Contributed by N.V. Chaitanya Sai
చేరుకోలేని దూరం ఏం కాదు, చేరువయ్యే... దగ్గర అని అనుకొలేను.
నువ్వు చేతికందే చేరువలో లేకపోయినా, దూరం నుంచే చూస్తూ... ఆనందిస్తున్నా. ఆ క్షణాల్లో అనిపిస్తుంది, నీకు, ఆ చంద్రుడు పంచే వెన్నెలకీ ఎం తేడా ఉందని!!
అలా నన్ను చెరుకొకముందే, నీలోని అద్భుతాలను నాకు పరిచయం చేస్తున్నావు. ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో...చిన్న బ్రేక్, అక్కడే, నీ అందం, నాలో పరుగులు పెట్టే ప్రేమ తలుపులు కలుసుకునేది.
నువ్వు కాఫీ తాగేటప్పుడు, ఈ ప్రపంచంలో నాకున్న రెండు ఇష్టాలు ఒకే చోట కలిసి నా కనుల ముందు అద్భుతమే జరుగుతున్నట్టు అనిపిస్తుంది.
గమనించి ఉండవు, ఆ క్షణాల్లో నీ కాఫీ కప్పుకి, నాకు పెద్ద యుద్ధమే జరుగుతుంది.
నీ పెదవులు తాకే, నీ చేతులు తడిమే ఆ కప్పు నా వైపు అహంకారంతో చూస్తుంది. అప్పుడే నాకు "అసూయకి" అర్థం తెలుస్తుంది.
మళ్ళీ అటువైపుగా వస్తే...ఆ కప్పు నన్ను చూసి కనుబొమ్మలు ఎగరేస్తుంది, మళ్ళీ నీ చెంతకే చేరుకుంటుంది అనే నమ్మకంతో! నేను వెంటనే దాన్ని అందుకుంటాను, నిన్ను కాకుండా వేరే వాళ్ళని చేరుకుంటుంది అనే భయంతో!!
ఇంకో మనిషి ఎవరో...నీ మనసుకి దెగ్గరగా ఉన్న మనిషి అనుకుంటా, నీ చేతితో కాఫీ అందించడానికి వెళ్తున్నావు. రెండు చేతులలో...రెండు కప్పులు నీ కనులలో తెలుస్తుంది ఆ అయోమయం, నీ ముందున్న తలుపు ఎలా తెరవాలి అని.
అప్పుడు ఎక్కడి నుండో ఇదంతా గమనిస్తూ ఉన్న నేను వెంటనే వచ్చి ఒక చేత్తో...నీ చేతిలోని కప్పు అందుకొని, ఇంకో చేత్తో నీ ముందున్న తలుపు తెరిచా...!
ఆ క్షణంలో, మన కనులు మొదటిసారి కలుసుకుంటాయి. నన్ను అక్కడే కట్టిపడేస్తాయి. ఇలా అవుతుందనే భయంతోనే...నువ్వు కష్టపడటం ఇష్టం లేకపోయినా, అలానే దూరం నుంచి చూస్తూ...ఉన్నా.
ఇలా చాలా ఉన్నాయి, నీ ముందుకు వచ్చిన రోజు నీకు ఇంకా చాలా చెప్తాను. కనుక, ఇలాగే... నా చూపులు నిన్ను తడిమే వరకూ... నా ఊసులు నీకు చెప్పాలని అనిపించే రోజు వరకూ... ఇలాగే ప్రేమించుకుందాం...ఏమంటావ్??