ఇంకా ఎక్కువ చదువుకుంటే నీకన్నా ఎక్కువ అర్హత ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాల్సి ఉంటుంది అంత కట్నం మనం ఇచ్చుకోలేము అని ఇంటర్మీడియట్ పూర్తి అవ్వగానే రాజ్యలక్ష్మి గారికి పెళ్ళి చేశారు. భర్త ఐ.టి.ఐ పూర్తిచేసి ఆర్.టి.సి లో ఓ చిన్న జాబ్ చేస్తున్నారు. పెళ్ళి ఐయ్యాక తెలిసింది భర్తకు వచ్చే జీతం ఇద్దరికి సరిపోదని. మొదట రాజ్యలక్ష్మి గారు 600 జీతంతో ఒక జాబ్ లో జాయిన్ అయ్యారు. కాని అక్కడ పనిచేస్తున్న వారందరిలో తనొక్కరే మహిళ కావడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కుని జాబ్ మానేశారు. మళ్ళి పరిస్థితి మొదటికి వచ్చింది. ఈసారి ఓ కంపెనీకి వెళ్ళారు. అక్కడ వారి సర్టిఫికెట్స్ చూస్తు "నీకు కనీసం డిగ్రీ కూడా లేదు, ఇంగ్లీష్ రాదు ఎలా నీకు ఉద్యోగం ఇవ్వాలమ్మా.. అని ఈసడించుకుంటు పంపించేసారు.. ఇలా ఒక్క చోట కాదు వెళ్ళిన ప్రతిచోట ఇవ్వే అవమానాలు ఎదురయ్యాయి. నన్ను అనవసరంగా అమ్మ నాన్నలు చదివించలేదు లేకుంటేనా అని వారు నిరాశ పడలేదు. ఒక వేళ అలా తిట్టుకుంటు కూర్చుంటే రాజ్యలక్ష్మీ గారు ఈనాడు ఇంత ఎత్తుకు ఎదిగేవారు కూడా కాదు.
"జీవితంలో ఎదగాలంటే మన అర్హతను పెంచుకోవాలి" అని బలంగా నమ్మే రాజ్యలక్ష్మీ గారు ఈసారి మరో చిన్న సంస్థలో పనిచేస్తూనే డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చదవడం ప్రారంభించారు. ఒక పక్క కుటుంబం, ఇంకో పక్క ఉద్యోగం, మరో పక్క చదువు వీటిలో ఏ ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేయకుండా ఓపికతో, సమర్ధవంతంగా తన శక్తిని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తిచేశారు. వారి అర్హతకు తగ్గ ఉద్యోగం ఆదిత్య బిర్లా గ్రూప్ లో వచ్చినా కాని అక్కడితో తన చదువుకు ఆపలేదు. ఎం.బి.ఏ(హెచ్.ఆర్), ఆర్గనైజేషనల్ సైకాలజీ ఇలా చాలా రకాల కోర్సులు చేసి ఉన్నతంగా తన స్థాయిని పెంచుకున్నారు.
అర్హత పెరిగిన కొద్ది ఉద్యోగాలు వారిని వెతుకుంటూ వచ్చాయి. అలా Innominds కంపెనీకి ముందు వైస్ ప్రెసిడెంట్ గా, కొంతకాలానికి భాగస్వామి అయ్యారు. మొదటి నుండి రాజ్యలక్ష్మి గారి తపన ఒక్కటే తన స్థాయిని పెంచుకోవడం. అంతేకాని ప్రమోషన్లు, ఎక్కువ జీతం కోసం కాదు. ఈ ఒక్క గొప్ప లక్షణమే వారి ఉన్నతికి బలమైన కారణం అయ్యింది. ఇండోమైండ్స్ కంపెనీలో చేరిపోయినప్పుడు ఆ సంస్థలో చాలా ఇబ్బందులు ఉండేవి రాజ్యలక్ష్మి గారి రాక తర్వాత ఏ మార్పులు ఊహించినట్టుగా జరగలేదు, ఓపికతో సరైన ప్రణాళికలతో రెండు సంవత్సరాలలో సంస్థకు వందల కోట్ల టర్నోవర్ తీసుకువచ్చారు. Microsoft, Deloitte లాంటి దిగ్గజాలు వారి కస్టమర్ల జాబితాలో ఉన్నారు. అంతేకాదు Times Magazine వారు "డ్రీమ్ ప్లేస్ టు వర్క్" లో ఇండోమైండ్స్ కు 36వ ర్యాంకు అందించారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఉద్యోగులపై ఎలా కేరింగ్ గా వ్యవహరిస్తున్నారో అని. అంజనా(అమ్మ) ట్రస్ట్ పేరు మీద సంవత్సరానికి 50 మందికి కంటి ఆపరేషన్లతో పాటు, 600 మంది పిల్లలను చదివిస్తూ తన గెలుపుకు ఒక గౌరవపూర్వకమైన అర్ధాన్ని ఇచ్చారు రాజ్యలక్ష్మి గారు.
రాజ్యలక్షి గారి కథ అంతా చదివాక ఇదంతా ఒక సినిమా స్టోరిలా అనిపించి ఉండవచ్చు.. మన కథను ఎవ్వరు రాయరు మనమే రాసుకోవాలి.. మనమే మన గెలుపుకు ఓటమికి కారణం. నన్ను మా అమ్మ నాన్నలు ఎక్కువ చదివించలేదు అని ఆనాడు రాజ్యలక్ష్మి గారు అనుకునేదుంటే పరిస్థితులకు బలహీన పడి ఈరోజు ఏ ఇంట్లోనో పనిమనిషిగా ఉండేవారేమో. కాలం మనకు శిక్ష వేయదు శిక్షణను ఇస్తుంది. సమస్య ఎంత కఠినంగా ఉంటుందో మనం అంత ఎత్తుకు ఎదగడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. నిజంగా అమాయకురాలు అనే స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన రాజ్యలక్ష్మి గారి జీవితం ఎంతోమందికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది.