కడుపు ఎండినోడు గుండె పగిలినోడు అక్షరాలను గొడ్డలితో చెక్కుతారు.. కొన్ని రకాల కవితలకు కత్తిలాంటి కలం అవసరం, మరికొన్ని కవితలకు సుకుమారమైన నెమలి ఈక అవసరం.. రాళ్ళబండి కవితాప్రసాద్ గారు ఈ రెండింటిలో ఉన్నతులు. కత్తికలాన్ని ఎలా వాడగలరో, నెమలి ఈకతో కూడా అంతే సుకుమారమైన కవితలు రాయగలరు. రాళ్ళబండి గారికి అమ్మ నాన్నలు వేంకటేశ్వర ప్రసాద్ అని పేరుపెడితే తెలుగు కవితల మీద ప్రేమతో కవితా ప్రసాద్ గా పేరు మార్చుకున్నారు.
కవితా ప్రసాద్ గారు ఉస్మానియా యూనివర్సిటీలో చాలా తక్కువ మంది చేసే అవధాన విద్య మీద పి.హెచ్.డి పూర్తిచేశారు. ఒక పక్క గ్రూప్ 1 ప్రభుత్వ అధికారునిగా ఉద్యోగం చేస్తూనే మరోపక్క తనకెంతో ఇష్టమైన తెలుగు సాహిత్యంలో శిఖరాలు చేరుకున్నారు. 500కు పైగా అవధానాలు, 'ఏకదిన శతకరచన ధార' అనే కార్యక్రమం ద్వారా ఒకే రోజులో అశ్రువు శతకాన్ని, 'ఆశుకవితా ఝరి' పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా (సోర్స్ వికీ) చెప్పారు. తెలుగు భాష మీద మంచి పట్టు ఉండడం చేత యువతను తన మాటల బాణాలతో వారిలో ఛైతన్యం నింపారు.
ఆయన రాసిన కవితలు, చెప్పిన ప్రసంగాలు వింటే ఆయన స్థాయి మనకు సులభంగా తెలుస్తుంది..
ఒక ఒంటరి సీతాకోకచిలుక రెక్క విరిగిపోయి, రాతిమీద రాలిపడితే దాని నిశ్శబ్ద విషాద ధ్వనిని ఎవరు వింటారు ఒక్క కవి తప్ప.
ఎక్కడో ఒకడు కవిత్వం రాసి నోబెల్ ప్రైజు తెచ్చుకుంటాడు, అది చదివి ఇంకొకడు గుండె పగిలి చచ్చి పోతాడు, అక్షరాలకి ఈ రెండు సంఘటనలు తెలియవు!
ఒకతెను చూసి ఇంకొకడు ప్రేమిస్తాడు. ఆమె ఇంకొకడితో లేచి పోతుంది, ప్రేమకు ఈ రెండు విషయాలు తెలియవు!
నువ్వు నన్ను తిడుతూ ఉంటావు, నేను నిన్ను పొగుడుతూ ఉంటాను, తిట్లకు, పొగడ్తలకు, మనమెవరో తెలియదు!
ఈ పదాలు ఇంతటి అర్ధాన్ని దాచు కున్న సంగతి నేను కవినైనదాకా తెలియదు! మట్టి ఇప్పుడు నాకో కొత్త అర్ధాన్నిస్ఫురింపజేస్తుంది. మనిషి ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. నిఘంటువుల పరిమాణం ఆకాశాన్ని మించి పెరిగిపోయింది. ఒక్క కన్నీటి చుక్క వేయి పదకోశాల సారాంశమౌతుంది.
విశాల మైన తెల్ల కాగితాన్ని చూస్తే ప్రియురాలి చిరునవ్వు గుర్తొస్తుంది. చిన్నప్పుడు ఈత కొట్టిన చెరువు గుర్తొస్తుంది. సందెవేళ బామ్మ చెప్పిన కథ గుర్తొస్తుంది. ఆ రాత్రి కన్న కల గుర్తొస్తుంది. పెళ్ళాం తో పడ్డ తగాదా గుర్తొస్తుంది. ఎవరి తోని పంచుకోలేని ఒంటరి తనం గుర్తొస్తుంది. మోసగించిన మనిషితనం గుర్తొస్తుంది. నిద్రిస్తున్న ఆకాశం లో మేలుకొని ఉన్న నక్షత్రాల కాంతి గుర్తొస్తుంది, తెల్లకాగితం నన్ను తనపైకి అనువదించుకునే అందమైన కవయిత్రి.
నువ్వెప్పుడైనా ఉద్యానవనంగా మారావా ? 'లేదు' అయితే నువ్వు పువ్వుల్ని కోల్పోయావు.. నువ్వెప్పుడైనా నదిగా మారావా? 'లేదు' అయితే నువ్వు అన్నిదాహాలు కోల్పోయావు.. నువ్వెప్పుడైనా ఎడారిగానన్నా మారావా? 'లేదు' అయితే నువ్వుఎన్నో ఒయాసిస్సుల్నికోల్పోయావు.. కనీసం నువ్వు నువ్వుగానన్నా మారావా? ' లేదు' అందుకే నన్ను కోల్పోయావ్.!
మహా వృక్షాన్ని నరికి ఇంటి తలుపుగా చేశారు! ఇక చిగురు వేయదు, పూలు పూయదు, కోయిల అసలే వాలదు! తెరిచిన ప్రతిసారీ తలుపు మాత్రం అరణ్యం కోసం తొంగిచూస్తుంది!
చీకటి లో నడిచేటప్పుడు కూడా, తమ నీడల్ని ఈడ్చుకు పోతున్నారు! కదల కుండా కూర్చుని కూడా పరుగేడుతుంటారు! ఒకరికొకరు ఢీకొట్టుకోకుండా తేనెటీగల్లా తుట్టె కేసి ఎగురుతుంటారు! ఏపువ్వును ఎవరు దోచుకున్నారో! ఏమనిషిని ఎవరుకుట్టి వచ్చారో! మర్చి పోతుంటారు!
సూరీడు ఉదయిస్తున్నట్లు తూర్పుకు తెలియదు అస్తమిస్తున్నట్లు పడమరకు తెలియదు ఇంద్రధనుస్సు పుడుతుందని చినుకుకు తెలియదు మేఘం గా మారినట్లు అలకు తెలియదు తుఫానొస్తుందని సముద్రానికి, భూకంపమొస్తుందని నేలకు, అందంగా ఉన్నానని వెన్నెలకు, అలాలేనని చీకటికి తెలియదు. మరి, నేను నాకు ఎలా తెలుస్తాను !?!? Image courtesy: మృత్యుంజయ్ గారు