ప్రతి అభిమాని తమ హీరో అంత స్థాయికి ఎదగగలరు.. కొన్ని సందర్భాలలో ఆ హీరోనే అభిమానికి అభిమానిగా మారగలడు కూడా. అభిమాని హీరోకు భజన చేసుకుంటూ అభిమాని గానే మిగిలిపోతే ఇక అభిమానించి ఎందుకు.! ప్రభాకర్ గారికి చిన్నతనం నుండి బ్రూస్ లీ అంటే చాలా ఇష్టం. బ్రూస్ లీ ఫొటోలు గోడలకు అతికించడం వరకు మాత్రమే తన అభిమానం పరిమితం కాలేదు బ్రూస్ లీ అంత స్థాయికి ఎదిగే వరకు ఆ అభిమానం ఉపయోగపడింది. ఒక మామూలు అభిమానికి ఆ అభిమానంతో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారికి చాలా విషయాలలో తేడా ఉంటుంది. ప్రభాకర్ జీవితంలో ఆ తేడా ఏ స్థాయిలో ఉందో ఒకసారి పరిశీలిద్దాం.
ప్రభాకర్ గారిది నెల్లూరు జిల్లా. చిన్నప్పుడు నాన్న ఖర్చులకు డబ్బులిస్తే వాటిని బ్రూస్ లీ సినిమాలు చూడడానికి ఉపయోగించలేదు కరాటే ట్రైనింగ్ తీసుకోవడానికి ఉపయోగించారు. ఇప్పుడు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించినా కాని ఆనాడు కోచింగ్ తీసుకుంటున్న సమయంలో నేను ఈ స్థాయికి చేరుకుంటాను అని ప్రభాకర్ గారు ఏమాత్రం ఊహించలేదు. మొదట కేవలం బ్రూస్ లీ స్టైల్ లో ఫైట్స్ చేయాలి అని అంతే కోరుకున్నాడు. కాని రాను రాను కరాటే అందరి కన్నా తొందరగా నేర్చుకోవడం, అందరికన్నా Best Performance ఇస్తుండడంతో ఇందులోనే మరింత రాటుదేలాలని సంకల్పించాడు. అలా చాలా తక్కువ సమయంలోనే కరాటేలో బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. "గెలుపు అనేది ఒక్కసారి కాదు అది ఒక నిరంతర ప్రక్రియలా, ఒక అలవాటు గా ఉండాలి" అని ఒక వ్రైటర్ అంటారు ప్రభాకర్ గారి ప్రస్థానం కూడా అలాగే సాగింది. మనదేశంతో పాటు చైనా, జపాన్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక దేశాలలో కరాటే, కుంగ్ ఫూ, కిక్ బాక్సింగ్ ఇలా దాదాపు 9 మార్షల్ ఆర్ట్స్ లో ప్రభాకర్ గారు నిష్ణాతుడిగా ఎదిగారు.. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ లో జరిగిన పోటీలలో ఇప్పటి వరకు సుమారు 50 సార్లకు పైగా ఛాంపియన్ గా నిలిచి తన సత్తా చాటాడు.
Warrior Monk: పురాతన కాలంలో చైనీయులు శత్రువుల నుండి వారి దేవాలయాలను రక్షించుకోవడానికి అత్యంత కఠిన శిక్షణతో యోధులను తయారుచేసేవారు. వీరినే మంక్ వారియర్స్ అంటారు. చైనా షావొలిన్ టెంపుల్ లో ప్రస్తుతం దీనికి ట్రైనింగ్ ఇస్తారు. దీని కోచింగ్ మామూలుగా ఉండదు మార్షల్ ఆర్ట్స్ లో ప్రపంచంలోనే అత్యున్నత శిక్షణగా దీనిని పరిగణిస్తారు. అక్కడ కోచింగ్ కు అర్హత సాధించడమంటే మామూలు విషయం కాదు ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఇది సాధ్యపడదు ఇప్పటి వరకు మనదేశం తరుపున కేవలం నలుగురు మాత్రమే అందులో శిక్షణ తీసుకున్నారట అందులో మన తెలుగువాడు ప్రభాకర్ గారు కూడా ఒకరు. ప్రభాకర్ గారు అక్కడ 18 నెలలు శిక్షణ తీసుకుని మరింత రాటుదేలారు.
అత్యున్నత శిక్షకులు: ప్రభాకర్ గారు(37) దాదాపు 20 సంవత్సరాలకు పైగా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక పక్క తను కోచింగ్ తీసుకుంటూనే, మరో పక్క కాంపిటీషన్స్ లో గెలిచి మెడల్స్ గెలుచుకుంటూ, ఇంకోపక్క తన లాంటి ఎంతోమంది యోధులను తయారుచేస్తున్నారు. తన దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ దేశంలోని 24 రాష్ట్రాలలో కోచింగ్ ఇస్తున్నారు. దేశ విదేశాలలో ఇప్పటికి వరకు నేను లక్షమందికి ట్రైనింగ్ ఇచ్చాను అని గర్వంగా చెబుతారు ఈ 16 సార్లు పైగా వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్న వీరుడు.
గెలిచిన అవార్డులు:
1. నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్ లో జరిగిన వివిధ పోటీలలో ఇప్పటి వరకు సుమారు 50 సార్లకు పైగా ఛాంపియన్ గా నిలవడం.
2. 16 వరల్డ్ రికార్డులు.
3. 3 సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం.
4. భారతదేశంలోనే మొదటి అత్యన్నత ఐదుగురు ట్రైనర్లలో ప్రభాకర్ గారు ఒకరు.
5. ఇంటర్నేషనల్ 5వ డెన్ బ్లాక్ బెల్ట్.
6. ఏషియన్ బెస్ట్ వరల్డ్ రికార్డ్.
7. మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం.
8. 2017 ఒక నిమిషంలో 80 Knee Kicks చేసినందుకు(అంతకు ముందు రికార్డ్ 60) గిన్నిస్ బుక్ లో స్థానం.
"నేను మర్షల్ ఆర్ట్స్ లో కేవలం సముద్రంలో ఒక స్పూన్ అంత మాత్రమే నేర్చుకున్నాను" ఇంత సాధించినా గాని ఈ అభిమాని నిత్య విద్యార్ధిలా ఈ మాట అంటుంటారు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం అనేది మహానుభావులలో ఉండే గొప్ప లక్షణంగా మనం అర్ధం చేసుకోవచ్చు.