నిఖత్ జరీన్.. మొదట తను కుటుంబాన్ని గర్వపడేలా చేసింది.. తర్వాత స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, నిజామాబాద్, తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం భారతదేశం. బంధువులు, మిత్రుల దగ్గరినుండి జరీన్ గురుంచి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా తన విజయాన్ని తమ విజయంగా భావిస్తూ గర్వపడుతుంటారు. ఈ కాలంలో అమ్మాయి అబ్బాయి లాగా బ్రతకాలని స్పీచులు దంచి అంతర్లీనంగా మగవాడు గొప్ప అని మహిళా లోకాన్ని మేల్కొల్పాలని ప్రయత్నిస్తున్న వారి భారీ నుండి జరీన్ తన పంచ్ లతో "మహిళలకు పుట్టుకతో శారీరకంగానూ శక్తివంతులు" అంటూ నిరూపిస్తుంది. ఈ ప్రయాణంలో దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను తన ఆస్థులలో భాగం చేసుకుంది.
జరీన్ మస్తిష్కంలో జ్ఞానం, శరీరంలో సత్తువను తెలుసుకున్నప్పటి నుండే గేమ్స్ లో గెలవడం మొదలుపెట్టుంది. ప్రస్తుతం బాక్సింగ్ లో బంగారు పతకాలను అందుకుంటుంది కాని స్కూల్ పోటీల్లో మాత్రం రన్నింగ్, లాంగ్ జంపింగ్ విభాగాలలో గెలుపుతో స్నేహం చేసేది. చిన్నతనం నుండే మంచి ప్రతిభతో రాణిస్తుందంటే అందుకు ప్రధాన కారణం "తల్లిదండ్రుల ప్రోత్సాహం", నాన్న మహ్మద్ జమీల్ అహ్మద్ గారు కూడా స్పోర్ట్స్ పర్సన్. క్రికెట్, ఫుట్ బాల్ గేమ్స్ లను జిల్లా స్థాయిలో ఆడేవారు. జరీన్ కు ఇష్టమైన వాటి లానే ఆటలలోనూ సరైన గైడెన్స్ ఇచ్చారు.
కేంద్ర ప్రభుతం నుండి ప్రతిష్టాత్మక ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్న ఐ.వి. రావు గారి దగ్గర శిక్షణను 2009లో మొదలుపెట్టారు. సరిగ్గా సంవత్సరం తర్వాతనే తమిళనాడులో జరిగిన బాక్సింగ్ పోటీలలో బెస్ట్ బాక్సర్ అవార్డ్ తో పాటుగా గోల్డ్ మెడల్ ను గెలుచుకుంది. బాక్సింగ్ మీద ఇష్టం మూలంగానే తను ఈ స్థాయిలో ఒకే సంవత్సరంలో అందరిని ఆశ్చర్యానికి లోను చేయగలిగింది. జరీన్ ఏ పోటీలో పాల్గొన్నా ఒక పతకంతో మాత్రం ఖచ్చితంగా వచ్చేది.
జరీన్ లోని పట్టుదల ఏ స్థాయిలో ఉంటుందో ఈ చిన్ని సంఘటన ద్వారా అర్ధమవుతుంది. అఖిల భారత అంతర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో ప్రత్యర్ధి బలంగా వేసిన పంచ్ కు జరీన్ షోల్డల్ బోన్ పక్కకు జరిగింది. బాక్సింగ్ రింగ్ లోనే నేలకూలింది. రింగ్ లోనే కాదు జీవితంలోనూ కూడా, ఇక బాక్సింగ్ ఆడడం జరీన్ తరం కాదు అని అందరు అనుకున్నారు. జరీన్ కు కూడా ఒకానొక సమయంలో డీలా పడిపోయింది. మిత్రులు ఒలింపియన్లు సాక్షి మలిక్, వినీశ్, గీత ఫొగాట్ మోటివేట్ చేయడం, మళ్ళీ బాక్సింగ్ గ్లౌజ్ వేసుకోవాలనే బలమైన సంకల్పంతో కేవలం ఒకేఒక్క సంవత్సరంలో తన శారీరక లోపాన్ని జయించింది.
జరీన్ గెలుచున్న కొన్ని పతకాలు:
1. 2010 పైకా క్రీడల్లో గోల్డ్ మెడల్.
2. 2011 పంజాబ్ లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్.
3. 2011 ఐబా ప్రపంచ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్.
4. 2013 బల్గేరియా వరల్డ్ ఉమెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్.
5. అలాగే 2018 లో జరిగిన 56వ బల్గేరియా ఇంటర్నేషనల్ చాంపియన్ టోర్నమెంట్ లో బంగారు పతాకం 22 సంవత్సరాలకే అందుకొని విలువైన అనుభవంతో మరింత వేగంగా సాగిపోతున్నది.