Some Interesting Behind The Scenes Of 50’s Classic Folklore ‘Jagadeka Veeruni Katha’

This Post was originally written by Pulagam Chinnarayana garu on his facebook page.

దర్శకుడు కేవీ రెడ్డి లేకుంటే తెలుగు సినిమా ఇంత స్ట్రాంగ్ గా, సూపర్ పవర్ గా ఉండేది కాదేమో.
క్లాస్ సినిమా అయినా ….
మాస్ సినిమా అయినా
ఆయన వేసిన రూట్ మ్యాప్ లోనే ఇప్పటికీ తెలుగు సినిమా నడుస్తోంది .
హీరో అనే వాడికి ఒక గ్రాఫ్ సెట్ చేసి పెట్టింది కేవీ రెడ్డి గారే .

సంగీత సాహిత్యాలు, ఛాయాగ్రహణ కళాదర్శకత్వాలు ….ఇలా ఏ విభాగం చూసుకున్నా కేవీ రెడ్డి ఒక మీటర్ బిగించి వెళ్లారు.

ఆయన ప్లానింగ్, పర్ఫెక్షనిజం, డిసిప్లైన్ ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటుంటారు.
గళ్ళా పెట్టె నుంచి బాక్సాఫీస్ గళ్ళా పెట్టె ని నింపే డైరెక్టర్ గా ఎదిగిన వాడు కేవీ రెడ్డి.

భక్తపోతన, యోగివేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్దమనుషులు, దొంగ రాముడు, మాయాబజార్, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేక వీరుని కథ, శ్రీ కృష్ణార్జున యుద్ధం, సత్య హరిచంద్ర, ఉమా చండి గౌరీ శంకరుల కథ, భాగ్య చక్రము, శ్రీ కృష్ణ సత్య….
ఇవి కేవీ గారు తీసిన సినిమాలు….మనకు అందించిన ఆణిముత్యాలు.

ఆయన దర్శకత్వం వహించిన అపురూప చిత్రరాజం ‘జగదేకవీరుని కథ’ తెర వెనుక ముచ్చట్లు …

‘మాయాబజార్‌’ విడుదలైన మూడేళ్లకి…కె.వి.రెడ్డితో మళ్ళీ విజయా వారు సినిమాకి ప్రణాళిక రచన చేశారు. ఈ మధ్యలో ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో నాగిరెడ్డి-చక్రపాణి ‘అప్పుచేసి పప్పుకూడు’ తీశారు.

ఈసారి నిర్మాతగా తన పేరే వేసుకుంటానన్నారు కె.వి.రెడ్డి. అలాగే చిత్ర నిర్మాణంలో ఏ శాఖలోనూ, ఏ విధంగానూ చక్రపాణి జోక్యం చేసుకోకూడదని ముందే షరతు విధించారు. వాహినీ ప్రొడక్షన్స్‌కు తీసిన చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి తనకు ఇచ్చే పారితోషికంతో పాటు లాభాల్లో కూడా కొంత వాటా ఉండాలని షరతులు పెట్టారు. వీటన్నింటికీ నాగిరెడ్డి-చక్రపాణి ఒప్పుకున్నారు.

విజయా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద తీసిన చిత్రాలన్నిటిలోనూ నిర్మాతలు నాగిరెడ్డి- చక్రపాణి అనే ఉంటుంది. నిర్మాతలుగా వాళ్లిద్దరి పేర్లు లేకుండా తీసిన తొలిచిత్రం ఇదే.

1944లో పి.యు.చిన్నప్ప, యు.ఆర్‌. జీవరత్నం నటించిన ‘జగదల ప్రతాపన్‌’ ఘన విజయం సాధించింది. ఈ తమిళ చిత్రం ఆంధ్రాలోని ‘ఎ’ క్లాస్‌ సెంటర్స్‌లో సైతం నూరు రోజులు ప్రదర్శితమైంది. పక్షిరాజా ఫిలింస్‌ సంస్థ ఈ సినిమా తీసింది. ‘జగదల ప్రతాపన్‌’ సినిమా స్ఫూర్తితో పింగళి నాగేంద్రరావు నవరసభరితంగా ఒక కథ తయారు చేశారు.

వాహినీ స్టూడియోలో ప్రముఖులు పిచ్చాపాటీ మాట్లాడుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఆ రోజు కె.వి.రెడ్డి అక్కడకు వెళ్లేసరికి పింగళి నాగేంద్రరావు నీరసంగా కనపడ్డారు. ఎప్పుడూ ఉత్సాహంగా కనబడే పింగళి ముఖంలో దిగులుని బట్టే పసిగట్టేశారు కె.వి.రెడ్డి. విషయమేంటని చాలాసార్లు అడిగినా చెప్పడానికి ఇబ్బంది పడ్డారు పింగళి. చివరకు కె.వి.రెడ్డి బలవంతం మేరకు అసలు విషయం చెప్పారు పింగళి. అదేమిటంటే-పింగళి ‘జగదల ప్రతాపన్‌’ ఆధారంగా తను తయారు చేసిన జానపద కథను నాగిరెడ్డికి వినిపిస్తే ఆయన మౌనం వహించారట. నాగిరెడ్డి ఏ విషయం చెప్పకపోవడమే మన పింగళి వారి దిగులుకు కారణం.

కె.వి.రెడ్డి కూడా ఆ కథ విన్నారు. ఆ కథలో ఆయనకు కొత్త అందాలు కనిపించాయి. దీన్ని తెరకెక్కిస్తే విజయం తథ్యమని మనసు సంకేతం పంపింది. మాటలూ పాటలూ పింగళి వారే రాశారు. స్క్రీన్‌ప్లేని కె.వి.రెడ్డి రాసు కున్నారు. అలా ‘జగదేకవీరుని కథ’ మొదలైంది.

ఇక తారాగణం ఎంపిక మొదలైంది. జగదేకవీరునిగా విజయా వారి ఆస్థాన కథానాయకుడైన ఎన్‌.టి.రామారావు ఎంపికయ్యారు. ఎన్టీఆర్‌ ‘పాండురంగ మహాత్మ్యం’తో తెలుగు తెరమీద కొచ్చిన కన్నడ భామ బి.సరోజాదేవి. ‘భూకైలాస్‌’, ‘పెళ్లి సందడి’, ‘పెళ్లి కానుక’ చిత్రాలతో యువతరం హృదయాలను కొల్లగొట్టారామె. ఇంద్ర పుత్రికగా ఆమే కరెక్ట్‌ అనుకున్నారు కె.వి. రెడ్డి.

‘సిపాయి కూతురు’ (1959) సినిమాలో రాజనాల పక్కన నర్తకి వేషం వేసిన ఎల్‌. విజయలక్ష్మిని నాగకన్య వేషానికి తీసుకున్నారు. పన్నెండేళ్ల వయసులో ‘శ్రీకృష్ణ లీలలు’, ‘బాలనాగమ్మ’ (1959) సినిమాల్లో చిన్న వేషాలు వేసిన కమలకుమారి గోల్డెన్‌ స్టూడియోలో ‘జగదేక వీరుని కథ’ షూటింగ్‌ చూడ్డానికి వచ్చారు. ఈ అమ్మాయిని చూసి కె.వి.రెడ్డి ‘నటిస్తావా?’ అనడిగి ఇందులో వరుణ కుమారి పాత్రను ఇచ్చారు. ఈ కమలకుమారి ఎవరో కాదు ప్రముఖ నటి జయంతి.

సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావుతో ‘దొంగరాముడు’ సినిమా సమ యంలో కె.వి.రెడ్డికి బాగా అనుబంధం ఏర్పడింది. ‘జగదేకవీరుని కథ’కి ఆయనతోనే స్వరాలు చేయించుకున్నారు. విజయా సంస్థలో పెండ్యాల చేసిన తొలి చిత్రం ఇదే. ఆ తరువాత ‘ఉమాచండీ గౌరీశంకరుల కథ’కు పని చేశారు. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘భాగ్యచక్రం’, ‘శ్రీకృష్ణసత్య’ సినిమాలకీ పెండ్యాలే స్వర సారథి.

ఎల్‌.విజయలక్ష్మికి మహాకవి శ్రీశ్రీ, హాస్యనటుడు రాజబాబులకు మరదలైన గాయని రమోలా డబ్బింగ్‌ చెప్పారు. ఆమె డబ్బింగ్‌ చెప్పిన తొలి సినిమా ఇదే.
కె.వి.రెడ్డికి దూరదృష్టి ఎక్కువ. ఈ సినిమా షూటింగ్‌ ఆరంభానికి ముందే షెడ్యూల్‌ సిద్ధమైంది. ‘జలకాలాటలలో..’ పాట జనవరిలో పడింది. కాల్షీట్‌ సమయం ఉదయం ఏడు గంటలకి. జనవరి అంటే చలిరోజులు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆ పాట తీసే మూడు పూటలూ వేడినీరు సరఫరా చేయాలి అని నోట్‌ రాసి ప్రొడక్షన్‌ వారికి అందజేశారు. అప్పటికప్పుడు వేడి నీళ్ళు అంటే కష్టమేకదా. కె.వి.రెడ్డి అడ్వాన్స్‌డ్‌ ప్లాన్‌ అలా ఉండేది.

అలాగే ఈ పాట చిత్రీకరణ సమయానికి జయంతికి 103 డిగ్రీల జ్వరం. కె.వి.రెడ్డి ఇద్దరు డాక్టర్లను, ఒక నర్సును పిలిపించి ప్రతి అర గంటకు ఆమెను పరీక్షింపచేయిస్తూ ఈ పాట పూర్తి చేశారు.

శివశంకరీ…పాటలో ఒకే ఫ్రేమ్‌లో ఐదుగురు ఎన్టీఆర్‌లను చూస్తుంటే కనులూ, మనసూ రెండూ నిండిపోతాయి. ఈ పాటకి సినిమాలో శిలకరిగినట్లుగానే మనమూ కరిగిపోతాం, కదలిపోతాం. ఘంటసాల గానానికి నందమూరి అభినయించిన తీరు నభూతో నభవిష్యతి. ఇవాళ్టి అత్యాధునిక కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌కి దీటుగా ఒకే ఫ్రేమ్‌లో ఐదుగురు ఎన్టీఆర్‌లు కనిపించడం మార్కస్‌ బార్‌ట్లే ఛాయాగ్రహణ నైపుణ్యానికి నిదర్శనం. ఈతరం ప్రేక్షకులు సైతం ఎంజాయ్‌ చేయగలిగేంత వినోదం, విలాసం, సాహసకృత్యాలు, సంగీత సాహిత్యాలు ఈ సినిమాకి తరగని చిరునామాలు.

బి.సరోజాదేవి తెలుగులో తన మనసు దోచుకున్న సినిమాలుగా రెండే చెబుతారు. ఆ రెండూ కె.వి.రెడ్డివే కావడం గమనార్హం. ఒకటేమో ‘జగదేకవీరుని కథ’, రెండోదేమో ‘కృష్ణార్జున యుద్ధం’. కె.వి.రెడ్డికి కూడా సరోజాదేవి అంటే అమితమైన అభిమానం. అలాగే ఈ సినిమా ఎల్‌.విజయలక్ష్మికి బాగా పేరు తెచ్చిపెట్టింది.

ఒక పేదరాశి పెద్దమ్మ కథకు నవరసాలు జోడించి మనోహరమైన దృశ్యకావ్యంగా కె.వి.రెడ్డి తీర్చిదిద్దారు. సాధారణంగా జానపదమంటే ఏదో కాకమ్మ కథ తరహాలోనే ఉంటుంది. కానీ కళ్లకు కట్టినట్టుగా కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి ‘ఇది భ్రమ కాదు, వాస్తవమే’ అనేంతగా రసానుభవం కలిగేలా ఆవిష్కరించిన ఘనత దర్శకుడైన కె.వి.రెడ్డికే దక్కుతుంది. ఈ సినిమాతో ఆయన మరోసారి ‘దర్శక జగదేకవీరుడు’ అనిపించు కున్నారు.

దర్శకుని ప్రతిభకు సాంకేతిక నిపుణుల సామర్ద్యం, నటీనటుల అభినయం తోడైతే ఎలాంటి జనరంజక చిత్రం రూపొందుతుందనడానికి ఈ సినిమానే ప్రత్యక్ష నిదర్శనం. జానపదాన్ని ఇంత కన్నుల పండుగగా రూపొందించడం కె.వి.రెడ్డికే చెల్లింది.

తను జానపదం తీసినా, పౌరాణికం తీసినా సమకాలీన సమాజాన్ని, పరిస్థితుల్ని సమయో చితంగా వాడుకునే కె.వి.రెడ్డి ఇందులో కూడా ఆ పద్ధతిని మానుకోలేదు. ప్రభుత్వాలు ప్రజల నుంచి రుణాలు సేకరించే పద్దతిని రేలంగి పోషించిన ‘రెండు చింతలు’ పాత్ర ద్వారా చూపించారు.

పింగళి కలం..పెండ్యాల స్వరం…ఘంటసాల గళం వెరసి కె.వి.రెడ్డి సినీ ప్రియులకిచ్చిన వరం ఈ ‘జగదేక వీరుని కథ’.

ఏ సినిమా అయినా విడుదలైతే ఆ సినిమా తాలూకు అనుభూతులు, విజయానుభవాలు ఆ తరానికే పరిమితమవుతాయి. కానీ ఐదారు తరాలని ఒకే రీతిన అలరించిన సినిమా ‘జగదేకవీరుని కథ’. ఇది మామూలు విషయం కాదు. ఇందులో నందమూరి నవరసాభినయం, నిజంగా దేవకన్యల్ని తలపించిన నలుగురు నాయికల అందచందాలు, పింగళి చమత్కారాలు, పెండ్యాల సంగీత సౌరభాలు, మార్కస్‌ బార్‌ట్లే కెమేరా విన్యాసాలు, రేలంగి, గిరిజ, సిఎస్సార్‌, రాజనాల పండించిన నవ్వులు ఈ సినిమాని ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశారు.

పింగళి వారి పద ప్రయోగాలు ఒక ఎత్తు అయితే ‘హాయ్‌… హలా’, ‘ఓ మానవా’ వంటి మాటల్ని తేనెలూరేలా బి.సరోజాదేవి పలుకుతుంటే కుర్రాళ్లు వెర్రాళ్లు అయ్యారు.
పరాయి పొందు ఆశించి పర లోకానికి వెళ్లే మహారాజ పాత్రలో రాజనాల, అతనికి వత్తాసుపలికే బాదరాయణ ప్రగడగా సిఎస్సార్‌ చిలికిన హాస్యం కొత్త పుంతలు తొక్కింది. విలన్‌గా పేర్గాంచిన రాజనాల తనలో మంచి హాస్య నటుడు ఉన్నాడని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు.

ఈ సినిమాకి జవజీవాన్ని చ్చింది ప్రధానంగా పింగళి వారి కలం. అడుగడుగునా హాస్యాన్ని చిందించింది. కొత్త పోకడలు పోయింది. సంభాషణల్లోనూ, పాటల్లోనూ, ఆఖరికి పేర్లలోనూ కూడా ఈ కొత్తదనం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఛాయా గ్రహణం కన్నుల పండుగ చేస్తుంది. బ్రహ్మాండమైన సెట్టిం గులు నేత్రపర్వంగా ఉంటాయి. పెండ్యాల సప్తస్వరాలతో ఉయ్యాల లూపారు.

అంతకు ముందు జానపదాల్లో కాస్ట్యూమ్స్‌ స్టైల్‌ వేరేగా ఉంది. కానీ దీనికోసం పట్టు వస్త్రాలతో హీరో కాస్ట్యూమ్స్‌ పెట్టించారు. స్టిల్స్‌ చూసి ‘ఇదేంటి…రివర్స్‌ అవుతుందా’ అని చాలా మంది అనుకున్నారు. నొసట తిలకం దిద్దారు. ఇదే ప్యాట్రన్‌ని తరువాత అందరూ అనుసరించారు.

సింగిల్‌ హీరోకి నలుగురు హీరోయిన్లతో ఫుల్‌లెంగ్త్‌ సినిమా నడపడం అసాధారణ విషయం. ఇంతకు ముందు ఈ తరహా వచ్చినా ఏదీ సక్సెస్‌ కాలేదు.
ఈ సినిమా ముగ్గురు హీరో యిన్లకీ స్టార్‌ స్టేటస్‌ తీసుకువచ్చింది. ముఖ్యంగా బి.సరోజా దేవి రేంజ్‌ పెంచింది.

ప్రేక్షకుల్ని ఊహాలోకాల్లో విహరింపచేసే కథ ఇది. నిక్షేపం లాంటి కాలక్షేపం ఈ సినిమాలో పుష్కలంగా లభిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్న ఓ జగదేకవీరుని కథ ఇది.

ఇప్పటికీ రిపీట్‌ వేల్యూ ఉన్న సినిమా ఇది. వీడియో మార్కెట్‌లో ఏమాత్రం రేటు తగ్గకుండా అమ్మకాల్లో ముందంజలో ఉంది. ఛానెల్‌లో ఎప్పుడు ఈ సినిమా వచ్చినా కళ్లప్పగించి, మనసప్పగించి చూసే ప్రేక్షకులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. తెలుగులో ఫస్ట్‌ బ్యాచ్‌లో 18 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమై అప్పటి వరకూ విడుదలైన అన్ని చిత్రాల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌గా నిలిచి తరువాత మొత్తం కలిపి 25-30 కేంద్రాల్లో వంద రోజులాడింది. ఇప్పటికీ మహారాష్ట్రలోని షోలాపూర్‌లో వందరోజు లాడిన ఏకైక తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.

ఆనాటి సినీ విమర్శకుల మాటల్లో చెప్పాలంటే ”మాయలూ మోసాలూ, ప్రేమలూ-ద్వేషాలూ, మంత్రాలూ- తంత్రాలూ, పాటలూ-పద్యాలూ, హాస్యం-లాస్యం..మొదలైనవన్నీ తగిన ప్రమాణాల్లో ఈ చిత్రం నిండా ఉన్నాయి.”

కథా సంగ్రహం :
ఉదయగిరి మహారాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రతాప్‌, చిన్నవాడు జగజ్జిత్తు. ఇంద్రకుమారి, నాగకన్య, వరుణపుత్రి, అగ్నితనయ చుట్టూ సేవలు చేస్తుండగా, చలువరాతి మేడలో తూగుటుయ్యాలలో ఊగుతూ ఆనందం పొందాలని భావిస్తాడు ప్రతాప్‌. అతని కోరిక విడ్డూరంగా ఉందంటూ ఆగ్రహం చెందిన మహారాజు దేశ బహిష్కారం శిక్ష విధిస్తాడు. దెయ్యాల సహాయంతో దేవకన్యలు జలక్రీడలు ఆడుతున్న చోటుకువెళ్లి శిలగా మారతాడు ప్రతాప్‌. పార్వతీదేవి అతడికి మానవరూపం రప్పిస్తుంది. ఓ ముని శాపవశాన తన వస్త్రాలను దోచినవానితో ఇంద్రపుత్రిక కాపురం చేయవలసి ఉంటుంది. ప్రతాప్‌ ఆమె వలువలు దొంగిలిస్తాడు. చేసేదిలేక ఆమె అతడ్ని వరిస్తుంది. వారిద్దరూ కలిసి కామకూట రాజ్యానికి వెళతారు. కామాంధుడైన ఆ దేశ మహారాజు త్రిశోకుడి దృష్టి ఇంద్రపుత్రిక జయంతిపై పడుతుంది. ప్రతాప్‌ను జయంతి నుంచి దూరం చేస్తే ఆమెను పొందవచ్చనే ఆలోచనతో నానా పన్నాగాలు పన్ని చివరకు పతనమైపోతాడు. ఇంద్రపుత్రిక స్నేహితురాళ్లయిన ఇతర సుందరీమణులు కూడా జగదేకప్రతాపుని చెలులవుతారు. మళ్లీ తన చీర లభించడంతో జయంతికి శాపవిమోచనమై స్వర్గానికి వెళ్లిపోతుంది. అయితే పతిపై మనసు చంపుకోలేకపోవడంతో దేవతలు జగదేకవీరుని పరీక్షిస్తారు. దేవతలు పెట్టిన పరీక్షలో జగదేకవీరుడు నెగ్గి, తన నలుగురు భార్యలనూ తెచ్చుకుని కలకాలం సుఖంగా రాజ్యం ఏలుతాడు.

బెంగాలీ తెరపైనా నందమూరి హవా
⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️
బెంగాలీలో పౌరాణికాలు తీసేది తక్కువ. దాంతో తెలుగులో వచ్చే పౌరాణికాలను అనువదించుకుని ఆనందపడేవారు. ముఖ్యంగా నందమూరి పౌరాణికాలు చాలామటుకు బెంగాలీలోకి అనువదించబడ్డాయి. అన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ‘లవకుశ’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీకృష్ణవిజయం’ ఇత్యాది చిత్రాలన్నీ బెంగాలీలోకి వెళ్లాయి. ‘జగదేకవీరుని కథ’ కూడా బెంగాలీలో ఘన విజయం సాధించింది.

‘శివశంకరీ… పాటలో లాజిక్‌ కోసం ఓ రొమాంటిక్‌ సీన్‌ పెట్టారు – సింగీతం శ్రీనివాసరావు
‘జగదేకవీరుని కథ’కి కె.వి.రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకునిగా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావును ఈ సినిమా గురించి అడిగితే నిన్న మొన్న పనిచేసిన సినిమాలాగా టకీటకీమని ఆ అనుభవాలను వివరించారు.

జగదల ప్రతాపన్‌’ అనే తమిళ సినిమా స్ఫూర్తితో పింగళి ఈ కథ తయారుచేశారట. నిజమేనా?
తెలుగునాట కాశీమజిలీ కథల్లాగా తమిళనాట ‘జగదల ప్రతాపన్‌’ కథ జనంలో బాగా ప్రచారంలో ఉంది. దానినే పి.యు.చిన్నప్ప కథానాయకుడిగా తెరకెక్కించారు. తమిళంలో అది ఘనవిజయం సాధించింది. దీనినే తెలుగులో చేస్తే బాగుంటుందన్న ఆలోచన కె.వి.రెడ్డి గారికి కలిగింది. ‘మాయాబజార్‌’ నుండి నేనాయనకి దర్శకత్వ శాఖలో సహాయకుడిని. ‘జగదల్‌ ప్రతాపన్‌’ ఆడుతున్న రాజకుమారి థియేటర్‌కి వెళ్లి సీనిక్‌ ఆర్డర్‌ రాసుకురమ్మని నాకు పురమాయించారు. బ్యాటరీ లైట్‌ వేసుకుని చిన్న పుస్తకంలో పాయింట్స్‌ రాస్తున్నాను. నా వెనుక ఎవరో తొంగిచూస్తున్నట్టుగా అనిపించింది. ఇంటర్వెల్‌లో చూస్తే ఆ తొంగిచూసేది ఎవరో కాదు… నటి ఛాయాదేవి. ”ఏంటి? దీన్ని తెలుగులో తీస్తున్నారా?’ అని ఆసక్తిగా అడిగింది. నేను నవ్వి ఊరుకున్నాను. పింగళి నాగేంద్రరావుగారికి చెప్పి కథ రాయించాను. అదే ‘జగదేకవీరుని కథ.’

ఈ సినిమాని తెలుగు, తమిళాల్లో ఒకేసారి తీశారా?
అదేం లేదు. కేవలం తెలుగులోనే తీశారు. తర్వాత తమిళం, కన్నడంలోకి డబ్బింగ్‌ చేశారు.
ఈ సినిమా తీయడానికి ఎన్ని రోజులు పట్టింది?
కె.వి.రెడ్డిగారు ఏ సినిమా అయినా 60 రోజుల్లో పూర్తిచేసేస్తారు. నెలకి 10 రోజులు చొప్పున ఆరు నెలల్లో పూర్తిచేస్తారు. ఒక్కోసారి నెలలో 15 రోజులు చేస్తారు. సెట్స్‌ వేయడానికి కూడా టైం పడుతుంది కదా.
‘శివశంకరీ…’ పాటని ఎలా తీశారు? ఒకే ఫ్రేమ్‌లో ఐదుగురు ఎన్టీఆర్‌లను ఎలా చూపగలిగారు?
‘శివశంకరీ’… పాటలో ఐదుగురు ఎన్టీఆర్‌లు కనిపించే దృశ్యాన్ని రెగ్యులర్‌ మాస్క్‌ షాట్స్‌లో తీశారు. మామూలుగా డబుల్‌రోల్‌ ఎలా తీసేవారో, అదీ అంతే. ‘జగదల ప్రతాపన్‌’లో హీరో ఐదు రూపాల్లో ఇంద్రలోకంలో పాడే పాట అక్కడ పెద్ద హిట్‌. తెలుగులో కూడా అలాంటి పాడ పెడదామనుకున్నారు. అయితే కె.వి.రెడ్డి గారికో సందేహం వచ్చింది. ఒక మానవమాత్రుడు ఇంద్రలోకం వెళ్లడం వరకూ ఓ.కే. గానీ, అక్కడ ఐదు రూపాల్లోకి మారడం అనేది ‘జగదల ప్రతాపన్‌’లో కన్విన్సింగ్‌గా చూపలేదు. జనాలు కూడా పట్టించుకోలేదు. తెలుగులో కూడా పట్టించుకోలేదుగానీ, లాజిక్‌ లేకుండా చేయడం ఎలా? కె.వి.రెడ్డి గారి మనసు తొలిచివేసింది. దాంతో దీనికి ఉపోద్ఘాతంగా ఒక రొమాంటిక్‌ సీన్‌ పెట్టారు. హీరో ఇంద్రకుమారితో ఉంటే నాగకుమారికి కోపం వస్తుంది. ఒకవేళ నాగకుమారితో ఉంటే వరుణకుమారికి కోపం వస్తుంది. చెలులు హీరోతో చెలగాటమాడుతుంటారు. దీనికి ఒక పరిష్కారంగా ఇంద్రకుమారి హీరోకి ఒక మంత్రం ఉపదేశిస్తుంది. ఆ మంత్రం ఫలితంగా ఎన్ని రూపాలైన సాధించుకోవచ్చు. హీరో ఈ మంత్రం వల్ల తన ప్రియురాళ్ళ ఇరకాటం నుండి తప్పించుకుంటాడు. అక్కడ ‘మనోహరముగా…’ అనే పాట వస్తుంది. క్లైమాక్స్‌లో ‘శివశంకరీ..’ పాటలో ఐదుగురు ఎన్టీఆర్‌లు కనిపించడం కోసం ఇలా పాట, సీన్స్‌ పెంచి లాజిక్‌ పెట్టారు కె.వి.రెడ్డి.

ఇంతకుముందు వచ్చిన జానపదాల కన్నా భిన్నంగా ఇందులో ఎన్టీఆర్‌ కాస్ట్యూమ్స్‌ను పట్టువస్త్రాలతో డిజైన్‌ చేయించారెందుకని?
ఈ కాస్ట్యూమ్స్‌ను డిజైన్‌ చేసింది కళాదర్శకుడు కళాధర్‌. ‘జగదేకవీరుని కథ’ తీసే సమయానికి నిర్మాణ విలువలు పెరిగాయి. దాంతో ఈ సినిమాను రిచ్‌గా తీశారు. దానికితోడు మార్కస్‌ బార్‌ట్లే ఫొటోగ్రఫీ వల్ల సినిమాకు చాలా అందం వచ్చింది.

ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
దేవకన్యలు స్నానం చేస్తుంటే వాళ్ల చీరలు తీసుకుని ఎన్టీఆర్‌ పరిగెట్టే సీన్‌ నాకు బాగా ఇష్టం. ‘నరుడా నరుడా’ అని వెనక దేవకన్య పిలుస్తున్నా వెనక్కి చూడకుండా ఎన్టీఆర్‌ అమాయకంగా పరిగెడుతుంటే… చూడ్డానికి భలే అనిపిస్తుంది. అంత ఇమేజ్‌ ఉన్న హీరో ఒక చిన్న కుర్రాడిలా ఆ సీన్‌ చేశారు. థియేటర్‌లో ఈ సీన్‌కి క్లాప్స్‌ పడ్డాయి.
ప్రసిద్ధ నటి కన్నాంబతో గెస్ట్‌ వేషం చేయించారేం?
స్క్రిప్టు తొలి దశలో అక్కడ ముని పాత్ర అనుకున్నారు. ఎన్టీఆర్‌ ఆ మునిని శరణు కోరితే అతను దేవకన్య చీర తెమ్మని చెప్పడం, తరువాత వారిద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది. ఆ ముని పాత్రను నాగయ్యలాంటి పెద్ద ఆర్టిస్ట్‌ చేస్తే తప్ప పెద్దరికం రాదు. తరువాత ఎందుకనో దాన్ని ఆడపాత్రను చేసి కన్నాంబతో చేయించారు. ఆమెతో ఒకే ఒక్కరోజు షూటింగ్‌ చేశారు. ఈ సినిమాలో ఉన్న ఏకైక గెస్ట్‌ ఆర్టిస్ట్‌ ఆవిడ.
ఈ సినిమా షూటింగ్‌ సమయంలో మీరు మరిచిపోలేని సంఘటన ఏదైనా వుందా?
కె.వి.రెడ్డి గారు షూటింగ్‌కి కొత్తవాళ్లను అనుమతించరు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో నా భార్యకు నాలుగో నెల. ఎన్నడూ షూటింగ్‌ చూడని ఆమె ‘జగదేకవీరుని కథ’ షూటింగ్‌ చూస్తానని అడిగింది. ఒకరోజు కె.వి.రెడ్డిగారు నా భార్య ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, ‘ఒక తీరని కోరిక కోరింది’ అని చెప్పాను. ఏంటని అడిగారు. ‘మీ షూటింగ్‌ చూడాలని ఉందట’ అని చెప్పాను. ఆయన నవ్వేసి ”ఫర్లేదు, తీసుకురండి’ అని అనుమతి ఇచ్చారు. ‘ఆదిలక్ష్మీ వంటి అత్తగారివమ్మా…’ పాట తీస్తుండగా నా భార్యను తీసుకువెళ్లాను… చాలా ఆనందపడిపోయింది.
మొన్నామధ్య ‘మొఘల్‌ – ఏ అజం’ సినిమాకి రంగులు అద్దినట్టుగా, ఈ సినిమాకూ రంగులద్దితే ఎలా ఉంటుంది?
ఈ రంగులు అనే ప్రక్రియ సక్రమంగా చేయాలి. కొన్ని కొన్ని నలుపు తెలుపుల్లో ఉన్న అందాలు కలర్‌లో రాకపోవచ్చు. నాకు ఇలాంటి ప్రక్రియల మీద ఆసక్తి లేదు. దేని అందం దానిదే. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న అందం, పవిత్రత కలర్‌లోకో, డి.టి.ఎస్‌లోకో మారిస్తే రాకపోవచ్చు. అసలు ఈ పద్ధతే కరెక్ట్‌ కాదు. ఉన్నదానిని పాడుచేసేకన్నా, కొత్తగా సినిమానే చేసుకోవచ్చు కదా.

చరిత్రలో నిలిచిపోయిన ‘శివశంకరీ’… పాట :
అన్ని పాటల రికార్డింగ్‌, చిత్రీకరణ పూర్తయింది. క్లైమాక్స్‌ తీయడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపు కె.వి.రెడ్డి, పెండ్యాలను పిలిచి ”ఇప్పుడు మీరు చేయబోయే పాట సినిమాకి ప్రాణం లాంటిది. ఇది క్లైమాక్స్‌లో వస్తుంది. ఆ సన్నివేశం వివరిస్తాను. హీరోకి ఒక పెద్ద పరీక్ష ఎదురవుతుంది. పెద్ద శిలారూపంలో ఉన్న గంధర్వుడికి సంగీతం పాడి ఆ శిలను కరిగించి ప్రాణభిక్ష పెట్టాలి. ఎలాంటి సంగీతం పాడాలో మీరే నిర్ణయించాలి. పూర్వం నారద, తుంబురులు సంగీతాన్ని పాడి శిలలు కరిగించేవారట. ఈ యుగంలో కూడా దీపక్‌ రాగం పాడి తాన్‌సేన్‌ దీపాలు వెలిగించారు. ఇటీవలి కాలంలో కూడా పూజ్య పండిట్‌ ఓంకార్‌నాథ్‌ ఠాకూర్‌, బీహార్‌లో కరవు కాటకాలు విజృంభించి ప్రాణుల హాహాకారాలు మిన్నుముడుతుంటే, వేలాది జీవాలు నేలరాలుతుంటే తను మేఘమల్హర్‌ రాగాన్ని ఆరురోజుల పాటు నిర్విరామంగా పాడి వర్షాలు కురిపింపజేసి సుభిక్షం చేశారు. నీగ్రో సింగర్‌ పాల్‌ రోబ్బన్‌ తన గంభీరమైన గొంతుతో ఒక శ్రుతి పాడితే ఆ సౌండ్‌ వైబ్రేషన్‌కి దూరంగా వున్న గ్లాసు పగిలిపోయిందట. సంగీతానికి ఉన్న శక్తి అపారం. ఆ లెక్కన మీరు సరైన సంగీతం పాడిస్తే సినిమాల్లో శిలే కాదు, నిజమైన శిల కూడా కరుగుతుంది. మరి ఏ రాగం పాడిస్తారో, ఎలా పాడిస్తారో ఇది కేవలం మీ శక్తిసామర్థ్యాల మీద ఆధారపడి ఉన్న విషయం. మీరు కావాల్సినంత టైం తీసుకోండి. మీరు కంపోజింగ్‌ పూర్తిచేసి నాకు వినిపించండి. ఈలోపల మిమ్మల్ని డిస్ట్రబ్‌ చేయను’ అని చెప్పారు.
ఆ మర్నాడు సిట్టింగ్‌లో ‘శివశంకరీ శివానందలహరి’ అంటూ పల్లవి రాసిచ్చారు పింగళి నాగేంద్రరావు. దానికి రకరకాల రాగాల్లో ట్యూన్స్‌ కట్టారు పెండ్యాల. చివరికి దర్బారీ రాగంలో చేసిన ట్యూన్‌ అందరికీ నచ్చింది. తరువాతి రోజే చరణం రాసి ఇచ్చారు పింగళి. ఓ పదిహేను రోజులు ఇంటివద్దే కూర్చుని పెండ్యాల స్వరరచన ముగించారు. తీరా అది చూస్తే పదమూడు నిమిషాలు ఉంది. దాన్ని కె.వి.రెడ్డి ఆరున్నర నిమిషాలకు కుదించారు.
‘శివశంకరీ’ పాట మొత్తం ఒకే టేక్‌లో పాడితే బాగుంటుందని పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాలకు సూచించారు. దాంతో వారం రోజులపాటు ఇంకో రికార్డింగ్‌కు వెళ్ళకుండా ఈ పాటనే సాధన చేసి సింగిల్‌ టేక్‌లో పాటను పాడి ఓకే చేసుకున్నారు ఘంటసాల. ఒకటి శ్రుతిలో ఈ పాటను రిహార్సల్స్‌ చేసిన ఘంటసాల ఒకటిన్నర శ్రుతిలో పాడారు.
పాట విని బాగా స్పందించిన నందమూరి, ఘంటసాలతో కూర్చుని రిహార్సల్స్‌ చేసారు. పాట చిత్రీకరణ సమయంలో సెట్‌లో ఉండమని పెండ్యాలను కోరారు. ఆ పాట తీసిన వారం రోజులూ పెండ్యాల లోకేషన్‌లోనే ఉన్నారు. నందమూరి కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా లిప్‌మూమెంట్‌ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
‘రారా కనరారా…’ పాటని తొలుత భాగేశ్వరి రాగంలోనూ, తరువాత అరబిక్‌, ఈజిప్టియన్‌ మెలోడీస్‌లోనూ చేశారు పెండ్యాల. చివరికి నందమూరిని పిలిచి విషయం చెప్పి ఎంపిక బాధ్యత మీదే అన్నారు. రెండింటినీ విని భాగేశ్వరికే ఓటేశారు నందమూరి. అప్పట్లో నటీనటులకి, దర్శక నిర్మాతలకి మధ్య సమన్వయం అలా ఉండేది. ఫలితం బాగుండాలనేది అందరి తాపత్రాయమునూ!

ఆరు భాషల్లో విజయదుందుభి
???????????
‘జగదేకవీరుని కథ’ తెలుగు, తమిళాల్లో ఒకేసారి తీశారని అందరూ అనుకుంటుంటారు. కానీ దీన్ని తెలుగులోనే తీశారు. కన్నడ, తమిళ, ఒరియా, బెంగాలీ, హిందీ భాషల్లో విజయా వారే అనువదించారు.
తెలుగుతో పాటు ఈ ఐదు భాషల్లో కూడా అఖండ విజయం సాధించి శతదినోత్సవాలూ, రజతోత్సవాలూ జరుపుకున్న అసాధారణ కీర్తిని గడించింది. దేశం మొత్తం మీద ఇలా వివిధ భాషల్లో డబ్‌ అయ్యి ఘన విజయం సాధించిన చిత్రాలు ఒకటో రెండో మాత్రమే ఉంటాయి. ఈ చిత్రాన్ని కన్నడంలో అదే పేరుతో అనువదించారు. తెలుగులో ‘కొప్పునిండా వువ్వులేమో’ పాటను పిఠాపురం, స్వర్ణలత పాడితే, కన్నడంలో మాధవపెద్ది సత్యం, బి. వసంత పాడారు. పసుమర్తి కృష్ణమూర్తి, జెమినీ చంద్ర అభినయించారు. ‘వాగ్దానం’ చిత్రంతో గాయనిగా పరిచయమైన బి.వసంతకు ఇది రెండో అవకాశం. కన్నడంలో సరోజాదేవి పాత్రకు చాలామంది చేత డబ్బింగ్‌ చెప్పించారు. కానీ ‘హాయ్‌ హలా…’ అన్న మాట కన్నడంలో ఎంత ప్రయత్నించినా కె.వి.రెడ్డికి నచ్చేవిధంగా రావడంలేదు. చివరకు ఆయనే దగ్గరుండి బి.సరోజాదేవితో డబ్బింగ్‌ చెప్పించారు.

తెరపై …..
———-
ప్రతాప్‌ – ఎన్‌.టి.రామారావు
రెండుచింతలు – రేలంగి
చంద్రవంశ మహారాజు – ముక్కామల
త్రిశోకుడు – రాజనాల
జగజ్జిత్తు – లంక సత్యం
బాదరాయన ప్రగ్గడ – సి.యస్‌.ఆర్‌.
పాత మంత్రి – వంగర
దేవేంద్రుడు – మిక్కిలినేని
వరుణదేవుడు – ఎ.వి.సుబ్బారావు
(జూనియర్‌)
ఆటకోట దెయ్యాలు – నల్ల రామమూర్తి
జయంతి – బి.సరోజాదేవి
నాగకుమారి – ఎల్‌. విజయలక్ష్మి
ఏకాశి – గిరిజ
వరుణకుమారి – కమలకుమారి
మహారాణి – ఋష్యేంద్రకుమారి
అగ్నికుమారి – బాల
పి. కన్నాంబ (గెస్ట్‌ ఆర్టిస్ట్‌), జగ్గారావు, విశ్వనాథరావు, సీతారామయ్య, కోటేశ్వరరావు, వెంకయ్య, బొడ్డపాటి, విశ్వనాధం, ఎ.ఎల్‌.నారాయణ, జెమిని చంద్ర.

తెర వెనుక …..
——————
నిర్మాణ సంస్ధ : విజయా ప్రొడక్షన్స్‌
కథ-మాటలు-పాటలు: పింగళి నాగేంద్రరావు
సినిమా అనుకరణ : కె.వి.రెడ్డి
డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ :మార్కస్‌ బార్‌ట్లే
డైరెక్టర్‌ ఆఫ్‌ ఆడియోగ్రఫీ :ఎ.కృష్ణన్‌
సౌండ్‌ ఇంజనీర్‌ : వి.శివరామ్‌
ప్రాసెసింగ్‌ : ఎన్‌.సి.సేన్‌గుప్తా
స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ : హర్‌బన్స్‌ సింగ్‌
పబ్లిసిటీ : కె.నాగేశ్వరరావు
కళ : గోఖలే, కళాధర్‌
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
నృత్యం : పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్‌ : కల్యాణ సుందరం
నేపథ్యగానం : ఘంటసాల, లీల, సుశీల,
మాధవపెద్ది, స్వర్ణలత, సరోజిని, బి.రాజరత్నం
నర్తకులు : జెమిని చంద్ర, పసుమర్తి
మేకప్‌ : హరిపాద చంద్ర
ఎం.పీతాంబరం,
టి.వి.భక్తవత్సలం
నిర్మాణ సహాయకులు : ఎం.ఎస్‌.చలపతిరావు
డి.జగన్నాథ్‌
సహాయ దర్శకుడు : సి.నాగేశ్వరరావు
అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ : కె.బాబురావు
కెమెరా అసిస్టెంట్స్‌ : టి.ఆర్‌.రాజరత్నం
ఐ.జి.పద్మనాభం
నిర్మాణం : వాహినీ స్టూడియోస్‌
ప్రాసెసింగ్‌ : విజయా లాబొరేటరీ
నిర్మాత-దర్శకుడు : కె.వి.రెడ్డి
———-////————————-

విడుదల : 9-8-1961
నిర్మాణ వ్యయం : సుమారు 6 లక్షల రూపాయలు
నిర్మాణ సమయం : సుమారు 60 రోజులు
నిర్మాణ ప్రాంతాలు : మద్రాసులోని విజయ – వాహినీ స్టూడియో, గోల్డెన్‌ స్టూడియో

పాటలు :
————-
1. జయజయజయ జగదేక ప్రతాపా – ఎన్టీఆర్‌ తదితరులు (గానం : లీల, బృందం)
2. వంశవర్ధనుసుతు (పద్యం) – ఋష్యేంద్రమణి – (గానం : లీల)
3. జలకాలాటలలో – బి. సరోజాదేవి, ఎల్‌. విజయలక్ష్మి, కమలకుమారి, బాల, ఎన్టీఆర్‌ (గానం : పి.లీల, పి.సుశీల, సరోజిని, రాజరత్నం)
4. ఓ దివ్యరమణులారా-ఎన్టీఆర్‌, బి.సరోజాదేవి, ఎల్‌.విజయలక్ష్మి, కమలకుమారి, బాల (గానం : ఘంటసాల)
5. నను దయగనవా – ఋష్యేంద్రమణి (గానం లీల)
6. వరించి వచ్చిన మానవ వీరుడు – బి. సరోజాదేవి, ఎల్‌. విజయలక్ష్మి, కమల కుమారి, బాల (గానం : పి. లీల, పి. సుశీల బృందం)
7. కొప్పునిండా పూవులేమో – పసుమర్తి కృష్ణమూర్తి, జెమినీ చంద్ర (గానం : మాధవపెద్ది, స్వర్ణలత)
8. ఐనదేమో ఐనదీ ప్రియ – ఎన్టీఆర్‌, బి. సరోజాదేవి (గానం : ఘంటసాల, సుశీల)
9. ఆశా ఏ కాశా నీ నీడను – రేలంగి, గిరిజ, రాజనాల, సి.ఎస్‌.ఆర్‌. (గానం : ఘంటసాల, స్వర్ణలత)
10. మధురమధురముగా – ఎన్టీఆర్‌, బి.సరోజా దేవి, ఎల్‌.విజయలక్ష్మి (గానం : ఘంటసాల, సుశీల)
11. ఆదిలక్ష్మి వంటి అత్తగారివమ్మ – బి. సరోజాదేవి, ఎల్‌. విజయలక్ష్మి, కమలకుమారి, బాల, ఋష్యేంద్రమణి (గానం లీల, సుశీల)
12. రారా కనరారా – ఎన్టీఆర్‌, బి. సరోజాదేవి, కమలకుమారి, బాల (గానం : ఘంటసాల)
13. శివశంకరీ శివానందలహరి – ఎన్టీఆర్‌ (గానం : ఘంటసాల)
14. ప్రాణసమానలై వరలు – ఎన్టీఆర్‌ (గానం : ఘంటసాల)
——————————————

If you wish to contribute, mail us at admin@chaibisket.com

comments

Tags: , , , , , , ,