Contributed by Sarveswar Reddy Bandi
"ప్రతీ అబ్బాయీ, అమ్మాయిలో ఏదోకటి చూసి ఇష్టపడతాడు. ఒకరికి అమ్మాయి కళ్ళు ఇష్టం, ఇంకొకరికి పెదాలు, మరొకరికి జుట్టు., కానీ ఈ సినిమాలో హీరో మాత్రం అమ్మాయి కాళ్లు చూసి ఇష్టపడతాడు, ఆ మాట తనకి చెప్పడానికి కష్టపడతాడు, ఆలస్యం చేస్తే నష్టపడాల్సి వస్తుందేమోనని భయపడతాడు. ఇలాంటి అయోమయ పరిస్థితిలో నాకు ఒక పాట కావాలని రచయితకు చెప్పి, పాట కోసం ఎదురుచూస్తున్నాడు డైరెక్టర్ " ఇంతలో.... ' నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. ' అంటూ వచ్చిన పాటను ఏ మాత్రం ఆలోచించకుండా ట్యూన్ చేసి రిలీజ్ చేశారు, కట్ చేస్తే ఆ పాట దేశవ్యాప్తంగా ఒక సంచలన హిట్టు.. అయితే ఈ పాట రాసిన వ్యక్తి అక్షరాలా 65 సంవత్సరాల రచయిత అని తెలిసినప్పుడు మనకి ఒకటే అర్థం అవుతుంది.. " కాల్చే గన్ కి మనిషితో..రాసే పెన్ కి వయసుతో సంబంధం లేదు" 1985 సమయంలో మాస్ సినిమాలు ఉర్రూతలూగిస్తున్న సమయంలో వాటికి విభిన్నంగా అమాయక పాత్రలను హీరో/హీరోయిన్స్ గా, కసురుకునే విలన్లను, కవ్వించే కమెడియన్లను పెట్టి న్యాచురల్ సినిమా వంటలు చేస్తూ, అందులో సంగీతం, సాహిత్యం ఒక స్పూన్ ఎక్కువే వేస్తూ క్లాసికల్ హిట్స్ కొట్టే డైరెక్టర్ కే.విశ్వనాథ్ గారు ఈసారి పూర్తిగా సంగీత భరిత సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అయితే అప్పటికే అగ్ర స్థానంలో ఉన్న రచయితలు కాకుండా ఒక కొత్త ట్రెండ్ కోసం వెతుకుతున్న సమయంలో దొరికిన అస్త్రమే సీతా రామ శాస్త్రి గారు.. తాము చేస్తున్న సిరివెన్నెల అనే సినిమాలో పాటలు అరటి పండు నోట్లో పెట్టినంత సులువుగా కాకుండా, అక్షరాలు డిక్షనరీలో వెతుక్కునేలా రాయాలని స్వేచ్ఛా రథంలో పగ్గాలు తీసి వదిలేశాడు. అప్పుడు ఆయన వాడిన కొత్త పదాలు ఇంటర్నెట్ డిక్షనరీ ఉన్నా ఈనాటికీ మనలో చాలామందికి తెలియదు. ఆ సినిమా శాస్త్రి గారి జీవితాన్ని ఎంత మలుపు తిప్పిందంటే సరిగ్గా ఆయన పుట్టిన రోజు అయిన మే 20 1986 సినిమా రిలీజ్ అవ్వడమే కాకుండా ముప్ఫై ఏళ్ల వయసులో అయనకి రెండోసారి నామకరణం జరిగి ఆయన పేరు సిరివెన్నెల సీతారామశాస్త్రి గా మారిపోయింది.. కట్ చేస్తే కొన్ని రోజుల్లోనే ఆయన రథం చుట్టూ చాలా కమర్షియల్ సినిమాల అవకాశాలు చుట్టుముట్టాయి. అప్పుడు అర్థమయింది విశ్వనాథ్ గారు ఎక్కించింది మామూలు రథం కాదు, సూర్య భగవానుని రథం, అది ఆపడం కుదరదని.. రాఘవేంద్ర రావు లాంటి రొమాంటిక్, వర్మ లాంటి వైవిధ్యమైన, కృష్ణ వంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ అందరికీ అక్షరాలు రాయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల్లోనే ఆడియో కంపెనీ క్యాసెట్ల వాళ్ళు సింగర్లతో పాటు ఈయన ఫోటోని కూడా పెట్టి అమ్మడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు.. సినిమా బాగా జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక పాట వచ్చి, ఆడియెన్స్ బయటికెళ్లే పద్ధతికి కూడా ఈయన చెక్ పెట్టారు. ఎందుకంటే మనం బాగా గమనిస్తే ఈయన రాసిన పాట కూడా సినిమా కథని అంతే వేగంగా ముందుకు తీసుకుని వెళ్తుంది..అలాంటి కొన్ని ఉదాహరణలు..
జల్సా : ఛలో రే.. ఛలో రే.. నాన్న చనిపోయిన గంటకే అమ్మ కూడా చనిపోయి, స్మశానానికి వెళ్తూ, పేదల జీవితాలను పెద్దలు ఎలా తొక్కేస్తున్నారో అర్థమయి, పట్టరాని కోపంతో ఆవేశంతో అడవుల్లోకి వెళ్లి, అన్నల్లో కలిసి,అక్కడ ధర్మ యుద్దం పేరుతో అమాయకులను కూడా చంపడం తప్పని తెలుసుకుని మళ్ళీ మనసు మార్చుకుని మనుషుల్లో కలిసే సంజయ్ సాహు అనే కుర్రాడి గురించి " రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం " ఈ ఒక్క చరణం చదువుతుంటే ఈ కథకు ఇంతకంటే గొప్పగా ఇంకో పాట ఊహించగలమా అనిపిస్తుంది..
నువ్వొస్తానంటే నేనొద్దంటానా : అమ్మా నాన్న పోయాక చిన్నప్పటి నుండి పరీక్షలకు పక్క ఊరికి వెళ్ళాలన్నా, స్నేహితురాలి పెళ్లికి వెళ్ళాలన్నా తన అన్నయ్య అనుమతి మీద ఆధారపడే ఒక డిపెండెంట్ అమ్మాయి సిరి, అదే పెళ్ళిలో లండన్ నుండి వచ్చిన సంతోష్ అనే కుర్రాడిని తన అన్నకి తెలియకుండానే ఇష్టపడే సందర్భంలో " నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీపేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా " వంటి పల్లవితో మొదలుపెట్టి చరణంలో " నన్నింతగా మార్చేందుకూ నికెవ్వరిచ్చారు హక్కూ" లాంటి మాటలు రాసి డైరెక్టర్ నిర్మాతలకు ఇంకో రెండు, మూడు సీన్లు అవసరం లేకుండా చేశాడు..
చక్రం : జగమంత కుటుంబం నాది నిజం చెప్పాలంటే మనం బాగున్నప్పుడు అవతలి వాళ్ళ గురించి ఆలోచించం, కష్టం లో ఉన్నపుడు నవ్వు విలువ, చావుకి దగ్గరయినపుడు బ్రతుకు విలువ తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా కొన్ని రోజుల్లో చనిపోతానని తెలుసుకున్న చక్రం అనే కుర్రాడు చివరి నిమిషం వరకూ ఎంత మంది వీలైతే అంత మందిని నవ్వించాలని లక్ష్యంగా పెట్టుకొని ఇంట్లో నుండి పారిపోయి, అనుకున్నట్లుగానే చేసి చివరికి చనిపోతాడు. ఈ సందర్భానికి " జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ " అనే పల్లవితో మొదలుపెట్టి.. " రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని " లాంటి చరణాలు రాసి పాటగా పంపిస్తే ఇంకో వెర్షన్ రాయమని ఏ డైరెక్టర్ అయినా చెప్పగలరా..!
కొత్త బంగారులోకం : నీ ప్రశ్నలు నీవే.. బాగా చదివే బాలు అనే అబ్బాయి ఇంకో నాలుగు ఏళ్ల తర్వాత జీవితంలో స్థిరపడి తాను ప్రేమించిన స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని క్లాస్ రూంలో అందరిముందూ టీచర్ తో చెప్పి, భవిష్యత్ లో కాలం మన చేతిలో ఉండదని తన తండ్రి చనిపోయాక తెలుసుకుంటాడు. ఈ కథ మొత్తాన్ని ఒక్క పాటలో చెప్పారు శాస్త్రి గారు, అందులో ముఖ్యంగా " బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా " లాంటి మాటలు విన్నప్పుడు ఆవేశంలో దిల్ రాజు గారు బ్లాంక్ చెక్ ఇచ్చేసి ఉంటారేమో అనిపిస్తుంది.. ఇలా ఆయన గురించి ఒక్కో పాటగా చెప్పడం కష్టం, మనలో చాలా మందికి నచ్చిన ఫేవరేట్ పాటల్లో ఆయనవి దాదాపు 60% ఉన్నట్లు మనకు కూడా తెలియకపోవడం మన దౌర్భాగ్యం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం సరిగ్గా ఉపయోగించుకోకుండా వదిలేసిన పసుపు, వేపాకు, తులసి లాంటి ఒక సహజ వనరు శ్రీ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు..