Contains minor spoilers. Read if you have seen the movie.
సొంత అన్న గొంతు ని ఎవరో కోసి పారిపోతే .. దానికి కూడా పసుపు పెట్టి రక్తాన్ని ఆపితే సరిపోతుంది అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చిట్టి బాబు .. రంగమత్త తన భర్త గురించీ అతని దుబాయ్ జీవితం గురించీ కళ్ళలో నీళ్ళు పెట్టుకుని చెప్తే "ఏమైంది అత్తా " అని అడగకుండా చేతిలోని సారాయి సీసా ఖాళీ ఐపోయింది అని కంగారు పడే వ్యక్తిత్వం చిట్టిబాబు ది .. పచ్చిగా చెప్పాలి అంటే ఎనభై ల నాటి ఒక పల్లెటూరు బైతు కుర్రాడి రూపాన్ని తెరమీద ఆవిష్కరించడం కోసం సుకుమార్ ఎన్ని జాగ్రత్తలు , రీసర్చ్ లూ చేసాడో తెలీదు కానీ ఆ క్యారెక్టర్ చెయ్యడానికి మాత్రం సదరు హీరోకి గట్స్ ఉండి తీరాలి . పైన చెప్పిన లాంటి మొండి , మొరటు , పల్లెటూరి , 'చెవిటి' వ్యక్తి క్యారెక్టర్ చెయ్యడం ఆషా మాషీ విషయం కాదు .
ఆ క్యారెక్టర్ కోసం సుకుమార్ రామ్ చరణ్ ని అప్రోచ్ అయ్యాడు అంటే ఫక్కున నవ్వేసే పరిస్థితి .. గుర్తు తెచ్చుకుంటే ఈ సుకుమార్ - చరణ్ కాంబినేషన్ అనుకున్న మొదట్లో నే వామ్మో చరణ్ తో సుకుమార్ ఆ .. ఎక్స్ ప్రెషన్ లు తెచ్చుకోలేక సస్తాడు అన్నవాళ్లు కోకొల్లలు .. అందులో నేనూ ఒకడ్ని . రామ్ చరణ్ మగధీర , ఆరెంజ్ లు పక్కన పెడితే సింగిల్ ఎక్స్ ప్రెషన్ స్టార్ అంటూ గేలి చేసారు చాలా మంది. చిరంజీవి కొడుకు గా పుట్టి మినిమం నటన తెలీదు అంటూ అతని ఫాన్స్ ని సైతం ఆడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్.
ఆఫ్ స్క్రీన్ లో చరణ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆన్ స్క్రీన్ ఎందుకో నచ్చేవాడు కాదు. అన్నయ్య కి వీరాభిమాని అయిన నాకు ఆయన నుంచి వచ్చిన వారసత్వం 'మినిమం' కూడా చెయ్యడం లేదు అనిపించేది. మొదట్లో ఇది నా ఒపీనియన్ మాత్రమే అనుకున్నా కానీ రాను రానూ అందరి నోట్లోనూ ఇదే మాట వినపడేది. ధ్రువ లాంటి సినిమాలతో పరవాలేదు అనిపించుకున్న చెర్రీ .. ' చిట్టి బాబు ' అనే సౌండ్ ఇంజినీర్ క్యారెక్టర్ తో నా లాంటి యాంటీ ఫాన్స్ కి రీ సౌండ్ ఒచ్చేలా చెంప పగలగొట్టాడు .. చిన్న చిన్న మినిమం బేసిక్స్ దగ్గర నుంచీ - అవుట్ లైన్ క్యారెక్టర్ వరకూ చిట్టిబాబు గా చరణ్ అత్యద్భుతంగా ఒదిగిపోయాడు.
పై పై న మాత్రమే క్యారెక్టర్ ని టచ్ చేస్తూ వదిలేయడం కాదు .. ఈ సినిమాకి సుకుమార్ ఎంతగా ప్రాణం పెట్టాడో చరణ్ అంతకంటే ఎక్కువ ప్రాణం పెట్టి మైన్యూట్ థింగ్స్ లో కూడా చిట్టి బాబు ని మన మనస్సులో ముద్రించాడు .. ఏడవడం , నవ్వడం , నవ్వించడం , అల్లరి , ఆక్రోశం , ఆవేదన , చేతకాని తనం , చావు చూడడం , పగ , ఓర్పు , ప్రతీకారం , సహనం అన్నిటినీ మించి క్లైమాక్స్ లో అతని 'వికృతం' చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..
ఎలాంటి సినిమా లవర్ కి అయినా .. మనసులు గెలుచుకునే పాత్రల రూప కల్పన కి ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది .. సెర్చ్ కాదు కాదు రీ సర్చ్ .. దాదాపు నలభై ఏళ్ళ క్రితం బతికింది అనుకునే ఒక ఊహాజనిత పాత్ర కోసం సుక్కూ చేసింది రీసర్చ్ అయితే చరణ్ చేసింది కూడా రీసర్చ్ .. కానీ చిట్టి బాబు మీద కంటే తన టాలెంట్ ని తాను రీ సెర్చ్ చేసుకుని అభినయాన్ని జీనియస్ లా తెర మీద ఆవిష్కరించాడు .. అలా ఆవిష్కరించి మరొక చిరంజీవి అవ్వాల్సిన అవసరం తునాతునకలు చేసి సరికొత్త 'నటుడు' గా తెలుగు సినిమా కి ప్రాణం పోసాడు .. చరిత్ర రచన ఆనాటికి తెలియదు, కాలం ఆ రచనల యొక్క విలువల్ని నిర్ణయిస్తుంది .. రంగస్థలం చూసాక థియేటర్ లలోంచి బయటకి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడికీ మనస్సులో ' చిట్టి బాబు ' తానే అనే ఫీలింగ్ నీ లేదా .. చిట్టి బాబు నిజంగానే మనమధ్యన ఉన్నాడు అనే ఫీలింగ్ నీ సృష్టించిన రామ్ చరణ్ కి ఒకప్పటి యాంటీ ఫాన్ గా ఇప్పటి సపోర్టర్ గా సాష్టాంగ ప్రణామం !!