శ్రావ్య స్కూల్ లో చదువుకుంటున్న రోజుల్లో స్కూల్ పక్కనే ఒక వ్యక్తి ఉండేవాడు. తనకు కావాల్సిన వారు, పలుకరించేవారు ఎవ్వరూ లేకపోవడంతో ముఖంలో జీవం లేక, ఆహరం లేక, రోజుల తరబడి ఎవ్వరూ మాట్లాడలేదని ఇట్టే తెలిసిపోతుంది. శ్రావ్యలోని మాతృ స్వభావం ఆ వ్యక్తిని ఆకలితో ఉంచలేదు. ప్రతిరోజూ తన కోసం అమ్మ ప్రేమగా వండిన వంటను, టిఫిన్ బాక్స్ ను ఆ వ్యక్తికి అంతే ప్రేమతో ఇచ్చేది. "పాప ఇలా చెయ్యకూడదు, నీ భోజనం నువ్వే తినాలి" అని ఆయ మందలించిన వినకపోవడంతో ఆయ శ్రావ్య అమ్మకు ఫిర్యాదు చేశారు. అమ్మ ఏమంటుందో, తనని తిడుతుందో అన్నదాని కన్నా ఆ వ్యక్తి కి భోజనం పెట్టడం కుదరదేమో అనే బాధ కూడా ఉండేది ఆ చిన్ని మనసులో.. "ఆ వ్యక్తికి ప్రతిరోజు నీ టిఫిన్ బాక్స్ ఇస్తున్నాను అని ముందుగానే చెబితే నీకోసం మరొక బాక్స్ కూడా కట్టేదాన్ని కదమ్మా" అని అమ్మ చెప్పేసరికి శ్రావ్య మనసు తేలికయ్యింది. ఆరోజు అమ్మ అలా శ్రావ్యతో మాట్లాడకపోయేదుంటే ఇప్పుడు సమాజానికి ఇంత మేలు జరిగేదో కాదో..
అధికారం లేకుంటే ఏంటి ప్రేమ ఉంది కదా: చిన్నతనం నుండే శ్రావ్య ఎదుగుదలతో పాటు పరిస్థితులను గమనిస్తున్న కొద్ది సమాజం పట్ల ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొంతకాలం జాబ్ చేసి దానికి రాజీనామా చేసి గ్రూప్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. కలెక్టర్ అధికారం ద్వారా ఎక్కువ మంది జీవితాలను మార్చవచ్చు తాను అనుకున్నది త్వరగా పూర్తి చేయవచ్చు అని అనుకుంది. రెండుసార్లు ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ లో పాస్ కాలేకపోయింది. జీవితాలను బాగు చెయ్యడానికి పదవి అధికారమే కావాలా.? నాడు మథర్ థెరిస్సా కు ఏ అధికారం ఉంది?, బాబా అమ్టే, కైలాష్ సత్యార్థి మొదలైన వారికి ఏ క్వాలిఫికేషన్ ఉందని కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు.. నాకు ఏ పదవీ అవసరం లేదు అని ముందుకు కదిలింది.
31 జిల్లాలు, 4,116 కిలో మీటర్లు: అమ్మ నీరజ గారు లాయర్, నాన్న చంద్రశేఖర్ గారు కాంట్రాక్టర్. ఐన కాని ఈ మహాయజ్ఞానికి అమ్మ నాన్నలను డబ్బులు అడగలేదు. జాబ్ చేస్తున్నప్పుడు దాచుకున్న కొంత డబ్బు, ఇంకా తన చేతి బ్రాస్ లేట్ ను అమ్మి ప్రయాణం మొదలుపెట్టింది. జూలై 1 హైదరాబాద్ లో మొదలైన ప్రయాణం జూలై 31 నాగర్ కర్నూల్ తో ముగిసింది. ప్రతి మనిషికి ఒక కథ, ఒక కన్నీటి వ్యథ, ప్రతి ప్రాంతంలోనూ రకరకాల సమస్యలు తనను పలుకరించాయి ఈ ప్రయాణంలో..
ప్రత్యేకంగా మహిళల కోసం: గర్భంలో నుండి మొదలుకుంటే స్మశానం చేరే వరకు మహిళ వివక్ష ఎదుర్కొంటుంది. మహిళలలోని గుర్తించలేని శక్తిని సంఘటితం చెయ్యడం కోసం "We and She Foundation" నెలకొల్పింది. భర్త లేకుంటే సర్వస్వం కోల్పోయినట్టే అనే ఒక మోసపూరిత నానుడి మన వాతావరణంలో కలిసిపోయింది. ఇది సైకలాజికల్ గా తీవ్ర ప్రభావం చూపెడుతుంది. శ్రావ్య 31 జిల్లాల పర్యటనలో సుమారు 1000 ఒంటరి మహిళలను కలుసుకోగలిగింది. వారిలో కూరగాయలు అమ్మే మహిళలు, బీడీ కార్మికులు, వరకట్న ఇబ్బందులు ఎదుర్కుంటున్న మహిళలు, టీచర్స్, విద్యార్థులు మొదలైన అన్ని వర్గాల వారిని ఈ 31 రోజులలో శ్రావ్య కలుసుకోగలిగింది.
ప్రభుత్వానికి నివేదిక: ఈ 31 రోజులపాటు తాను చూసినది, వారి పరిస్థితులు ఎలా మార్చగలం మొదలైన విషయంలో సమగ్రంగా ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నది. ఈ నివేదిక అంశాలను మేనిఫెస్టోలో చేరిస్తే మరింత మేలు జరుగుతుంది. వచ్చే 6 నెలల వరకు కూడా తాను ఈ నివేదిక కోసమే కృషి చేయబోతున్నారు.
You can reach them HERE