Contributed By: సౌమ్య ఉరిటి
లిటిల్ ఫ్లవర్ స్కూల్ సెకండ్ ఏ క్లాస్ రూం, సాయంత్రం మూడు గంటలు, క్లాస్ టీచర్ ఒక్కొక్క స్టూడెంట్ ని అడుగుతున్నారు, "పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు? డాక్టరా? టీచరా? ఇంజినీరా?, లాయరా? నీకేమవ్వడమంటే ఇష్టం?' ఒక్కొక్క బుడతడు ఒక్కోటి చెబుతున్నాడు. ఒకరు డాక్టర్ అని మరొకరు లాయర్ అని. భరత్ వంతు వచ్చింది. "నేను హీరో అవుతా," అన్నాడు భరత్ వెంటనే. టీచర్ నవ్వింది. స్కూల్ లాంగ్ బెల్ మోగింది. పిల్లలందరూ బయటకు నడిచారు.
భరత్ వాళ్ల ఫ్రెండ్స్ తో చెప్తున్నాడు, "రేయ్! ఈ రోజు మా డాడీ వస్తున్నార్రా. నా బర్త్ డే కోసం వస్తున్నారు. నాకు బోలెడు గిఫ్ట్స్ తెస్తారు. నా బర్త్ డే అంతా జోలీగా గడుపుతాం. ఈవినింగ్ పార్టికి మీరు రండిరా మా ఇంటికి. మీరే చూద్దురు." "రేయ్ భరత్ ! నువ్వు లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు.. స్కూల్ Annual Day కి మీ డాడితో వచ్చి ప్రైజ్ తీసుకుంటానని కాని మీ డాడీ రాలేదు," ఫ్రెండ్స్ లో ఒకడైన అనిల్ అన్నాడు. భరత్ చిన్నబుచ్చుకున్నాడు. ఈలోపు స్కూల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న అమ్మను చూసి పరిగెత్తుకెళ్లాడు భరత్.
భరత్ ను దగ్గరకు తీస్కొని "మనం ఇప్పుడు ఇంటికెళ్లి ఫ్రెషప్ అయ్యి రైల్వేస్టేషన్ కి వెళ్లాలంట ఎందుకో మా భరత్ కి తెలుసా?" అని గారాబం చేస్తూ అడిగింది నీరజ(భరత్ వాళ్ల అమ్మ). "డాడీ వస్తున్నారు. నాతో బొల్డంత టైం స్పెండ్ చేస్తారు," వెలిగిపొతున్న ముఖంతో చెప్పాడు భరత్. స్టేషన్ కి వెళ్లి ఐస్ క్రీం తింటూ ఎదురుచూస్తున్నాడు భరత్ వాళ్ళ నాన్న కోసం. జమ్మూ నుంచి వస్తున్న ట్రైన్ ఫలానా ప్లాట్ ఫార్మ్ కి వస్తుందన్న announcement విని భరత్ ని తీస్కొని అక్కడికి చేరుకుంది నీరజ.
ట్రైన్ లోనుంచి ప్రయాణీకులంతా కిందకి దిగుతూంటే, "డాడీ ఎక్కడ? ఇంకా కనిపించట్లేదు," అని అడుగుతున్నాడు భరత్ వాళ్ల అమ్మని. "అదుగో డాడీ. పద పద," అప్పుడే ట్రైన్ దిగుతున్న పృథ్వీని చూపించి, వడివడిగా అటుగా అడుగులేసింది నీరజ భరత్ ని పట్టుకొని. భరత్ నీ, నీరజనీ చూడగానే పృథ్వీ కూడా తన నడకలో వేగం పెంచాడు. భరత్ ని ఎత్తుకొని పైకెత్తి ముద్దాడి, పాకెట్ లోనుంచి చాక్లెట్స్ తీసి ఇస్తూ, "డాడీకి ఓ కిస్ ఇవ్వు," అని అడగ్గానే భరత్ పృథ్వీ చెంపపై ముద్దాడి, "నిన్ను చాలా మిస్ అయ్యా డాడీ," అని అనగానే పృథ్వీ కళ్లలో నీళ్లు తిరగడం గమనించిన నీరజ "నువ్వు మమ్మాస్ క్యూట్ బోయ్ కదా మమ్మీ ఉందిగా నీతో. ఇప్పుడు డాడీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులూ ఫుల్ అల్లరి చేయ్. నేను నిన్ను ఆపను," అంది భరత్ తల నిమురుతూ.
ఇంటికి వెళ్లే దారి పొడవునా భరత్ వాళ్ల నాన్నతో ఏవో కబుర్లు చెబుతూనే ఉన్నాడు. ఇంటికి చేరుకున్నాక తాను వేసిన డ్రాయింగ్స్ అన్నింటినీ చూపిస్తున్నాడు భరత్. అందులో సూపర్ మ్యాన్, స్పైడెర్ మ్యాన్, శక్తి మ్యాన్ లాంటి సూపర్ హీరోస్ బొమ్మలున్నాయి. ఇంకా అందంగా, అర్థవంతంగా, అద్భుతంగా ఉన్న బొమ్మలూ ఉన్నాయి. వాటిలో 'తల్లి జోల పాడుతూ నిద్రపుచ్చుతుంటే నిద్రపోయి తండ్రితో ఆడుకుంటున్నట్టు కలలు కనే ఒక బాబు చిత్రం ఉంది. అది చూసిన పృధ్వికి భరత్ ఫీలింగ్స్, వాటిని పేపర్ పై ఆవిష్కరించగలిగే వాడి ప్రతిభ అర్ధమయ్యాయి. భరత్ ని భుజం పై తట్టి "వెరీ గుడ్ నాన్నా...చాల బాగా వేశావ్. నీకు డ్రాయింగ్ అంటే అంతిష్టమా?" అని అడిగాడు. "చాలా ఇష్టం డాడీ. మా స్కూల్ లో డ్రాయింగ్ కాంపిటేషన్స్ లో ఎప్పుడూ నేనే ఫస్ట్," చెప్పాడు భరత్.
"మా భరత్ గుడ్ బాయ్ అని నాకు తెలుసు. అందుకే నీకోసం ఏం తెచ్చానో చూడు, " అని భరత్ కోసం తెచ్చినవి ఇస్తుంటే సంతోషంతో అంతెత్తున ఎగిరాడు భరత్. మరుసటి రోజు నాన్నతో కలిసి ఎక్కడెక్కడికి వెళ్ళాలో ముందే ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ కి వెళ్ళి సరదాగా గడిపాడు భరత్. బర్త్ డే కోసం షాపింగ్ చేశాడు. రోజూ పృధ్వీయే స్కూల్ లో డ్రాప్ చేయాలని పంతం పట్టి నెగ్గాడు. భోజనం పృధ్వీతోనే, నిద్రపోవడం పృధ్వీతోనే, ఆటలడటం, పోట్లాడటం అన్నీ పృధ్వీతోనే. స్కూల్ లో తప్ప మిగిలిన సమయమంతా వాళ్ళ నాన్నతోనే గడుపుతున్నాడు భరత్.
ఓ రోజు పృధ్వి వాళ్ల స్నేహితులు పృధ్వి వచ్చాడని తెలిసి ఇంటికి వచ్చారు. లివింగ్ రూంలో ఆడుకుంటున్న భరత్ ను చూసి మాటలు కలిపారు. మాటల్లో "పెద్దయ్యాక ఏమవుతావు? " అని అడిగారు. "హీరోనవుతా'" అన్నాడు గర్వంగా. వారందరూ నవ్వుకున్నారు వాడి ముద్దు మాటలకి.
సాయంత్రం పృధ్వి నీరజకి వాళ్ళ టీం ఫోటోస్ అన్నీ చుపిస్తున్నాడు. ఆ ఫోటోస్ లో ఆర్మీ యూనిఫాం వేసుకున్న పృధ్వీని చూసి భరత్ ,"డాడి! మీరెప్పుడూ ఎందుకు ఆ డ్రెస్ లోనే ఉంటారు?" అని అడిగాడు. పృధ్వి,"నువ్వు స్కూల్ కి యూనిఫాం వేస్కొని వెళ్తావు కదా. నువ్వు మీ ఫ్రెండ్స్ అందరూ ఒకేలాంటి డ్రెస్ వేసుకుంటారుగా. అలాగే ఈ డ్రెస్ మా యూనిఫాం అన్నమాట. ఇక వారందరూ నా ఫ్రెండ్స్," అని చెప్పాడు. అర్ధమైన్నట్టు తలూపుతూ అన్ని ఫొటోస్ చూడటం కంటిన్యూ చేశాడు భరత్.
మరుసటి రోజు స్కూల్ నుంచి వస్తూవస్తూనే పృధ్వీ దగ్గరకు పరుగున వెళ్ళి ,"డాడీ! నాకు డ్రాయింగ్ కాంపిటేషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్కూల్ Annual Day రోజు నాకు ప్రైజ్ ఇస్తారు. మీరూ రండి నాతో పాటు," అన్నాడు భరత్.
"కంగ్రాట్స్ నాన్నా.... వస్తారా. ఆ రోజు నేనే నిన్ను స్కూల్ కి తీసుకెళ్తా. మరి ఇప్పుడు భరత్ కి ఐస్ క్రీం కావాలా?" అని అడిగాడు పృధ్వి భరత్ ని మురిపెంగా చూస్తూ. "యేయ్....కావాలి," అని అరచి భరత్ పృధ్వికి హైఫై ఇచ్చాడు.
వారం రోజులు గడిచాయి పృధ్వి వచ్చి. పృధ్వి భరత్ కి చెస్ ఆడటం నేర్పిస్తున్నాడు. పృధ్వీకి ఫోన్ కాల్ వచ్చింది. మాట్లాడిన తరువాత నీరజతో చెప్తున్నాడు ," నీరజా! నేను రేపు బయల్దేరుతున్నాను. ఎమెర్జెన్సీ అట.” "సరేనండి నేను మీ లగేజ్ సర్ది పెడతా," చెప్పింది నీరజ. తనకి పృధ్వి వృత్తి కోసం పూర్తిగా తెలుసు.
ఇవన్నీ చూస్తున్న భరత్ పృధ్వి దగ్గరకు వెళ్ళి, " డాడీ! మీరు రేపే వెళ్ళిపోతారా? అయితే నా బర్త్ డే కి ఉండరా?" అని అడిగాడు. పృధ్వి భరత్ ని దగ్గరకు తీసుకొని, "అవును నాన్నా...నేను రేపే వెళ్ళాలి. అక్కడ నేనుండటం చాలా అవసరం. నేను నీ బర్త్ డే కి మంచి గిఫ్ట్ కొన్నా. ఇదిగో....."అని ఓ గిఫ్ట్ ప్యాక్ ని తెచ్చి ఇచ్చాడు. భరత్ ముఖం వాడిపోయింది. పృధ్వి చేతుల నుండి విడిపించుకొని గిఫ్ట్ ప్యాక్ ని పక్కన పడేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. పృధ్వి బాధగా నీరజ వైపు చూశాడు. నేను మట్లాడతా, అంతా సర్దుకుంటుంది అన్నట్టు కళ్లతో సైగ చేసింది నీరజ.
భరత్ ఏడుస్తూ బొమ్మ గీస్తున్నాడు, తను ఏడుస్తున్నా పట్తించుకోకుండా తనను వదిలి పృధ్వి వెళ్ళిపోతున్నట్టు. ఆ పేపర్ అంతా కన్నీటి బొట్లతో అక్కడక్కడా ఉబ్బి ఉంది. "భరత్! ఏం చేస్తున్నవ్ ? ఏడుస్తున్నావా? భరత్ బ్యాడ్ బాయ్ ఐపోయాడా?" భరత్ పక్కన కూర్చుంది నీరజ. "నేను బ్యాడ్ బాయ్ కాదు. డాడీయే బ్యాడ్ బాయ్. నా బర్త్ డే కి ఉంటానన్నారు. మా స్కూల్ Annual Day కి వస్తానన్నారు. అన్నీ అబధ్ధాలే," కన్నీరు మరి కొంచెం ఎక్కువయ్యాయి భరత్ కి.
"తప్పు భరత్. అలా అనకూడదు. డాడి వెళ్ళాలి నాన్నా... వచ్చే సంవత్సరం నీ బర్త్ డే కి ఖచ్చితంగా ఉంటారు సరేనా," భరత్ కన్నీళ్లు తుడుస్తూ చెప్పింది నీరజ.
"ఎప్పుడూ అలాగే అంటారు. కానీ ఉండరు. లాస్ట్ టైం కూడా మా స్కూల్ కి వస్తానని చెప్పి రాలేదు. మొన్న అనీల్ నన్ను వెక్కిరించాడు తెలుసా? ఈసారి కూడా వెక్కిరిస్తాడు. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ల డాడీలతో వస్తారు ఏన్యువల్ డే రోజు కానీ నేను ఒక్కడినే డాడి లేకుండా వెళ్ళాలి," వెక్కుతూ చెప్పాడు భరత్.
వాడి మనసు బాధపడిందని అర్ధం చేసుకున్న నీరజ, భరత్ ని ఒడిలోకి తీసుకొని, "చూడు నాన్నా భరత్.. డాడి కి నువ్వంటే ఎంతిష్టమో తెలుసా? నీ కోసమే వచ్చారు. నీకెన్ని బొమ్మలు తెచ్చారు. నిన్ను నువ్వెక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళారు."
"నేనంటే ఇష్టమైతే మరి నా బర్త్ డే కి ఎందుకు ఉండకుండా వెళిపోతున్నారు? " అని అమాయకంగా అడిగాడు భరత్ " నీకు సూపర్ హీరోస్ అంటే ఇష్టమా?" అడిగింది నీరజ. "చాలా ఇష్టం మమ్మీ," అన్నాడు భరత్. "ఎందుకు ఇష్టం ?" అడిగింది నీరజ. "వాళ్లు చెడ్డవాళ్ళతో ఫైట్ చేస్తారు. ప్రమాదంలో ఉన్నవాళ్ళని కాపాడతారు. చాలా పవర్ ఉంది వాళ్ళకి తెలుసా" అని చెప్తున్నాడు భరత్.
"కదా! డాడీ కూడా ఒక హీరో యే నాన్నా..." చెప్తుంది నీరజ. భరత్ కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా, "అవునా! డాడి సూపర్ హీరో ఆ," అన్నాడు.
"అవును భరత్ డాడి, డాడీతో పాటు మొన్న ఫోటోస్ లో చూసిన వాళ్లంతా హీరోస్ యే. ఇంకా డాడీ లాంటి వాళ్లందరూ. వారందరూ మన దేశంలో ఉన్న మన లాంటి ప్రజలను చెడ్డ వాళ్ల నుండి కాపాడుతూనే ఉంటారు అచ్చం నీ సూపర్ హీరోస్ లాగా," చెప్పింది నీరజ. చాలా ఆశక్తిగా వింటున్నాడు భరత్. “ వాళ్లు ఉగ్రవాదులతో అదే చెడ్డ వాళ్ళతో, శత్రు సైన్యం తో పోరాడుతారు. వాళ్ళందరికి నీలంటి చిన్నచిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతో ఆడుకోవాలని వాళ్ళకీ ఉంటుంది. కానీ వాళ్ళని వదిలి ఆ సరిహద్దులలో చలికి తట్టుకొని, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరికి ప్రాణాలు విడవడానికి కూడా వెనకాడరు. ఇదంతా వారు ఎవరి కోసం చెస్తారో తెలుసా? మనందరి కోసం. వాళ్ళు రాత్రిపగలు నిద్ర మాని సరిహద్దుల్లో మన దేశానికి కాపలా ఉండి రక్షిస్తేనే మనం కంటి నిండా నిద్ర పోతున్నాం. మనం పండగలూ బర్త్ డే లు జరుపుకుంటున్నాం అంటే దానికి కారణం డాడి లాంటి జవాన్ల వలనే నాన్నా. కొందరు పోరాడే సమయంలో తమ ప్రాణాలు కోల్పోతుంటారు తెలుసా? మన ప్రాణాలకి వారి ప్రాణాలు అడ్డుపెడతారు," భరత్ కి జవాన్ల గురించి అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది నీరజ.
"మరి సూపర్ హీరోస్ చనిపోరుగా?" అడిగాడు భరత్. "అవును భరత్ అందుకే వాళ్లు అమర వీరులు," చెప్పింది నీరజ గంభీరమైన స్వరంతో. "ఇప్పుడు చెప్పు డాడి నీ బర్త్ డే కి ఉండాలా?" నీరజ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పకుండా లివింగ్ రూంలోకి వెళ్ళి పృధ్వి ఇచ్చిన గిఫ్ట్ ని ఓపెన్ చేశాడు భరత్. ఆ ప్యాక్ నిండా స్కెచ్ పెన్సిల్లూ, పెన్లూ, వాటర్ కలర్ బాటిల్లూ చాలా ఉన్నాయి. వాటిని చూసి భరత్ కళ్లు మెరిసిపోయాయి. వాటితో ఓ డ్రాయింగ్ వేస్తూ నిద్రపోయాడు.
మరుసటి ఉదయం పృధ్వి రైల్వే స్టేషన్ కి బయలుదేరుతున్నాడు. భరత్ పృధ్వి దగ్గరకు వెళ్ళి "సారీ డాడి," అన్నాడు. పృధ్వి మోకాళ్ళపై కూర్చొని భరత్ కి ముద్దు పెట్టాడు. భరత్ తన చేతిలో ఉన్న డ్రాయింగ్ ని పృధ్వికి ఇచ్చాడు. ఆర్మి డ్రెస్ వేసుకున్న పృధ్వి బొమ్మ అది. పైన "నేనూ నీ లాంటి హీరోనవుతా డాడి" అని రాసుంది. పృధ్వి భరత్ ని గట్టిగా హత్తుకొని ఆ డ్రాయింగ్ ని తన బ్యాగ్ లో పెట్టుకొని బై చెప్పాడు. భరత్ తిరిగి బై చెప్తున్నాడు చిరునవ్వుతో.