Contributed By PRATAP BLS
చుట్టూ ప్రహరీ గోడతో ఇంచుమించు ఒక ఎకరం విస్తీర్ణం ఉంటుంది కాబోలు మనిషనే వాడు దరిదాపుల్లో ఎవడూ లేడు, అంతా నిర్మానుష్యం ఇటు వైపుగా వచ్చే వాహనాలూ లేవు ఆ నగరం లో మాదిరి రణగొణ ధ్వనులూ లేవు మౌనంగా, గంభీరంగా ఉంది.
అర్ధ రాత్రి...అందునా ఉష్ణోగ్రత తక్కువ చలి రాక్షసి షరా మామూలుగానే వణికిస్తోంది మొహమాటం లేకుండా... ఓ చిన్న పాటి మంటను వెలిగిద్దామని అక్కడే ఉన్న రెండు మూడు ఎండిన కట్టె పుల్లలు, దూరంగా పడి ఉన్న కొన్ని చిత్తు కాగితాలు ఏరుకొచ్చాను చిత్రంగా ఆ కాగితాల్లో ఒకటి నా దృష్టిని ఆకర్షించింది అగ్గి రాజుకుంది...చలిని వెక్కిరిస్తూ వేడి సెగొకటి నన్ను తాకుతుంటే నేనా కాగితాన్ని సరి చేసి చదవడం ప్రారంభించాను అందులో ఇలా రాసి ఉంది...
" సుమారు ఏడాది క్రితం అనుకుంటా (అప్పటికి నా ఫస్ట్ లవ్ పోయి ఐదేళ్లు, బ్రేకప్ సీన్లు చూస్తే తట్టుకోలేని స్టేజ్ లోనే ఇంకా ఉన్నా) నాకు స్పష్టంగా గుర్తుంది, గులాబీ రంగు చుడీదార్ లో సరాసరి ఆ పాలపుంత నుంచి ఈ ధరిత్రి అందాలు వీక్షించడానికి దిగొచ్చిన ఓ తారక లా గోచరించింది నిజం చెప్పాలంటే నా ఫస్ట్ లవ్ ని తొలిసారి చూసినప్పుడు నాలో ఉదయించిన ఓ మహత్తర క్షణం తిరిగి పునరావృతం అయినట్లనిపించింది ఒక్క క్షణం నాకు ఊపిరాగినంత పనయ్యింది టేబుల్ మీద నోట్ బుక్ ని, ఎడం చేత్తో పట్టుకున్న కాఫీ కప్పు ని, కుడి చేతిలో తిప్పుతున్న కలాన్ని దాటి ఓ భావోద్వేగం నా హృదయాన్ని చేరి కూసింత స్థలం కోసం వెతుక్కుంటోంది.
నాకు ఎదురుగా ఖాళీగా ఉన్న టేబుల్ మీద, ఏవో కొన్ని పుస్తకాలు పెడుతూ బ్యాగ్ లో ఉన్న ఫోన్ బయటకు తీసి ఎవరికో ఫోన్ చేసింది..తరువాత బేరర్ ని పిలిచి రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చింది. ఆ రెండో కాఫీ ఎవరికన్న ప్రశ్న ఆ క్షణంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టేసింది, గుండె వేగం రెట్టింపయ్యింది కాసేపటికి నా అనుమానాలు నివృత్తి చేస్తూ ఏంటక్కా రమ్మన్నావ్ అంటూ వాళ్ళ తమ్ముడు వచ్చాడు.. వాడ్ని కాఫీ తాగమని సైగ చేసి తనను డ్యాన్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చెయ్యమని చెప్పింది.
సరిగ్గా సాయంత్రం ఐదు కావస్తోంది...రోజూ ఆ టైం కి మా స్పందు(నా చెల్లి) డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు..నేను ఆ ఎమోషన్ ని అలాగే మోస్తూ కాఫీ షాప్ నుంచి బయటకు వచ్చి నా స్కూటీ స్టార్ట్ చేసి ట్రాఫిక్ ని దాటుకుని ఇంటికి చేరుకున్నా ఎందుకో ఆ అమ్మాయిని ఈ రోజు మళ్లీ కలుస్తాను అని చాలా బలంగా నాకనిపిస్తోంది, అంతలో మా అమ్మ పిలిచి ఎగ్స్ తీసుకురమ్మని అలాగే వచ్చేప్పుడు చెల్లిని పికప్ చేసుకోమని చెప్పింది.
సరే అని మా స్పందూ దగ్గరికి వెళ్ళాను, నేననుకున్నట్లే ఆ అమ్మాయి కనిపించిది అదీ మా స్పందూ తో... స్పందూ తనని నాకు పరిచయం చేసిన తరువాతనే తెలిసింది జాను (జాహ్నవి తన పేరు, మన పెర్సనల్ ఎమోషన్ కదా సో ముద్దుగా జాను..) వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుందని, ఇక్కడికి త్రీ డేస్ నుంచి వస్తుందని... మీరందరూ ఊహించినట్లే పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకోవడం, చాటింగ్ లు కాఫీలు, అప్పుడప్పుడూ చిన్న చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్లు అంతా బాగానే సవ్యం గానే సాగుతోంది...
అయితే ఇక్కడే ఓ చిక్కు ముడి ఉంది ఆ అమ్మాయి నన్ను ఒక మంచి స్నేహితుడు గానే చూసింది, అప్పటికే ఒక సారి దెబ్బ తిని ఉన్న నేను మాత్రం పెద్ద పోటుగాడి లా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి అది బయట పెట్టలేక, తనతో సరిగ్గా ఇమడలేక సతమతమవుతున్నా ఏదీ సెట్ అవ్వలేదు లైఫ్ లో అన్నీ ఎదురు దెబ్బలే అనే డిప్రెషన్ లో ఉన్న నాకు ఆ ఎమోషన్ ఎక్స్ట్రా బర్డెన్ అయిపోయింది నాకు తెలియకుండానే తనను నేను చాలా ఇష్టపడిపోయా ఇంత తక్కువ టైమ్ లో ఎలా అని నాకే చిరాకనిపించింది అది కూడా ఇదివరకే ఓ విఫలమైన ఫ్లాష్ బ్యాక్ ని వెనుక పెట్టుకుని...కానీ ఈ ఎమోషన్స్ కి అవేమీ పట్టవు కదా !!
పాపం తను నాకిచ్చిన స్పేస్ ఇస్తూనే ఉంది అలాగే తన పాత స్నేహితులు, కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు, తన పనులతో వ్యక్తిగతంగానూ, వృత్తి రీత్యానూ బిజీగా ఉంటోంది మన దరిద్రం కొద్దీ ఇక్కడే మనం ఇంకొంచెం ఉద్వేగానికి లోనవుతాం, చాలా బాధ పడిపోతాం, ప్రతీ క్షణం తను మనతోనే మాట్లాడాలి, మన మెసేజెస్ కి వెంటనే స్పందించాలి, రోజూ ఫోన్ చెయ్యాలి, నా ఆలోచనల్లో తను ఉండాలి అనే స్వార్థమో/ పిచ్చో/ వెర్రో/ శాడిజమో !!? ప్రేమిస్తున్నాం కదా పొసెసివ్నెస్ అనుకుంటా బహుశా !! ఈ ఎమోషన్ పుణ్యమా అని చీకట్లో ఒంటరిగా కూర్చుని ఏడవడం, కిలో మీటర్లు కిలో మీటర్లు నడవడం, రాత్రుళ్ళు నిద్ర లేకుండా గడపడం, దేనికీ సరిగా స్పందించకపోవడం, కెరీర్ మీద ఫోకస్ చేయలేకపోవడం ఇలా ఒకదాని తరువాత ఒకటిగా అన్నీ జరుగుతున్నాయి రోజులు గడుస్తున్నాయి..తన నుంచి మెల్లిగా మెసేజెస్ తగ్గిపోయాయి, కాల్స్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది ఇంకో పక్క నాలో బాధ విపరీతంగా పెరిగిపోసాగింది
(కాగితం రెండో వైపు చివరికి చేరుకున్నా...) "పాపం వీడెవడు?? వీడికి ఏమైంది, ఆ తరువాత డిప్రెషన్ నుంచి బయట పడ్డాడా?? ఇక్కడికి ఎప్పుడొచ్చాడు ఎందుకొచ్చాడు?? ఈ పేపర్ ఇక్కడ ఎందుకుంది??"
సాధారణంగా నా స్థానంలో ఉంటే ఎవడికైనా ఇలా చిన్న క్యూరియాసిటి ఉంటుంది కానీ నాకు లేదు...కారణం అది నా డైరీ లో పేపర్, నేను రాసుకున్న పేపర్, గత వారం ఇక్కడికి వచ్చి ఇలాగే ఓ మంట వేసి నా జ్ఞాపకాల్ని ఒక్కొక్కటిగా చించి కాల్చేసా కానీ ఈ ఒక్క కాగితం తెలివిగా తప్పించుకున్నట్లు ఉంది బహుశా ఈ రోజు కనబడి నన్ను నా గతం లోకి తోడ్కొని పోవడానికి కాబోలు !!
తను నాతో మాట్లాడటం తగ్గించేసాక నేను చాలా ఏడ్చాను ఎంతలా అంటే ఎవరికీ వినిపించనంతగా ఏ వెలుతురు కూడా నాలో చీకటిని పసిగట్టలేనంతగా ఒంటరిగా నాలో నేను నాతో నేను...నా బాధ ఎవరికీ చెప్పుకోలేదు ఎందుకంటే హేళన చేస్తారేమో అన్న భయం, ఇప్పుడు ప్రేమేంటి ఇదివరకే ఒక సారి దెబ్బతిన్నావ్ కదా బుద్ది లేదా, నీ జాబ్ ట్రైల్స్ లో నువ్వు ఉండకుండా ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఎందుకు అని తిడతారని భయం
నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా, పిచ్చి పిచ్చిగా ఏవేవో రాతలు రాస్తూ నా భావోద్వేగాలను సిరాలో కలిపి కాగితానికి అందించేశా...కానీ ఏంటో కాలం గడిచినా కోలుకోలేకపోతున్నా, ఆ భావోద్వేగాన్ని వదిలి రాలేకపోతున్నా
ప్రస్తుతం నేను కొంత బాధ, కొన్ని భావోద్వేగాల పద్మవ్యూహం లో చిక్కుకున్నా అయినా కానీ పయనిస్తా అరుణ కిరాణాన్నై అనంత విశ్వాలకు ఆ శూన్య సాగరం గుండా