శ్రీరాముడిని, సీతమ్మ తల్లిని మహిమాన్విత శక్తులున్న భగవంతులులా కాకుండా సాటి మనిషిలా భావిస్తే వారి నుండి ఒక మనిషి ఎలా బ్రతకాలో అనే సత్యాన్ని పూర్తిగా నేర్చుకోవచ్చు. మిగిలిన దేశాలలో ఎక్కువగా రాజుల చరిత్ర గురించి, యుద్దాల గురించిన ఆనవాళ్ళు ఉంటే మన దేశంలో మాత్రం భగవంతునికి సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి.. ఒక ప్రత్యేక ప్రాంతం, ఒక ప్రత్యేక నది తీరం అని కాకుండా భారతదేశం అంతట భగవంతుడు ఎన్నో చోట్ల స్వయంభూ గా వెలసి భారతదేశాన్ని ధన్యభూమిగా నిలిపారు. విజయనగరానికి 5కిలోమీటర్ల దూరంలో 2014లో నిర్మితమైన "రామనారాయణం" కూడా భగవంతుడు స్వయంభూ గా వెలసిన పురాతన దేవాలయం లాంటి అనుభూతిని భక్తులకు కలిగిస్తున్నది..
ఈ ఆలయాన్ని సుమారు 15 ఎకరాల విశాలమైన, రమణీమమైన పచ్చని ప్రకృతి ప్రదేశంలో ఎన్.సి.ఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు స్థాపించారు. మిగిలిన అన్ని దేవాలయాల కన్నా ఇది ఎంతో భిన్నమైనది.. మిగిలిన దేవాలయాలలో లేని ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ పుణ్యక్షేత్రం అంతా శ్రీరాముడి ధనస్సు ఆకారంలో ఉంటుంది. రామ బాణానికి ఉన్న శక్తి, రాముని వ్యక్తిత్వాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో దీనిని ఇలా నిర్మించారు.
ఏ దేవాలయమైన గొప్పగా, పవిత్రంగా కనిపించడానికి అక్కడి శిల్పాలు ఎంతో ఉపయోగపడతాయి.. ఇక్కడ అలాంటి శిల్పాలు ఎన్నో మనకు కనువిందు చేస్తాయి. దాదాపు 60 అడుగుల ఎతైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం, రామాయణంలోని అతి ముఖ్యమైన 72 ఘట్టాలను వివరిస్తూ కనిపించే శిల్పాలు, 75 పేయింటింగ్స్, 16 అడుగుల అమ్మవారి విగ్రహాలు, ఆలయం బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల విగ్రహాలు స్పష్టంగా, జీవం ఉన్నవాటిలా భక్తులకు దర్శినమిస్తాయి. ఇలా ఎన్నో శిల్ప సౌందర్యాలతో మనోహరంగా ఈ దేవాలయం ప్రకాశిస్తున్నది.
దాదాపు 6 సంవత్సరాల పాటు నిర్మించిన ఈ క్షేత్రం శ్రీరామనవమి పర్వదినం నాడు ప్రారంభమయ్యింది. ఇక్కడికి రాగనే భక్తులలో భక్తి, ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ధ్యానమందిరం, వేద పాఠశాల, గ్రంథాలయం, అన్నదాన శాలలు నిర్మించారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహా రావు గారి లాంటి వారితో ప్రవచనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వివిధ దేవతా ప్రతిమలు, గోశాల, కళ్యాణ మండపం ఇక్కడి మరో ఆకర్షణలు.