Telugu Poems About Indian Women by Vimala garu, That Will Melt Your Heart!

నిజానికి అమ్మ ప్రేమను ఏంతలా వర్ణించినా గాని ఇంకేదో మిస్ అవుతుందనుకుంటాం, ఎంతలా చెప్పినకాని నేను పరిపూర్ణంగా అమ్మ గురుంచి ఇంకా చెప్పలేకపోతున్నాం అనే అనుకుంటాం.. కాని అమ్మ తన పిల్లల పొగడ్తల కోసం ఏనాడు ఎదురుచూడదు. స్వార్ధం లేని చిక్కని ప్రేమ మన అమ్మది. కాని ఇక్కడ మీరు చదవబోతున్న కవిత్వం లోని పరిస్థితులు ప్రతి ఇంట్లో ఉండకపోవచ్చు. ఎంతోమంది అనురాగ మూర్తులు తమని తాము త్యాగం చేసుకొని భర్తకోసం, పిల్లలకోసం ఎంతో కష్టాన్ని అనుభవిస్తున్నారు. అమ్మ అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు తనో శక్తి. కవయత్రి విమలగారు రాసిన వంటిల్లూ, సౌందర్యాత్మక హింస కవిత్వంలో ఓ “అమ్మ మరియు ఓ మహిళ” పడుతున్న కొన్ని వివక్షలను ప్రస్పుటంగా వివరించారు.

భయం భయంగా నిశ్శబ్దంగా నిరాశగా
మా అమ్మొక ప్రేతంలా తేలుతూ ఉంటుందక్కడ
అసలు మా అమ్మే నడుస్తున్న వంటగదిలా ఉంటుంది.
ఆమెను చూస్తే ఒక గరిటె గానో పెనం లానో..
మా వంటింటిని అలంకరించిన ఒక పరికరంలానో ఉంటుంది..!

ఒక్కోసారి ఆమె
మండుతున్న పొయ్యి లాగా కూడా వుంటుంది.
అప్పుడు బందీ అయిన పులిలా
ఆమె, వంటగదిలో అశాంతిగా తిరుగుతుంది
నిస్సహాయతతో గిన్నెలు ధడాలున ఎత్తేస్తుంది
ఎంత తేలికో గరిటె తిప్పితే చాలు
వంట సిద్ధం అంటారంతా..!
తినేందుకు తప్ప ఇటుకేసి రారు ఎవ్వరూ
ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయినా, చివరకు వంటింటి గిన్నెలన్నిటి పైనా
మా నాన్న పేరే..!

అదృష్టవశాత్తూ నేనో మంచి వంటింట్లో పడ్డానన్నారంతా..!
గ్యాసు, గ్రైండర్లు, సింకులు, టైల్సు ..
అమ్మలా గారెలూ, అరిసెలూ కాక
ఇప్పుడు కేకులు, పుడ్డింగులు చేస్తున్నాను నేను.
ఇంకా గిన్నెలపై పేర్లు మాత్రం నా భర్తవే..!

కడిగిందే కడిగి, ఏళ్ళ తరబడి వండీ, వండీ
వండిస్తూ.. ఎంగిళ్ళెత్తేసుకుంటూ..
చివరకు నా కలల్లోనూ వంటిల్లే
కళాత్మకమైన వంటింటి కలలు
మల్లె పూవుల్లోనూ పోపువాసనలే..!
ఈ వంటింటిని తగలెయ్య
ఎంత అమానుషమైందీ వంటగది..!
మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి
కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న
రాకాశి గద్ద ఈ వంటిల్లు..!

మనమంటే 32, 24, 35 కొలతలమైన చోట
మొటిమలు మొలవడం, జుట్టు రాలడం
నడుం సన్నగా లేకపోవడమే
మన నిరంతరాందోళనలైన చోట
ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా..!
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యంకై వెంపర్లాడుతూ..
మూసలోకి ఒదిగి ఒదిగి
ఈ స్వఛ్ఛంద సౌందర్య హింస
మన సహజాతమని నమ్ముతూ..
మనల్ని చూసుకున్నప్పుడల్లా
గడ్డీ గాదం కూరి పంటచేలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ గుర్తొస్తుంది.
మనలోంచి మనసంతా తీసేసి, డొల్ల చేసిన
“ఈజిప్షియన్‌ మమ్మీలాగుంటాం!”

“మన మనుగడకు అందం అనివార్యమైన చోట
మనల్ని వెల్లవేసి, పటాల్ని తగించిన గోడల్ని చేసి
మనల్ని అలంకృత గంగిరెద్దులని చేసి
నిర్బంధ “సౌందర్యాత్మక హింస”లో
గాయపరచిన చోట మిత్రులారా..!
నగ్నంగా, తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు
జీవితాన్ని పిలుద్దాం..!
రంగులద్దుకోలేని, అంకెల మధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని
నిరంతర శ్రమలో పెదవులు పగిలి
చేతులు కాయలు కాచి
రేగిన జుట్టుతో, అలిసిన కళ్ళతో..
చింకిపాతలతో అందాన్ని “ఖరీదు చేయలేని”
కోట్లాదిమంది స్త్రీల అందహీనతని మనం ప్రేమిద్దాం..”!

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: