ఇప్పుడంటే భారతదేశం అంతా వాడ్ని(గోపిచంద్) కీర్తిస్తుంది కాని చిన్నప్పుడు అల్లరి బాగా చేసేవాడు.. ఎప్పుడు ఆటలంటేనే లోకం వాడికి, ఎక్కువ క్రికెట్ అంటేనే ఇష్టపడేవాడు.. మాది మధ్యతరగతి కుటుంబం, నా భర్త పుల్లెల సుభాష్ చంద్రబోస్ ఒక బ్యాంక్ ఉద్యోగి. చిన్నప్పుడు 10సంవత్సరాల వరకు గోపిచంద్ మంచి క్రికేటర్ అవ్వాలనుకునేవాడు కాని క్రికెట్లో కాంపిటీషన్ ఎక్కువ, దానికన్న మరే ఇతర గేమ్స్ లో ఐతే గోపికున్న పట్టుదలతో ఇంకా మంచిస్థాయి అందుకోవచ్చు అని అనుకున్నాం.. ముందు టెన్నీస్ కోచింగ్ ఇప్పించడానికి స్టేడియంకు వెళితే అక్కడ పెద్ద కార్లతో పార్కింగ్ నిండిపోయింది అంతటి స్థాయలో ఫీజ్ కడుతు మేము కోచింగ్ ఇప్పించలేము అందుకే మా స్థాయికి తగ్గట్టుగా పెద్దబ్బాయి రాజ్‌తో పాటు గోపిచంద్ ను బాడ్మింటన్ లో శిక్షణ ఇప్పించాం.

వారిద్దరు ఒకరితో ఒకరు పోటాపోటిగా బాగా ఆడేవారు.. బాటా కాన్వాస్ షూస్ 24 రూపాయలకే వచ్చేవి. విపరీతంగా ఆడటం వల్ల కొన్న వారం రోజులకే అవ్వి పాడవ్వటం జరిగేది.. 250రూపాయలు పెట్టి ఖరీదైన షూస్ కొనమని బతిమలాడినా మా ఆర్ధిక స్థోమత వల్ల ఆరోజుల్లో కొనలేకపోయాం. గోపిచంద్ బాడ్మింటన్ లో రాణించడం మొదలుపెట్టడంతో వాడికోసం త్యాగాలు చేయడం అలవాటయింది నిజానికి అవ్వి త్యాగాలు అని మా కుటుంబం అనుకోదు వాడి బంగారు భవిషత్తు కోసం మేము ఇస్తున్న కానుకగా భావించాం.. మా కూతురు ఐతే ఏదైనా కొనిస్తానంటే వద్దనేది. ఆ డబ్బుతో అన్నయ్యకు షటిల్ కొనివ్వొచ్చనేది.. నేను కూడా కోఠికి ఆటో లో వెళితో ఖర్చు అవుతుందని కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్ళేదానిని.. అలా మిగిలిన డబ్బులతో గోపిచంద్ కు అవసరమయ్యేవి కొనేవాళ్ళం. గోపి దేశ, ప్రపంచస్థాయిలో ఎన్నో పథకాలు సాధించాడు కాని ఒలంపిక్స్ మెడల్ సాధించలేదు. నేను కాకపోయినా నా శిష్యులు ఐనా సాధించాలి అని కలలుకన్నాడు. గోపిచంద్ చిరకాల లక్ష్యం బ్యాడ్మింటన్ లో ఇండియాను అత్యున్నత స్థానంలో చూడాలని అందుకోసం ఒలంపిక్స్ లో భారత్ తరుపున పతకాలు సాధించాలనుకున్నాడు మా కుటుంబం అంతా ఒక్క మాటమీద ఉండి మాకున్న కొంత స్థలం అమ్మి ఇంకా మా కుటుంబ సన్నిహితులు నిమ్మగడ్డ ప్రసాద్ 5కోట్ల ఆర్ధిక సాయంతో గచ్చిబౌలిలో ఇండోర్ స్టేడియాన్ని స్థాపించాం.

2004 ఒలింపిక్స్‌కు ముందు నాకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అందరం భయపడ్డారు. నేను వద్దంటున్నా గోపీ ఒలింపిక్స్ ప్రయాణం రద్దు చేసుకున్నాడు. నా వద్దే ఉండి సేవలు చేశాడు. ఉదయమే కీమోథెరపీ చేయొంచుకొని ... తలకు స్కార్ఫ్ కట్టుకొని సాయంత్రం అకాడమీకి వచ్చి పనిచేసిన రోజులెన్నో ఉన్నాయి! గోపీని తీర్చిదిద్దటం తల్లిగా నా బాధ్యత కాబట్టి చేశాను. అదేమంత గొప్పకాదు. కానీ ఈ పిల్లల కోసం కష్టపడటం వేరు. మా అకాడమీ నుంచి ఒలింపిక్ పతకాలు వస్తున్నాయంటే నా జన్మధన్యమైందనే అనుకుంటున్నాను. ఈ బోనస్ జీవితానికి అంతకంటే మించిందేముంటుంది? గోపి నా కోరిక తీర్చాడు.

మా స్టేడియంలోకి దేశం నలుమూలల నుండి శిక్షణ కోసం వస్తుంటారు వారితో బయటివారిలా కాకుండా ఒక కుటుంబ సభ్యులులా ఉండటం వల్ల పిల్లలందరు తొందరగా మాతో కలిసిపోయేవారు. గోపిచంద్ ఉదయం 3:30కే నిద్రలేచి శిక్షణ ప్రారంభిస్తాడు. ఇక్కడికొచ్చె పిల్లలు ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉంటారు, సైనా నెహ్వాల్ లాంటి వారందరు మాంసం ముట్టేవారు కాదు, బ్యాడ్మింటన్ లాంటి శారీరక శ్రమతో కూడుకున్న ఆట కాబట్టి నాన్ వెజ్ తప్పక తినాలి. ఇది చాలా సున్నితమైన సమస్య దీనిని గోపిచంద్ చాలా ఉత్తమంగా పరిష్కరించాడు.. నాన్ వెజ్ వల్ల ఆటలో ఎలాంటి మార్పు వస్తుందో ఆటగళ్ళకు వారి కుటుంబ సభ్యులకు కూడా సవివరంగా వివరించి నాన్ వెజ్ ను కూడా వారి ఆహార అలవాట్లలో భాగం చేశారు.. పిల్లలకు మానసికంగా ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా వారి చూట్టు ఉన్న పరిస్థితులను బాగుచేసేవాడు. 3నెలల నుండి సింధుకు మొబైల్ ఫోన్ ఇవ్వలేదంటేనే అర్ధం చేసుకోవచ్చు గోపి ఎంతలా కేరింగ్ గా శిక్షణ ఇస్తాడన్నది.

వాడిని ఇప్పుడు భారతదేశం అంతా మెచ్చుకుంటుంది.. ద్రోణాచార్య, అర్జున, పద్మశ్రీ, పద్మభూషన్, రాజీవ్ ఖేల్ రత్న ఇలాంటి ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఒక తల్లిగా కాకుండా ఇన్ని సంవత్సరాలు గోపిని చూస్తున్న వ్యక్తిగా చెబుతున్నా 42ఏళ్ళ గోపి అందుకోవాల్సినవి చేరుకోవాలిసిని ఇంకా చాలా ఉన్నాయి, వాడు మరెన్నో విజయాలకు అర్హుడు!


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.