుంటున్నారు.

15. అమావాశ్య రోజు చంద్రుడు తన ప్రేయసిని చూడడానికి వెళ్ళిపోతాడు. పౌర్ణమిరోజున ప్రేయసి చంద్రుని చూసేందుకొస్తుంది.

16. కన్నీళ్ళలో కాస్త ఉప్పు తగ్గితే ఒక్క పేదవాడు ఈ దేశానికి నీటి సమస్య తీర్చగలడు.

17. వాళ్ళు లేకపోతే మనం లేమని తెలిసినా తమ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ హుందాగా దూరంగా ఉంటారు. సూర్యచంద్రులు తల్లిదండ్రులు హోం ఏజ్ లో ఉన్నట్టు..

18. మేం భారతీయులం ఏమిటట మీ అమెరికా గొప్ప? మీ దగ్గరెన్నుంటే ఏం లాభం! ఈ క్షణం మా దగ్గర సూర్యుడు ఉన్నాడు.. మీకేడి? మేం ఎప్పుడూ మీకంటే ముందే మా తర్వాతే మీకు రాత్రయినా.. పగలైనా..

19. నా దేహానికి చొక్కాలు నా పాదాలకి చెప్పులు ఏం చేసినా పదిమంది మొచ్చుకోవాలనే దురద.. అదేం చిత్రమో నాకెప్పుడూ ఈ చెప్పుల్ని కుట్టినవాడ్ని బట్టలు నేసినవాడ్ని కలిసి మొచ్చుకోవాలనిపించదు.

20. తినే ప్రతి ధాన్యపు గింజపై నీ పేరు రాసి ఉంటుంది. ఎసరులో పెట్టేసరికి గింజ మరిగి, పేరు కరిగిపోతుంది.

21. బయట స్వేచ్చగా గెంతే మేక, పావురాలు, జింక, కోళ్ళు నా కడుపుని చూసినప్పుడు వాటి శ్మశానం అదేనని రోదిస్తాయి.

22. బంగారం భలేగా మెరుస్తోంది. దానిపక్కనున్న ఇత్తడి గిన్నేమో ఇంకోలా మెరుస్తోంది. రెండు మెరవడానికి కారణం ఒక్కటే పరస్పరం వాటికి పోటి లేకపోవడమే ఒకటి తక్కువ, మరొకటి ఎక్కువనే ఈర్ష్యలేదు.. అసూయ రాదు.. వేటి విలువ వాటిదని వస్తువులకే తెలుసు. వాటిని వాడే వారికెందుకు తెలీదో..

23. ఈ సువిశాల భవనంలో నేనింకా నిర్మాణంలో ఉన్న చిన్న భవనాన్ని.. నా నిర్యాణం వరకూ ఈ కట్టడం పూర్తికాదు. ఇందులోకి ఎందరో ప్రవేశించి దోషాలు చూపించారు సలహాలు గుప్పించారు గోడలు కూల్చేశారు ద్వారాలు కట్టించారు. నా భవన నిర్మాణానికి రాధాయులెందరో, ఇసుక చల్లిన ఇంద్రపుత్రులెందరో, అందుకే నే వెళ్ళిపోయాక ఈ భవనం కూలిపోవచ్చు చరిత్రలో నిలిచిపోనూవచ్చు.

24. మిత్రమా! ఏమి చెప్పను నీ గురించి నువ్వు నడిచే దీపానివే. కాని పగలు మాత్రమే నడుస్తావు అదే దురదృష్టం నీ ప్రతిభ వెలుగు కాచిన వెన్నెల అవుతుంది.

గుడిసె పక్కనే మేడ సూర్యుడు ఎండితే మేడ నీడ గుడిసె మీద. చంద్రుడు పండితే గుడిసె నీడ మేడ మీద. మేడలోవాళ్ళు వేడి వంటలు తింటారు. మిగిలినవి చల్లబడ్డాక గుడిసెలో వాళ్ళు తింటారు. మేడలో మెరిసే కొత్త చొక్కా రెండో నెల గుడిసెలోకి మారుతుంది. మేడలోని మామిడి చెట్టు గుడిసెపై వేలాడే పండ్లు. మేడలో పండగ వస్తే పక్కరోజు గుడిసెకు పండుగ. మేడకు ఎందరో దేవుళ్ళు గుడిసెకు మేడలో వాడే దేవుడు.

25. నాకెటు చూసినా కొన్ని నక్కలు, దున్నపోతులు, పందులు, వికృత మృగాలు కనబడుతున్నాయి. నా సమాజం చుట్టూ అమర్చిన ఈ అద్దాల్లో నే చూస్తోంది.. బింబాలా? ప్రతిబింబాలా?

26. స్వర్గంలో నిన్ను చెక్కుతున్నప్పుడు కొన్ని ముక్కలు నేల జారాయి భూలోకంలో ఇప్పడు అవే బంగారంగా కొలవబడుతున్నాయి.

27. ఆమె కళ్ళపై కవిత్వం రాయాలనే కాంక్షతో కలం పట్టాను. బహు సుందరంగా గతంలో ఎవ్వరూ వల్లించని విధంగా దివ్యంగా అమరంగా రాయాలని.. ఎన్నో రాత్రులు ఆలోచించి ఆఖరుగా ఒక్కమాట రాయగలను.. "ఆమె కుడి కన్నుని ప్రపంచంలో ఏ అద్భుతంతో పోల్చగలం ముత్యాలా.? రతనాలా.? ఒకే ఒక్క ఆమె ఎడమ కన్నుతోనే"

28. ఒడి అనగానే అదేదో ఉద్రేకపరిచే ప్రదేశం అని 'అదేదో' తీర్చుకోవడానికి రమ్మన్నానని పిచ్చి ఆలోచనలను మాని 'భర్తే' అనే అహంకారాన్ని మరచి 'బిడ్డ'గా నా ఒడిలోకి చేరండి. నా చీర కప్పుకుని రెండు క్షణాలపాటు కళ్ళు మూసుకోండి ఇది వందేళ్ళ ధ్యానం కంటే శక్తివంతమైనది.

29. నా ఒడిలో విశ్వరూప దర్శనాలు చేసుకోండి కృష్ణుడు చెప్పింది రాముడు చేసింది దశవతారాల మగ ఆదర్శాలను తెలుకుకోండి. ఆఖరిగా వామనుడ్ని గుర్తు తెచ్చుకోండి మగాడు కాబట్టి తొక్కి పారేయడానికి.. మూడు అడుగులు కావాల్సి వచ్చింది. ఆడదానికి ఒక్క అడుగు చాలండి మీకు అడ్డొచ్చే వాళ్ళని తొక్కడానికైనా అడ్డొస్తే మిమ్మల్ని తొక్కి పారేయడానికైనా.. ఎత్తుకున్నాను కదా అని పై నుంచి నన్ను తొక్కారనుకోండి మిమ్మల్ని అథ:పాతాళంలోకి పడేస్తాను. ఇది శాపం కాదండీ పడిపోవడానికే మగాడు పుట్టాడు, పట్టుకోవడానికే ఆడది పుట్టింది.

30. అతని గుండె గదిలోని నాలుగు కవాటాలలో నలుగురు అద్దెకున్నారు, ముగ్గురెప్పుడు తప్పులు చేస్తుంటారు. నాలుగోవాడు సరిదిద్దుతూ ఉంటాడు. ముగ్గురెప్పుడు దోచుకుంటారు. నాలుగోవాడు దానం చేస్తుంటాడు. ముగ్గురెప్పుడూ నాలుగోవాణ్ణి నాశనం చేయాలనుకుంటారు. నాలుగోవాడెప్పుడూ ముగ్గుర్ని ఉద్ధరించాలనుకుంటాడు.. 'ఆ నలుగురే అతన్ని మోసేది'