Contributed By Lokesh Sanam
నాకు భయమేసింది, కదులుతున్న క్షణాలు నడుస్తున్న నిమిషాలు గడుస్తున్న గంటలు రాలుతున్న రోజులు ఇన్ని మారిపోతూ ఉన్నా ,ఇవేమీ ఒకప్పటిలా లేవు అనే నిజాన్ని గుర్తించకుండా నేను సాగిస్తున్న జీవితం లో ఒక క్షణం నాకు భయమేసింది.
అప్పుడున్న స్వచ్ఛత ఇప్పుడు లేదు అప్పుడున్న స్వేచ్చ ఇప్పుడు లేదు అప్పుడున్న నడవడిక ఇప్పుడు లేదు ఆధునికం పేరుతో అంతర్జాలం జీవన మనుగడను అధిగమించేసింది. సాంకేతిక జ్ఞానం మనల్ని సోమరిబోతులను చేస్తుంది,సొంబేరుల్లా మారుస్తుంది. మనమూ...అలవాటు పడిపోయాం అనుకోండి అది వేరే విషయం..కాదు...కాదు అదే అసలైన విషయం. అలా అలవాటు పడిపోయిన జాబితా లో నేనూ ఒకడిని అని గుర్తించిన ఆ క్షణం నాకు భయమేసింది.
శారీరికంగా,మానసికంగా అన్ని విధాలుగా మనం దానికి లొంగిపోయాం. పొద్దున్న లేవగానే దేవుడినో, సూర్యుడినో చూసే పరిస్థితి నుండి WhatsApp వాడకానికి వచ్చేశాం, శరీర సౌష్టవం కోసం gym ki వెళ్తాం మళ్లీ అందులోనూ ఏసీ gym వెతుక్కొని ,కష్టపడటానికి వెళ్లే ఆ చోటులో కూడా సుఖం కోరుకుంటాం. ఇంత ఇలా ఐపోయాం అని గుర్తినచగలిగిన ఆ క్షణం నాకు భయమేసింది.
సాటి మనిషి కి ఏక్సిడెంట్ అయితే చేయూత ఇవ్వడా నికంటే ముందే చేతిలో ఫోన్ తో చిత్రీకరిస్తున్న విచిత్రమైన వింత జీవులను చూస్తుంటే, మనిషికి గాటు పడినా పట్టించుకోని,ఫోన్ కి బీటు పడితే మాత్రం గోల చేసే వింత మృగాలను చూస్తుంటే, ఇదా నేను బ్రతకాల్సింది..?? ఇదా నేను బ్రతుకుతుంది..?? అని నన్ను నేను ప్రశ్నించు కునే పరిస్థితి వచ్చినప్పుడు నాకు భయమేసింది.
అందం ఆస్వాదించడం ఆనందం అని,దాన్ని బంధించడం జ్ఞాపకం అని మర్చిపోయి.....ఎదురుగా ఉన్న అద్భుతాన్ని కళ్ళతో ఆశ్వాదించాలనే ఆలోచన కూడా లేకుండా.... చెరవానీ కన్నుతో చిత్రీకరించి సాంకేతిక వాణిజ్యాలలో పంచుకొని మాత్రమే ఆనందాన్ని వెతుక్కుంటున్న మనుషులు చుట్టూ నేను బ్రతుకుతున్నా అని తెల్సిన ఆ క్షణం నాకు భయమేసింది.
ఇవన్నీ చెప్పుకోవడం,ఒప్పుకోవడం రెండూ కష్టం ఎందుకంటే, మనిషి గడిపే ప్రతి మజిలీ మర్మం, ఇది నిజం అంటే తర్కం.
మంచో చెడో ఇంకా దిన పత్రిక చదివే అలవాటు ఉన్న నేను,ఒక వేసవికాలం ఉదయం కాఫీ తాగుతూ చల్ల గాలికి అలా కూర్చుని paper చదువుతుండగా అందులో రాసి ఉన్న ఒక హెడ్లైన్ దానికి సంబంధించిన చిత్రం చూసి...కింద ఫేస్బుక్ లో ఉండే పోస్ట్ రియాక్షన్స్ కోసం వెతకడం మొదలు పెట్టా. ఇది newspaper కదా,నేనేంటి ఇలా వెతుకుతున్నా అసలు consciousness లేకుండా అని అనుకొని, సాంకేతికతకి ఎంత ఎలా addict అయ్యానో అర్థం చేసుకున్న ఆ క్షణం నాకు భయమేసింది...చాలా చాలా భయమేసింది.
ప్రాచీనం అనే చీకటి పొరలు చీల్చుకుంటూ అవసరాలు తీర్చి అవకాశాలు కల్పిస్తున్న ఆధునికాన్ని చూసి,దానికి భానిసలుగా మారిపోయిన మనల్ని చూసి నాకు భయమేసింది.