మాకెంతో ఇష్టమైన ఆముదాల ఆంజనేయులు అలియాస్ గుండు హనుమంతరావు గారికి, నిక్కర్లు వేసుకునే వయసు నుండి మీకు అభిమానిని అయిన నేను ఈరోజు ఉద్యోగానికి వెళ్ళే ముందు రాస్తున్న Thanking Letter... ఎంత పని చేసారండీ మీరు,మా మీద మీకున్న ప్రేమ ఇంతేనా?? స్వర్గంలో ఉన్న మీ కమెడియన్ కుటుంబం పిలిచిందో లేక ఆ దేవుడికే మా అంజి ఐడియాలు అవసరం అయ్యాయో ఏమో ఉదయాన్నే మేము విషాద వార్త వినేలా చేసారు. అనారోగ్యంతో ఉన్నారు,కోలుకొని మళ్ళీ మమ్మల్ని నవ్విస్తారు అనుకుంటే ఇలా వొదిలేసి వెళ్ళిపోతారా?? మీరు వెళ్లిపోయారని తెలియగానే ఎదో నాకు చాలా పరిచయం ఉన్న నా అనే వ్యక్తి ని పోగొట్టుకున్నట్టు ఉంది . మీకు నాకు అసలేలాంటి పరిచయం లేకున్నా మన ఇద్దరు అనుబంధం 2001 నుండి కొనసాగుతుంది ,ఇంకా కొనసాగుతుంది కూడా. చిన్నప్పుడు ఆదివారం రోజు ఎక్కడున్నా,ఎం చేస్తున్నా,ఎలా ఉన్నా ఆ రోజు అమృతం సీరియల్ చూడకపోతే ఎదో వెలితి, చూస్తున్నంత సేపు నవ్వుకోవడం ,ఎపిసోడ్ అయిపోగానే మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూడడం. మరుసటి రోజు స్కూల్ లో లంచ్ టైం లో నిన్న జరిగిన ఎపిసోడ్ లో జోకులు గుర్తుచేస్కుంటూ మళ్ళీ హాయిగా నవ్వుకునేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం .ఇలా ఒక ఏడాది కాదు రెండేళ్ళు కాదు,దాదాపు ఆరు సంవత్సరాలు పాటు అసలు సిసలైన క్లీన్ కామెడీతో,అచ్చమైన తెలుగు హాస్యంతో ఒక జనరేషన్ మొత్తాన్ని మీ అభిమానులుగా మార్చుకున్నారు . ఎంతలా అంటే ఇప్పటికీ అమెరికా వెళ్ళినా,అమీర్పేట్ వెళ్ళినా మాలాంటి వాళ్ళకి రోజుకి ఒక్క అమృతం ఎపిసోడ్ అయినా చూడకపోతే రోజు గడవనంతగా మా జీవితాలలో ఒక భాగమై పోయారు . . టెన్షన్లు పని ఒత్తిడిలతో తల మునకలైన మాకు మీ హాస్యం ఓ రకమైన రిలీఫ్ .
ఎప్పటికైనా ఆనాటి పాత్రదారులతోనే మా అమృతం సీరియల్ మళ్ళి మొదలవుతుంది,మా బాల్యం మళ్ళీ మాకు తిరిగొస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్న మాకు మీరు లేరనే వార్త విషాదాన్నే ఇచ్చింది .మీరెక్కడికీ వెళ్ళలేదు ,మా పెదాలా పై నవ్వులు ఉన్నంతకాలం మీరు మాతోనే ఉంటారు. మీరు పోషించిన పాత్రలు మాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇన్నాళ్ళు ఇక్కడ మమ్మల్ని నవ్వించారు ,ఇప్పుడు స్వర్గంలో ఉన్న అందరినీ నవ్వించండి. Thank You Sir for Making Our Childhood Awesome.. We Miss Our Very Own Anjaneyulu garu .. We Miss You Gundu Hanumantharao Garu..