చెయ్యాలి అని బలంగా అనుకుంటే ఖచ్చితంగా చెయ్యగలుగుతాము. మనం స్ట్రాంగ్ గా సంకల్పిస్తే ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తాము, రన్నింగ్ చేస్తాము, డబ్బులు బాగా సంపాదించగలుగుతాము, ఇతరులకు సహాయం చెయ్యగలుగుతాము.. మనం గట్టిగా కోరుకుంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. చేయలేము, మన వల్ల కాదని అనుకుంటే ఏమీ చేయలేము. వేణు గారు కూడా అలా బలంగా కోరుకున్నారు. ఐతే వారు కోరుకున్నది తన కోసం కాదు, ఎవరో తెలియని వ్యక్తి కోసం కోరుకున్నారు. బలంగా కోరుకున్నారు.. ఆ కోరికే అతనికి వివిధ దారులను చూపించింది. ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరో పక్క ర్యాపిడో ద్వారా కూడా డబ్బులు సంపాదించి ఒక నిండు జీవితాన్ని కాపాడగలిగారు.
టీవీ ఛానెల్ లో చూసి.. వేణు గారు కొవ్వూరుకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఒకరోజు ఖాళీ సమయంలో టీవీ చూస్తుండగా స్వరూప పండరీ దంపతుల హృదయ విధారకమైన సంఘటన గురించి తెలిసింది. "మా భార్య అనారోగ్యానికి సహాయం చెయ్యండి, లేదంటే మెర్సీ కిల్లింగ్ కు అనుమతించండి" అని వేడుకుంటుంటే ఏ సంబంధం లేని వేణు గారి హృదయం చలించింది. వెంటనే మిత్రుల ద్వారా స్వరూప, పండరీ దంపతుల అడ్రెస్ తెలుసుకుని స్వయంగా వారిని కలుసుకున్నారు.
స్వరూప పండరీలది ప్రేమ వివాహం, పండరీ పెయింటింగ్ పని, స్వరూప కూలీ పని చేస్తుంటారు. ఒకరోజు స్వరూప గారికి తలనొప్పి ఎక్కువగా ఉంటే హాస్పిటల్ లో చూయించారు, బ్రెయిన్ లో ట్యూమర్ లాంటిది ఏర్పడిందని వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు వివరించారు. లక్షలు విలువ చేసే ఆపరేషన్ కోసం తనకున్న కాస్త స్థలం, ప్రభుత్వ సహాయం, అప్పులు, తెలిసిన వారి నుండి కొంతమంది సహాయం ద్వారా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, క్యూర్ అయ్యేంత వరకు స్కల్(పుర్రె) భాగాన్ని బయట ఎక్కడో ఉంచితే ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్లు కొంతకాలం వరకు స్వరూప గారి పొట్ట భాగంలోనే ఉంచారు. దానిని తిరిగి యధా స్థానంలో అమార్చడానికి మరల సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది దానికి కూడా లక్షల ఖర్చు అవుతుంది.
ర్యాపిడో డ్రైవర్ గా.. వేణు గారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా కానీ స్వరూప గారి హాస్పిటల్ ఖర్చులు తానొక్కడే తీర్చలేరు. అందుకని ఎంతో కొంత సహాయంగా ఉంటుందని ర్యాపిడో లో బైక్ నడపడం మొదలుపెట్టారు. ఉదయం 11:30 నుండి సాయంత్రం 5గంటల వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం, మిగిలిన సమయంలో ఉదయం మరియు రాత్రి వేళల్లో ర్యాపిడో లో బైక్ నడుపుతూ కొంత డబ్బు కూడబెట్టారు. ర్యాపిడో లో బండి నడుపుతున్నప్పుడు షూ, ఇన్ షర్ట్ వేసుకోవడం చూసి చాలామంది వేణు గారిని ఇలా చేస్తున్నందుకు ఏదైనా కారణం ఉందా అని అడిగేవారు, అడిగిన వారికి అడగని వారికి కూడా స్వరూప ఆరోగ్య పరిస్థితిని వివరించేవారు.
వేణు గారి తపనలో న్యాయం ఉంది, ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. అందువల్ల సహాయం అందింది. వేణు గారు, కుటుంబం అనే స్వచ్ఛంద సంస్థ, హాస్పిటల్ వారు బిల్ తగ్గించడం, మిలాప్ ఇంకా ర్యాపిడో కంపెనీ వారి సహాయం, వివిధ దాతల సహాయంతో స్వరూప గారి అపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలిగారు. మన తీవ్రమైన కాంక్షకు ఈ ప్రపంచం, కాలం కూడా తనను తాను మార్చుకుంటుంది అని మరోసారి వేణు గారి ద్వారా రుజువయ్యింది.