Saranga Dariya Beauty: Here’s The Beautiful Meaning Behind Love Story’s New Song

Contributed by Sairam Nedunuri

“Love Story” చిత్రం లో ఇటీవల విడుదలైన “సారంగ దరియా” పాట కొన్ని గంటల్లోనే ఎంతో ప్రేక్షక ఆదరణ పొందింది.

ఈ పాటని మొదటగా “రెలారే రెలా” అనే జానపద పాటల కార్యక్రమంలో పాల్గొన్న “కోమల” గారు సేకరించి పాడడం జరిగింది. జానపద గేయాల్లో ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది.

అదే బాణీని, పాటని తీసుకుని, సాహిత్యం, సంగీతం లో మార్పులు చేయించి, శేఖర్ కమ్ముల గారు తను దర్శకత్వం వహిస్తున్న “Love Story” చిత్రం లో పెట్టడం జరిగింది. ఈ చిత్రానికి “Pawan Ch” గారు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన A.R.Rahman Foundation స్థాపించిన “K.M.Music Conservatory” లో సంగీత శిక్షణ పొందారు. 

ఇప్పుడు విడుదలైన “Love Story” చిత్రంలోని “సారంగ దరియా” పాటకి కొత్త సాహిత్యాన్ని రాసినది “Suddala Ashok Teja” గారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఈయన ప్రతిభ గురించి మన అందరికీ తెలిసిన విషయమే.

కథానాయిక వ్యక్తిత్వాన్ని, నడవడికను, అందాన్ని వర్ణిస్తూ సాగుతుంది ఈ “సారంగ దరియా” పాట. తెలంగాణ జానపద, హైదరాబాదీ దక్కని మాండలికానికి చెందిన అద్భుతమైన పదాలని ప్రయోగించారు ఈ పాటలో. ఈ పాటలోని పదాల అర్థాలను, భావాన్ని ఈ Article లో వివరించడం జరగింది.

దాని కుడీ భుజం మీద కడవా

దాని గుత్తెపు రైకలు మెరియా

అది రమ్మంటే రాదుర సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని యేజెంటు రైకలు మెరియా

అది రమ్మంటే రాదుర సెలియా

దాని పేరే సారంగ దరియా

“దరియా” అనే ఉర్దూ/హిందీ పదానికి, “నది”, “ఏరు”, “సముద్రం” అనే అర్థం వస్తుంది. “సారంగా” అనే పదానికి “సంగీతం లోని ఒక రాగం”, “సంగీత వాయిద్యం”, “లేడీ”, “వెళ్లునది”, “పారేది” అనే అర్థాలు వస్తాయి. 

ఈ పాట సందర్భాన్ని పరిశీలిస్తే, “పారే నది” ని సూచించడానికి “సారంగ దరియా” అనే పదాన్ని రచయిత ఉపయోగించారు అని అర్థం చేసుకోవచ్చు. కథానాయిక యొక్క నడక, నడవడిక, వ్యక్తిత్వాన్ని, “పారే నది” తో పోల్చారు రచయిత. 

కడవ అంటే కుండ అనే అర్థం వస్తుంది.

తన కుడి, ఎడం భుజాలపై కుండని తీసుకెళ్తూ, మెరిసే వస్త్రాలను ధరించి, ఎవ్వరికీ సులువుగా చిక్కని వ్యక్తిత్వంతో నది లాగ పారుతూ వెళ్తోంది కథానాయిక అని వర్ణించారు రచయిత.

కాళ్లకు ఎండి గజ్జల్

లేకున్నా నడిస్తే ఘల్ ఘల్

కొప్పుల మల్లే దండల్

లేకున్నా చెక్కిలి గిల్ గిల్

మొదట చరణంలో కథానాయిక అందాన్ని, ఆహార్యాన్ని వర్ణించారు రచయిత. సాధారణంగా ఆభరణాలతో, అలంకరణలతోనే అందం వస్తుందని భావిస్తారు కొంతమంది. కానీ ఆభరణాలు, అలంకరణలు అవసరం లేకుండానే కథానాయిక వ్యక్తిత్వం వలన వచ్చిన అందాన్ని అద్భుతంగా చెప్పారు రచయిత. గజ్జెలు అవసరం లేకుండానే గజ్జెలతో సమానంగా తన అడుగుల సవ్వడి ఉందని, మల్లెపూలు పెట్టుకోకుండానే ఆ మల్లెపూల వెలుగులతో సమానంగా తన చెక్కిలి వెలుగులు ఉన్నాయని పోల్చారు రచయిత.

నవ్వుల లేవుర ముత్యాల్

అది నవ్వితే వస్తాయి మురిపాల్

మురిపెం అంటే “ముద్దుగా అనిపించడం” అనే అర్థం వస్తుంది. తను నవ్వినప్పుడు ముత్యాలు ఏమి రాలిపడవు కానీ, అంత కంటే గొప్పగా, ముద్దుగా కథానియిక నవ్వగలదు అని కథానాయిక నవ్వుని వర్ణించారు రచయిత.

నోట్లో సున్నం కాసుల్

లేకున్నా తమ్మలపాకుల్

మునిపంటితో నొక్కితే పెదవుల్

ఎర్రగా అయితది రా మన దిల్

సాధారణంగా మనం తినే కిళ్ళీలో తమలపాకుల (Betel Leaves) మీద సున్నం, కాసు రాస్తారు. కాసు (Catechu) అనేది “Acacia” family 

కి చెందిన ఒక చెట్టు నుంచి వచ్చే జిగురు పదార్థం. ఈ సున్నం, కాసు, తమలపాకుల వలన, మనం కిళ్ళీ తిన్నప్పుడు మన నోరు, నాలుక ఎర్రగ పండుతాయి. ఇవేమీ అవసరం లేకుండానే, తన మునిపంటితో తన పెదవిని అదిమి పెట్టడం ద్వారా, కథానాయిక పెదవి ఎరుపు ఎక్కుతుందని తన పెదవులని ఎంత అద్భుతంగా వర్ణించారో రచయిత.

చురియా చురియా చురియా

అది సుర్మా పెట్టిన చురియా

“చురియా” అనే ఉర్దూ/హిందీ పదానికి అర్ధం “Baya Weaver” అనే పక్షి. తెలుగులో గిజిగాడు అంటారు. “సుర్మా” అంటే “Stibnite” అనే Mineral Stone నుంచి చేసే ఒకరకమైన కాటుక. కాటుక పెట్టుకున్న గిజిగాడు పక్షి తో కథానాయిక అందాన్ని పోల్చారు రచయిత.

రంగే లేని నా అంగి

జడ తాకితే అయితది నల్లంగి

అంగి అంటే ధరించే వస్త్రం. రంగే లేని వస్త్రం అంటే, తెల్లటి వస్త్రం అనే అర్థం వస్తుంది. కథానాయిక తెల్లటి వస్త్రం ధరిస్తే తన జడకి ఉండే నలుపు, ఆ తెల్లటి వస్త్రానికి అంటుకుని, తెల్లని అంగి, నల్లని అంగి అవుతుందని తన కురుల నలుపు గురించి ఎంత అద్భుతంగా చెప్పారో రచయిత.

మాటల ఘాటు లవంగి

మర్ల పడితే అది శివంగి 

శివంగి అంటే ఆడ పులి అనే అర్థం వస్తుంది. “మర్ల పడితే” అంటే “తిరగబడితే” అనే అర్థం చేసుకోవచ్చు. తన మాటలు లవంగం (Clove) అంత ఘాటుగా ఉంటాయని, తను తిరగబడితే శివంగిగా మారగలదు అని కథానాయిక శక్తిని గురించి వర్ణించారు రచయిత.

తీగలు లేని సారంగి

వాయించబోతే అది ఫిరంగి

ఫిరంగి (Cannon) అంటే యుద్ధంలో పేలుడు పదార్థాలని ప్రయోగించడానికి ఉపయోగించే ఒక ఆయుధం. 

సారంగి అంటే ఒక సంగీత వాయిద్యం. చూడడానికి, వినడానికి కథానాయిక సంగీత వాయిద్యం లాగ మధురంగా ఉంటుంది కానీ, అలుసుగా తీసుకుంటే ఫిరంగి లాగా మండగలదు అని కథానాయిక ధైర్యాన్ని వర్ణించారు రచయిత.

గుడియా గుడియా గుడియా

అది చిక్కి చిక్కని చిడియా

హిందీ/ఉర్దూ లో “గుడియా” అంటే బొమ్మ అని అర్థం వస్తుంది. చిడియా అంటే పక్షి అనే అర్థం వస్తుంది. చూడడానికి బొమ్మ లాగా ఆకర్షవంతం గా ఉండే కథానాయిక, తన అర్థం అయ్యి, అవ్వని, వ్యక్తిత్వంతో చిక్కి చిక్కని పక్షి లాంటిది అని వర్ణించారు రచయిత. 

దాని సెంపల్ ఎన్నెలు కురియా

దాని సెవులకు దుద్దుల్ మెరియా

అది రమ్మంటే రాదుర సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని నడుం ముడతలే మెరియా

పడిపోతది మొగోళ్ళ దునియా

తన చెంపలు వెన్నెల లాగా మెరుస్తాయి అని. చెవికి పెట్టుకునే దుద్దులు మెరుస్తూ ఉంటాయని, తన అందాలని చూస్తే మగవాళ్ళు మైమరచి పోతారని చెప్పారు రచయిత.

ఇలాంటి అద్భుతమైన పాటని మొదటగా పరిచయం చేసిన “Komala” గారికి, సంగీతానికి అతి చక్కగా మెరుగులు దిద్దిన సంగీత దర్శకుడు “Pawan Ch” గారికి, తన గొంతు ఆ పాట మరింత హుషారు ని ఇచ్చిన “mangli” గారికి అద్భుతమైన సాహిత్యం రాసిన “Suddala Ashok Teja” గారికి, తన చిత్రాలతో జానపదానకి ఇంతటి ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్న “Shekhar Kammula” గారికి మన అందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు.

నేను వెతికినంతలో, అర్థమైనంతలో, అర్థాన్ని, భావాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. తప్పులుంటే క్షమించగలరని మనవి. 

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , ,