"నాగలి మోసే ఎద్దులు అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక భూమిని చీల్చే నాగలి అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక నాగలిని చుట్టే దారం అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక ఎద్దులను కదిపే కర్ర అందరికి మేలు మరియు సంపద ఇవ్వుగాక." -క్షేత్రపతి సూక్తం ఋగ్వేదం.
అన్నదాతకు అన్నం దానం చేసే పరిస్థితి వచ్చింది. మనం ఇలా శుభ్రంగా ఉండటానికి కారణం రైతు బురదలోకి దిగడం, మనం ఇలా ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి కారణం రైతు ఎముకలు అరిగిపోయేలా కష్టపడటం. ఒకవేళ రైతు తన కోసం, తన కుటుంబం కోసమే భూమిలోకి దిగి భూమిని పొక్కిలి చేసి పండించుకుని బ్రతుతాను అనే నిర్ణయానికి వస్తే ఈ అంబానీ, బిల్ గేట్స్, ఎలిసన్, కార్లోస్ లా రైతు కూడా కొంతకాలంలోనే కోటీశ్వరుడు అయ్యేవాడు. అందుకనే రైతును త్యాగమూర్తిగా కీర్తించాలి, రైతు మనల్ని బ్రతికిస్తున్నాడు కనుక అందరికన్నా ఉన్నతంగా బ్రతకాలి. రైతును గౌరవించుకుంటు, రైతుతో కలిసి భోజనం చేసే అద్భుత అవకాశం "భాగ్యనగర్ గోపాలురు" తీసుకుంది.
రైతుతో కలిసి: చంద్రశేఖర్ అపర్ణ దంపతుల మనస్తత్వాలు దాదాపు ఒక్కటే. "భవిషత్తులోకి కలిసి నడుస్తున్న మనకు ఎన్నో మనస్పర్ధలు, అభిప్రాయం భేదాలు వచ్చే అవకాశం ఉంది వీటిని మనం కలిసి కట్టుగా ఎదుర్కొందాం అలాగే బలహీనంగా తయారైన రైతాంగాన్ని బాగుచేసి రైతు బలం పెంచుదాం". ఇవి పెళ్ళైన కొత్తలోనే చంద్రశేఖర్ అపర్ణ గార్లు చేసుకున్న ప్రమాణాలు. రైతులకు గైడెన్స్ ఇస్తూ, వారికి అండగా ఉంటూనే "రైతుతో భోజనం" అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో పూర్తిగా రైతు, ఇంకా భూమి సమిష్టి కృషితో పండిన పంటలతో మాత్రమే వండుతారు. స్వచ్ఛమైన గానుగ నూనెతో వండిన వంటలు, చేత్తో కుట్టిన విస్తరాకులు, నవార బియ్యం, బెల్లం పొంగలి, కూరగాయలు మొదలైన ఆహార పదార్ధాలతో పెస్టిసైడ్స్ మధ్యలో రాకుండా రైతు, భూమి పండించిన అసలైన పంటతో కమ్మని రుచిని అతిథులకు అందించారు. రైతులతో భోజనం కార్యక్రమం ఇంకా మరిన్ని చేయబోతున్నారు కూడా.
ఇంటి చెత్త నుండి: వ్యవసాయం చెయ్యడమన్నా, ఇంటిని అందంగా అలంకరించుకోవడమన్నా, ప్రకృతికి అతి దగ్గరగా బ్రతకడమన్నా చంద్రశేఖర్ గారికిష్టం. 300 గజాల తన ఇంటిని తనకు ఇంకా నలుగురికి ఉపయోగపడేలా రూపుదిద్దుకున్నారు. మట్టికి బాక్టీరియాను గ్రహించే శక్తి ఉంది కనుక చంద్రశేఖర్ ఇంట్లో అన్ని మట్టి పాత్రలే. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత, పక్షుల కోసం గూళ్ళు, ఇంట్లో చెత్తను పెరట్లోనే నిల్వచేస్తారు, పండ్ల వ్యర్ధాలను, కూరగాయల తరిగేటప్పుడు వచ్చే వ్యర్ధాలను మొదలైన వాటిని ఎరువుగా ఉపయోగించుకుంటారు. ఎరువును ఉపయోగించుకుని వాటి ద్వారా వచ్చే మొక్కలను ఆత్మీయులకు ఉచితంగా పంపిణీ చేస్తారు.
రైతులకు సహాయం: గ్యాస్ వినియోగం తగ్గించాలని వండే వంటను రెండుగంటల ముందుగానే నానబెడతారు. ఖాళీ సమయంలో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు వాడడం పూర్తిగా విస్మరించాలని వారబ్బాయి ప్రచారం చేస్తుంటాడు. తన పుట్టినరోజు కానుకగా క్లాత్ తో తయారుచేసిన సంచి ఉచితంగా ఇస్తుంటాడు. ఎస్ ఆర్ నగర్ లో చంద్రశేఖర్ గారు జనహిత ఆర్గానిక్ స్టార్ కూడా రన్ చేస్తున్నారు. ఈ స్టోర్ లో దొరికేవన్నీ ఆర్గానిక్ పంటలే. చంద్రశేఖర్ గారిలో ఉండే మరో మెచ్చుకునే లక్షణం రైతులకు ఆర్ధికంగా సహాయం చెయ్యడం. తను మరికొంతమంది స్నేహితులు కలిసి అర్హులైన రైతులకు ఆర్ధిక సహాయం ఇస్తుంటారు. నమ్మకం కోసం వారేమి నోట్స్ కూడా రాయించుకోరు.