23 సంవత్సరాల పృథ్వీ తేజ పవన్ కళ్యాణ్ గారికి భయంకరమైన ఫ్యాన్. టీవీలో తమ్ముడు సినిమాను ఎన్నోసార్లు చూశాడు. తనని తాను "సుబ్బు" పాత్రలో ఉహించుకునేవాడు కూడా.. సినిమాలో సుబ్బు పాత్రలానే పృథ్వీ కూడా కాలేజీకి వెళ్లకుండా ఎన్నోసార్లు సినిమాలకు వెళ్ళేవాడు. ఒకరోజు సుబ్బు ఎలా ఐతే కిక్ బాక్సింగ్ లో కప్ గెలుచుకున్నాడో మన పృథ్వీ కూడా ఐఐటీ జేఈఈ 2011లో టాపర్ నిలిచాడు.. అది మాత్రమే కాదు తాను ఎంతగానో అభిమానిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పంజా సినిమా ఆడియో ఫంక్షన్లో తోటి అభిమానుల సమక్షంలో చిన్న వయసులోనే కలిసి సత్కారం అందుకున్నాడు.. ఇది 7 సంవత్సరాల క్రితం నాటి విజయం.. విజేతలు కేవలం ఒక్క విజయంతోనే ఆగిపోరు అని అన్నట్టుగా పృథ్వీ తేజ ప్రస్తుతం సివిల్స్ లో ఆల్ ఇండియా లో 24వ ర్యాంక్ సాధించాడు.
ఓ కిరాణా షాపు:
పృథ్వీ చిన్నతనం నుండి ఏ పని చేసిన చురుకుతనంతో, ఎంతో ఆసక్తితో చేస్తుంటాడు. ఈ లక్షణాలనే సరైన విధంగా ఉపయోగించుకుని జీవితంలో ఒక్కో నిచ్చెనతో ఎదుగుతున్నాడు. చదువు మాత్రమే జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకురాగలదని బలంగా నమ్మే కుటుంబ వారిది. అమ్మ నాన్నలు పశ్చిమ గోదావారి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ కిరాణా షాప్ నడిపించి ప్రస్తుతం బంగారు షాపు నడిపిస్తున్నారు.
జీవితం ముందు జీతం ఎంత..
ఐఐటీ ముంబాయి లో ఎలక్ట్రానికల్ ఇంజినీరింగ్ లో మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత శాంసంగ్ కంపెనీ వారు కోటిరూపాయల ప్యాకేజీతో పృథ్వీ ని ఎన్నుకున్నారు. పృథ్వీ కూడా ఆనందంగానే దక్షిణ కొరియాకు వెళ్ళాడు. కాని ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. సంవత్సరంలోనే తెలుసుకున్నాడు ఇది నా దారి కాదని. ఎప్పటినుండో మినుకు మినుకు మంటూ మదిలో మేలుస్తున్న ఐ.ఏ.ఎస్ లక్ష్యం అప్పుడే మేల్కొంది. "నేను ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని" అమ్మ నాన్నలకు చెప్పినప్పుడు వారు ఒక్కటే అనుకున్నారు "కొడుకు ఆశయం ముందు కోటి రూపాయల జీతం చాలా చిన్నదని".
మామయ్య కారణం:
మనలో ఓ ఆలోచన రావడానికి, మన జీవితం మార్చడానికి ఈ ప్రకృతి కొన్ని సంఘటనలు మన చుట్టూ జరగడానికి కారణమవుతుంది. పృథ్వీ మామయ్య ఐ.ఏ.ఎస్ కావాలని ప్రయత్నించారు, కాని సక్సెస్ కాలేకపోయారు. మామయ్య ప్రిపరేషన్ ను అతి దగ్గరిగా చూడడం, ఐ.ఏ.ఎస్ వల్ల సమాజాన్ని, దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలమో అప్పుడే మొదటిసారి తెలుసుకున్నాడు. కాకపోతే ఈ కుతూహలం లక్ష్యంగా మారడానికి మాత్రం కొంత సమయం పట్టింది.
ఒకే ఒక్క సంవత్సరం లోనే:
ఏ పనిచేసినా పృథ్వీ చురుకుతనం, ఆసక్తితో చేస్తాడని ఇందాక చెప్పుకున్నట్టుగానే సివిల్స్ విషయంలోనూ అదే విధంగా ప్రిపరేషన్ ను 2016లో మొదలు పెట్టాడు. ఢిల్లీ విజన్ ఇనిస్టిట్యూట్ లో కోచింగ్ జాయిన్ అయినప్పటికీ తనదైన శైలిలో ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. గొప్ప పుస్తకాలతో పాటుగా సీనియర్ల సలహాలతో ప్రిపేర్ అయ్యి జాతీయ స్థాయిలో 24 వ ర్యాంక్ తో అనుకున్న జీవితాన్ని అందుకున్నాడు..
సివిల్స్ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసినవారందరూ ఆనంద పడుతున్నారు కాని పృథ్వీ తేజ్ మాత్రం పరిపూర్ణంగా సంతోషపడడం లేదు, ఎందుకంటే తన అంతిమ లక్ష్యం దేశాన్ని, పేద ప్రజల జీవితాలను మార్చడమే కదా.. అప్పుడే పృథ్వీ కి పరిపూర్ణమైన ఆనందం..