This Experience Of A Girl Will Tell You How A Man Can Help Others Without Their Knowledge

Updated on
This Experience Of A Girl Will Tell You How A Man Can Help Others Without Their Knowledge

Contributed By Telugu Ammayi

మొన్న ఈ మధ్య ట్విట్టర్లో ఒకరి టైంలైన్లో రకరకాల ప్రశ్నల మీద ఒక కూత చూసాను. అలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా గమనించి చూడండి, చాలా చిత్రంగా అనిపిస్తాయి. టైంపాస్ కొరకు కాకుండా, ఎవరో సైకాలజీ ప్రొఫెసర్ మనిషి మనస్తత్వం తెలుసుకోవడానికి వాటిని ఒక చోట సమకూర్చినట్టు అనిపిస్తుంది. ఆలా ఆ ప్రశ్నలు చదువుతుండగా, అందులో ఆరో ప్రశ్న దగ్గర ఆగిపోయాను. "ఒక అజ్ఞాత వ్యక్తి దగ్గర మీరు ఎపుడైనా సాయం పొందారా?" అని ఉంది.

సాధారణంగా ఇలాంటి విషయాలు గుర్తు రావటానికి మనం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాము. అయిన వాళ్ళు కాక మనకి ఇంకెవరైనా సాయం చేశారా అని. నాకు ఆ ఆలోచనలు రాక ముందే మనసు వేగంగా పనిచేసింది. మనిషి ఏది గుర్తు పెట్టుకోవాలో అది గుర్తు ఉంచుకోలేకపోవచ్చు, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం వద్దనుకున్నా సరే సముద్ర గర్భం నుంచి తోడినట్టు అంతులేకుండా ఆలా వస్తూనే ఉంటాయి.

ఉద్యోగం నుండి కాలేజ్ రోజులు, అక్కడ నుండి స్కూల్ రోజులు, నాలుగో క్లాసుకి ఎక్కి వెళ్లాల్సిన ఇరవై మూడు మెట్లు, నా బెంచ్, దాని పక్కన కిటికీ... ఒక్కసారిగా లైఫ్ వెనక్కి వెళ్ళిపోయింది.

స్కూల్ జీవితంలో ఆనందం, థ్రిల్ రకరకాలుగా ఉంటుంది. అందులో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే స్కూల్ పిక్నిక్ అంటే మరీను. ఆ థ్రిల్ ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం అని కొందరికి, బోరింగ్ స్కూల్ యూనిఫామ్ కాకుండా సివిల్ డ్రెస్ వేసుకోవచ్చని కొందరకి, బస్సులో కిటికీ పక్కన కూర్చొని, అందులో నుండి వచ్చే గాలికి ఎగిరే జుట్టు సరి చేసుకోవడంలో ఉండే హీరోయిజం ఫీల్ కోసం కొందరికి ...ఇలా అనమాట. నాకు మాత్రం స్కూల్ సరిహద్దుల దాటాక బయట ప్రపంచం ఎలా ఉంటాదో చూడాలని ఉత్సాహం.

అప్పటికే మూడు రోజుల్నుండి పిక్నిక్ వివరాలు రేపు చెప్తా రేపు చెప్తా అని మా క్లాస్ టీచర్ తెగ వాయిదాలు వేయడం జరిగింది. చివరకి ఒక బుధవారం నాడు ఫస్ట్ క్లాస్ ఆవిడిదే అవటంతో, అసెంబ్లీ అయ్యాక క్లాస్కి వచ్చారు. అందరం లేచి నిలబడి విష్ చేసాము. "సిట్ డౌన్. అందరు బుద్ధిగా పాఠం వింటే, చివరి పది నిమిషాలు మనం వెళ్లే పిక్నిక్ గురించి చెప్తాను" అన్నరావిడ. ఆ అరగంట సేపు పాఠం ఎలా విన్నామో మాకే తెలీదు. బాగా క్రేవింగ్ వచ్చి ఐస్క్రీమ్ తినాలి అని రాత్రి తొమ్మిది గంటలకు రోడ్ మీద బండి దగ్గరకి వెళ్తే, అంత రాత్రిపూట ఏంటిరా బాబూ ఈ జాబ్ అని అతగాడు ఏ ఇంటరెస్ట్ లేనట్టు మెల్లగా మూత వెనక్కి జరిపి, అతి మెల్లగా ఐస్క్రీమ్ బయటకు తీసేఅప్పుడు వచ్చే అసహనం ఎలా ఉంటుందో అలా.

మొత్తానికి టీచర్ క్లాస్ అయ్యింది. చివరి పది నిమిషాలు పిక్నిక్ వివరాలు చెప్పారు. మా ఊర్లో ఏదో పార్కుకి తీసుకెళ్తారట. "అందరు ఉదయం ఎనిమిది గంటలకు స్కూల్లో ఉండాలి. సివిల్ డ్రెస్ వేసుకోవచ్చు. స్నాక్స్ అవి తెచ్చుకోండి. సాయంత్రం నాలుగు గంటలకు మళ్ళీ స్కూల్లోనే దింపేస్తాం. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళచ్చు" అని అన్నారు.

హడావిడిగా ఎవరు ఏం తెస్తారో ప్లానింగ్ చేస్కోని ఇళ్ళకి వెళ్ళిపోయాము. మరుసటి రోజు పొద్దునే లేచి రెడీ అయిపోయి ఏడున్నర్ర కల్లా స్కూల్లో డ్రాప్ చేయమని నాన్నని విసికించేసా. ఆయనకీ కాఫీ తాగే టైం కూడా ఇవ్వలేదు. ఒకరిద్దరు తప్ప అంతా టీచర్ చెప్పిన టైంకే వచ్చేసారు. మిగతా ఇద్దరు రాగానే అందర్నీ బస్సు ఎక్కించి, పార్కుకి తీసుకెళ్లారు. రోజంతా ఆడిందే ఆట, పాడిందే పాట. పుస్తకాలు, క్లాసులు లేవు అనే ఆనందం ఒక వైపు, వేరే స్కూల్ పిల్లలు వస్తే వాళ్ళతో కబుర్లు ఒక వైపు...రోజు అనుకున్నదానికంటే ఫాస్ట్ గా అయిపోయింది.

చెప్పినట్టే నాలుగు గంటలకి మమ్మల్ని స్కూల్లో దింపేశారు. ఫ్రెండ్సకి బై చెప్పేసి, మెయిన్ రోడ్డు కాకుండా స్కూల్ వెనక గేట్ నుండి అయితే అడ్డదారి, త్వరగా వెళ్లిపోవచ్చని అటువైపుగా ఇంటికి బయల్దేరాను. రోజూ వెళ్లే దారే కదా అని ధైర్యంగా ఉన్నాను. మా స్కూల్ కాంపౌండ్ దాటే వరకు రోడ్ద కి అవతల వైపు అన్నీ ఇళ్లు. కాంపౌండ్ గోడ చివర్లో ఒక మలుపు వస్తుంది. అది దాటితే ఒక వంద మీటర్లు చిన్న ముళ్ళ చెట్లు మధ్యలోనుండి ఒక సన్నటి దారి. అది దాటంగానే మా కాలోనికి కలిసే మెయిన్ రోడ్. సరిగ్గా ఆ మలుపు దగ్గర రోడ్డుకి అటు వైపు ఒక వాటర్ద్ద టాంకర్ ఆగి వుంది. దాని పక్కనుండి ఎదురుగా ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. రోడ్డు అంతా ఖాళీగా ఉంది. అర సెకండ్లో ఇద్దరు రోడ్డు దాటి నా వైపు వచ్చారు. ఒకతను మొహానికి కర్చీఫ్ కట్టుకున్నాడు, చేతిలో చిన్న కత్తి. రెండో మనిషి మొహానికి ఏమీ లేదు, అతన్ని స్పష్టంగా చూడగలిగాను. మాస్క్ ఉన్నతను కత్తి చూపించి "అరిస్తే చంపేస్తాము" అన్నాడు. ఇదంతా అర నిమిషంలో జరిగిపోయినా, వెన్నుపూస నుండి వచ్చిన వణుకు కాళ్ళు చేతులు వరకు పాకింది. వంద సూర్యనమస్కారాలు చేస్తే వచ్చే వణుకులా ఉంది. కాకపోతే ఇక్కడ భయంతో వచ్చింది ఆ వణుకు. గట్టిగా ఏడ్చేసాను.

కత్తి చూపించినతను "ఏడవకు, అమ్మ వస్తుంది లే.." అన్నాడు అటు ఇటు చూస్తూ, ఎవరైనా వస్తారేమో అనే ఖంగారుతో. ఆ నిమిషం వాటర్ టాంకర్లో నుంచి కారి పడే ఒక్కో బొట్టు ఒక్కో యుగంలా అనిపించింది. ఇంతలో "ఆక్కూరలమ్మా" అని ఒక కూరలు అమ్ముకునే ఆమె గొంతు వినపడింది. నెత్తిన బుట్టతో ఎదురుగా వస్తోంది. ఆవిడ్ని చూడగానే ధైర్యం వచ్చి, ఒక్క తోపుతో అతన్ని కుడి చేత్తో విదిలించుకుని ఏడుస్తూ ఆమె దిక్కు పరిగెత్తాను. ఆమె అది గమనించలేదు. ఆమెని దాటి పరిగెత్తాను. నా కాళ్ళు, ఊపిరి తిత్తులు సహకరించినంతవరకు మెయిన్ రోడ్డు వరకు పరిగెత్తాను. ఆ తర్వాత అలుపు వచ్చి పెద్ద అడుగులు వేస్తూ, వెన్నకి తిరిగి చూస్తూ ఇంటికి చేరాను.

ఇంటికి వెళ్లి అమ్మకి అంతా చెప్పను. ఆవిడ ఖంగారు పది టీచర్ కి ఫోన్ చేసింది. తర్వాత రోజు స్కూలుకి వచ్చి చెప్పింది. బ్యాక్ గేట్ క్లోజ్ చేయించేసారు ప్రిన్సిపాల్ గారు. ముందు ఇలా జారకూడదని అక్కడ సెక్యూరిటీ పెట్టారు.

ఆ రోజు ఆ ఆక్కూరలు అమ్ముకునే ఆమె రాకపోతే పరిస్థితి ఎలా ఉండేది అనేది తెలీదు. ఒక అజ్ఞాత వ్యక్తి నాకు సాయం చేసారు అంటే అది ఆవిడే. సాయం చేసిన విషయం కూడా ఆవిడకి తెలిసుండదు. దేవుడు అన్ని చోట్ల ఉండలేక ఇలా సమయానికి సాయం పంపిస్తారేమో.

ఈ సంఘటన నాకు రెండు విషయాలు నేర్పింది: ఒకటి - అడ్డదారి ప్రయాణాలు కలిసి రావని రెండు - చెడు మర్చిపోయి, మంచి దాచుకోమని. ఇప్పుడు ఆ ఇద్దరి మొహాలు నాకు గుర్తు లేవు. ఖంగారులో పరిగెత్తే అప్పుడు ఆ కూరగాయలు ఆమె మొహం చూడలేదు. కేవలం ఆమె కట్టుకున్న ఆకుపచ్చ రంగు చీర మాత్రమే గుర్తుంది.