Contributed By Puneeth Umedha
పుట్టినరోజుకి కొత్త బట్టలు తీసుకున్నప్పుడు, బట్టల మీదున్న విలువని కాకుండ నా మొహంలో కనబడిన సంతోషాన్ని చూసి బట్టలు కొన్న నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
చిన్నపుడు నువ్వు కాల్చి పడేసిన సిగరెట్ పీకలు నేను కాలుస్తున్నది చూసి నన్ను కొట్టకుండ, తిట్టకుండ ఆ క్షణం నుంచి సిగరెట్ మానేసిన నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
నువ్వు సంపాదించిన ప్రతి రూపాయిని నీ కోసం దాచుకోకుండా నాకోసం ఖర్చు పెట్టిన నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
ఏ మాత్రం నీకు సమయం దొరికిన నీ స్నేహితులతో హాయిగా గడపకుండా నా తోనే, నా కోసం సమయం గడిపే నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
నేను ఏది అడిగినా , నాకొచ్చే జీతం లో కొనలేను అనకుండా, ఓవర్ టైంలు పార్ట్ టైంలు చేసి కొనిపెట్టిన నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
నీకంటూ ఓ పేరు ఉన్న నా పేరు మీద నా కోసం నువ్వు దాచిన డబ్బులకు నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను. నాకు స్కూల్ లో ఏ చిన్న అవార్డు వొచ్చిన నీ కళ్ళలో ఆనంద భాష్పాలతో, హల్ మొత్తం వినపడేలా చప్పట్లు కొట్టిన నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
నేనేదైనా తప్పు చేసినప్పుడు నీ మనసులో తిడుతున్న బాధని దాచుకొని, కళ్ళల్లో కోపాన్ని నటించే నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను. నాకు ఆరోగ్యం బాగులేనప్పుడు నిద్ర, ఆహారాలు మానేసి నన్ను కాపలా కాచిన నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.
నాకు 25 ఏళ్ళొచ్చినా నన్ను పని చేసి సంపాదించు అని ఒత్తిడి పెట్టకుండ నా కళను, కలను పోషిస్తూ, నన్ను ప్రేమిస్తూ, ఓదారుస్తూ, భరిస్తూ ఉన్న నాన్న నీకెలా నా ప్రేమను తెలుపను.