Contributed By Raviteja Ayyagari
సాగర సంగమం. తెలుగు సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమా గురించి లేకుండా కష్టం. ఎన్ని సార్లు చూసినా ఎదో ఒక కొత్తదనం కలిగిన సినిమా. అందులో తకిట తదిమి తకిట తదిమి తందాన, ఈ పాట వర్ణనాతీతం. ఆ పాట గురించి నాకు అర్థమైన భావం క్లుప్తంగా చెప్తాను.
మద్యం తాగిన వాడి కంటే వేదాంతం ఎవరు బాగా చెప్పలేరు అని అంటారు. నిజానికి తాగేదే అందుకు అని కూడా అంటారు. అలా అతను తాగుతూ పాడుతున్న పాట, జీవితం అనే పాట.
తకిట తదిమి తకిట తదిమి తందాన
హృదయలయల జతుల గతుల తిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి
తకిట, తధిమి అనేవి సంగీతం లో జతులకి సంకేతాలు. హృదయం లోని లయ (గుండె చప్పుడు) జతులు గతులు సంగీతంలోని శబ్దాలు. తడబడు అడుగులు - తాగిన వాడికి కుదురు ఉండదు. తడిసిన పెదవుల రేగిన రాగాన - శృతి ని లయని ఒకటి చేసి, మందుతో తడిసిన పెదవులు చెప్తున్న మాట - పాట రూపంలో.
నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసే వరసా
ఏటిలోని అలలవంటి కంటిలోని కలలు కదిపి
గుండియలను అందియలుగా చేసి
మనం చేసే ప్రతి ప్రక్రియ ఆ దేవుడి ఆలోచన లో నుంచి పుట్టుకుని వచ్చిందే. ఆ రెండు ఘట్టాల మధ్యలో మనకి ఎందుకు ఈ తాపత్రయం? ఇక్కడ తాపత్రయం అనేది అతని మనసులో ఉన్న బాధ గురించి తెలియచేస్తుంది. అతను ప్రేమించిన ప్రియురాలు దక్కలేదు. దానికంటే ఎక్కువగా ప్రేమించిన నాట్యం కూడా అతనికి దక్కలేదు. ఇదంతా ఆ దేవుడు ఆడే ఆటనే కదా అనే చేదు నిజాన్ని ఒక్క మందు తాగేవాడు మాత్రమే ఒక పరిపూర్ణతతో చెప్పగలడు.
ఏటిలోని అలలవి అయోమయమైన కదలికతో కూడిన ప్రయాణం. కంటి లోని కలలు కూడా ఊహ కి అందని సన్నివేశాలను మనకి చూపిస్తాయి. ఈ రెండు ఒకటే కదా! వాటిని కలిపి గుండెలోని అలలను కళ్ళకు వేసుకునే అందెలు గా చేసి పడుతున్నాను ఈ పాటను.
సాగర సంగమం అనేది ఒక లవ్ ఫెయిల్యూర్ స్టోరీ. బాలు అనే వాడు నాట్యాన్ని ప్రేమించాడు, కానీ నాట్యం తనని ఎప్పుడు ప్రేమించలేదు. ఒక డైరెక్టర్ తాగి ఒక మంచి పాటకి అస్లీలమైన నర్తన చేయించాడు అని క్రుంగి కృశించిపోయిన బాలు ఇప్పుడు అలా మారిపోయాడు కదా! అదే నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన. ఈ పాటలో విధవరాలు అయినా మాధవి చేత మల్లి బొట్టు పెట్టించాడు. అదే నరుడి బ్రతుకు నటన ఈశ్వరుని తలపు ఘటన.
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్య శిఖరం
సప్తగిరులు గా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట
పల్లవించు పద కవితలు పాడి
అలరులు కురియగ నాడెనదే అలకల కులుకుల అలమేల్ మంగ అనేది ఒక అన్నమయ్య కీర్తన లో నుంచి తీసుకోబడిన సాహిత్యం. నీ బ్రతుకు ఏడు కొండల శిఖరం అయితే అందులో ఒక సుస్వరాల గోపురం అనగా సంగీతం అనే ఒక కోవెల లో అలమేలుమంగమ్మ పువ్వుల వర్షం కురుస్తుండగా అలకలు (కోపం) కులుకులు (గ్రేస్) తో నాట్యం చేస్తున్నారు అని చెప్పిన అన్నమ్మయ్య రాసిన తెలుగు పాటే కదా జీవితం, అదే కదా నేను చెప్తున్నది అని క్లుప్తంగా చెప్పిన చరణం.
జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు అని అయిపోవు. ఈ సినిమాలో వేదం అణువణువునా నాదం పాటు ముందు బాలు కి వినపడే కరతాళ ధ్వనులే దానికి సంకేతం. ఆ ఒక్క నీతి ని సినిమా రూపంలో తీసిన విశ్వనాధ్ గారు, ఆ నీతి మొత్తాన్ని ఒక పాటలో చాటి చెప్పిన వేటూరి గారు, దానికి మనసుని కరిగించే స్వరం అందించిన ఇళయరాజా గారు, దాన్ని మనందరినీ కదిలించే రీతిలో ఆలపించిన బాలు గారు, ముఖ్యంగా ఈ పాటలో నాట్యాభినయం చేసిన కమల్ హాసన్ గారు నిజంగా మహానుభావులు. వారందిరికి వందనాలు.
పాట లో అర్థాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం
Subscribe to our channel. Lyricopedia
https://youtu.be/gJse67wdhk4?list=PLw6Ls93t7daAMRFuAo0zVDs-forhV45GR