శ్రీరాముని అవతారం ఆంజనేయ స్వామి వారికోసం కాదు రావణ సంహారం కోసం.. లక్ష్మీ నరసింహావతారం ప్రహ్లాదుని కోసం కాదు హిరణ్యకశపుని సంహారం కోసం.. భగవంతుని ప్రతి అవతరానికి ఒక ఖచ్చితమైన బలమైన కారణం ఉంటుంది. అంతర్వేది కున్న పవిత్రత, శక్తి కారణంగా అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి వారి దేవాలయాన్ని భక్తులు దక్షిణ కాశిగా పిలుస్తారు. ఈ గుడి తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉన్నది. నరసింహాస్వామి వారికున్న దేవాలయాలలోనే అత్యంత పవిత్రమైన కోవెలగా ఈ గుడిని భక్తులు పరిగనిస్తారు.
ఇదే ప్రాంతంలో బంగాళాఖాతపు సముద్రంలో వశిష్ట గోదావరి నది కలిసిపోవడం ఈ ప్రాంతానికి ఉన్న మరో ప్రత్యేకత. సముద్రంతో పాటు, గోదావరి నది, మంచి వాతావరణం కూడా ఉండడంతో ఇది కేవలం దేవాలయ దర్శనానికి అని మాత్రమే కాకుండా ప్రకృతిలో రిఫ్రెష్ అవ్వడానికి కూడా మంచి టూర్ లా మిగిలిపోతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు. ఈ అంతర్వేది అతి పురాతనమైన ప్ర్రాంతం. దీని చరిత్ర అతి పురాతనమైనది. బ్రహ్మదేవుడు పరమేశ్వరునిపై చేసిన కొన్ని తప్పులకు ప్రాయశ్చితంగా రుద్రయాగం చేయాలని అనుకుంటాడు. ఆ రుద్రయాగానికి వేదికగా ఈ ఈ ప్రదేశాన్ని ఎన్నుకున్నారట అలా ఎన్నుకుని 'అంతర్ వేదిక' అనే పేరు పెట్టారు.. ఆ తర్వాతి కాలంలో ఇదే పేరు అంతర్వేదిగా మారిందని కథనం. ఇక్కడి పవిత్రత మూలంగ కేవలం బ్రహ్మ మాత్రమే కాదు, వశిష్ట మహర్షులు లాంటి ఎందరో మహర్షులు యాగాలు, తపస్సులు చేశారట.
పూర్వం వశిష్ట మహర్షి ఇక్కడ వేదికను ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తుండగా రక్తవచలోనుడు అనే రాక్షసుడు వశిష్ట మహర్షిని ఇబ్బందులకు గురి చేస్తుంటే వశిష్ట మహర్షుల వారు ఆ రాక్షసుడిని సంహారించడానికి నరసింహా స్వామి వారిని పిలిచారట. నరసింహస్వామి మొదట సులభంగానే ఆ రాక్షసుడిని చంపగలనని అనుకున్నారట.. కాని రక్తవచలోనుడి రక్తం నేల మీద పడి మరింతమంది రాక్షసులు వస్తున్నారని అంతరిక్షంలోనికి తీసుకెళ్ళి అక్కడ సంహరించారట. అంతరిక్షం నుండి రక్తం నేలమీద పడకుండా అశ్వరూడాంభిక అమ్మవారు నాలుక చాపి రక్తపు చుక్కలు మీద పడకుండా అడ్డుకున్నారట. ఆ యుద్ధం తరువాత వశిష్ట మహర్షి కోరిక మేరకు ఇక్కడే వెలిశారని ఇక్కడి పూజారుల కథనం. బ్రహ్మోత్సవాలు, నృసింహ జయంతి, వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, రథోత్సవం లాంటి పండుగలు అత్యంత వైభవంగా జరుగుతాయి.