A Letter to CB from Naga Chetan Reddy garu
'ఉత్తరం ' ఆధునికత వల్ల కనుమరుగు అవుతున్న నిన్నటి తీపి గురుతు. ఆ తీపి గురుతుని మళ్ళీ మనందరికీ గురుతుచేయాలని అనుకున్నారు లండన్ లో నివసించే Naga Chetan Reddy గారు. అనుకున్నదే తడువుగా ఉత్తరం మీద తనకున్న ప్రేమని ఒక ఉత్తరంలో రాసి మా CHAIBISKET ఆఫీస్ కి పంపారు. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే " ఏంటీ? ఈ రోజుల్లో Handwwritten Letter ఆ? అది కూడా లండన్ నుంచి!" అని మేము అందరం కూడా షాక్ అయిపోయాము. ఆ ఉత్తరం చదివాకా మా ముఖంపై చిన్ని చిరునవ్వు.."మనం కూడా నచ్చిన వాళ్ళకి ఒక ఉత్తరం రాసి పంపుదాం.." అనే ఆలోచన వచ్చాయి. ఈ లేఖ చదివాక అదే ఆలోచన మీకు వస్తుందని ఆశిస్తున్నాం. P.S:Scanned Copy చదవటానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కాబట్టి, Type చెయ్యటం జరిగింది. Scanned copy కింద include చేసాము.
ఉత్తరం: సోదర సమానులైన రఘురామ్ గారికి, శ్రీకాంత్ గారికి, అనురాగ్ గారికి, వినమ్రుడనై చేతన్ వ్రాయునది. ' ఉత్తరాలు', ఈ కాలంలో నిఘంటువు లో కూడా దొరకని పదమేమో, అలంటి ఉత్తరాన్ని నెమరువేసుకుంటూ ఒక ఆర్టికల్ రాద్ధామనే ఆలోచన వచ్చింది. అలాంటప్పుడు ఆర్టికల్ కూడా ఉత్తరం రూపంలో పంపటమే సబబు అనుకున్నా.అందుకే ఈ ఉత్తరం. 'ఈ కాలం లో కూడా ఉత్తరం ఏంటి వెర్రి కాకపోతేనూ ' అని దీనిని మీరు కూసింత ఆశ్చర్యం తో చదువుతుంటే , ఆ ఆశ్చర్యమే దీనిని రాయడానికి నా స్ఫూర్తి. ఇక విషయం లోకి వెళ్తే.
వారం రోజుల క్రితం
ఎప్పటి లాగానే ఉదయం 5:౦౦ గంటలకి మోగిన అలారం. వేసవి కాలం, లండన్ లో సూర్యుడు మన పాల వాడికన్నా ముందే వచ్చేసాడు, ఇంట్లో భార్య పోటు పడలేకేమో మరి పాపం. బెడ్రూమ్ కిటికీ లో నుంచి బయటకి చూస్తే సూర్య కాంతి వెలుగులో అప్పుడే పుట్టిన పసిపిల్లవాడి అంత స్వచ్ఛంగా చిగురించిన పచ్చటి చెట్లు. ఆ సౌందర్యాన్ని చూసి స్మరించుకునే అంత తీరిక, సమయం రెండూ లేకపోయె. ఆఫీసుకు వెళ్లాలని గుర్తొచ్చి ఆ సుందర దృశ్యం నుంచి నన్ను నేను బలవంతంగా తయారవడానికి లాక్కెళ్ళాను. రోజూ లాగానే హడావిడిగా రెడీ అయ్యి, కూసింత పాలు, రెండు బ్రెడ్ ముక్కలు నోట్లో వేసుకుని ఉ.6:50 బస్సు అందుకోడానికి పరుగులు తీసాను. అదృష్టం కొద్దీ రెండు నిమిషాల ముందే అక్కడ ఉండటంతో క్యూలో మొదటి స్థానం దక్కింది. ( ఇక్కడ బస్సులు, రైళ్లు ఎక్కడానికి పలోమని గుంపులు గుంపులుగా ఎగబడటానికి వీల్లేదు, అంతా క్యూలోనే నిలబడాలి). మొదట ఉండటం వల్ల ఒక కిటికీ సీటు దొరికింది. రోజు త్వరగా నిద్రలేయడం వల్ల బస్సు ఎక్కగానే నిద్రపట్టేసేది, కానీ ఆ రోజు సూర్యరశ్మి ఎక్కువ ఉండటం వల్ల, రెప్ప మూస్తున్నాననే గాని, నిద్రలోకి జారుకో లేక పోతున్నా. 'టింగ్' అని ఫోన్ మోగింది, చుస్తే వాట్సాప్ మెసేజ్. "చేతన్ ఫోన్ చెయ్యి" అని అమ్మ దగ్గరినుంచి మెసేజ్ చూడటమే ఆలస్యం, వెంటనే ఫోన్ చేసాను. యోగక్షేమాలు, దినచర్య కార్యాలు గురించి చర్చించుకున్న తరువాత మాటల్లో "అప్పుడే నువ్వెళ్ళి మూడు నెలలు అయ్యింది. మొన్న ఎక్కినట్లుంది ఫ్లైటు" అని అమ్మ అనడంతో , కదా అప్పుడే మూడు నెలలు అయ్యిందా అనుకున్నా. ఆ తరువాత ఏవో కొన్ని విషయాలు మాట్లాడుకున్నా... అప్పుడే మూడు నెలలు అయ్యిందా అనే మాట మాత్రం చెవుల్లో అలాగే మెదులుతూ ఉంది. కాలం ఏంటి ఇంట వేగంగ పరిగెడుతుంది?, ఎందుకింత వేగం? అని ఎన్నో ప్రశ్నలు.
ఒక డెబ్భై- ఎనభై సంవత్సరాలు వెనక్కి వెళ్తే:
'ఫోన్' బ్రిటిష్ వారు పరిపాలన సౌలభ్యం కోసం ఉపయోగించే వారే తప్ప ఇంకా సామాన్యులకి అందుబాటులో లేని రోజులు. వర్షా కాలంలో వర్షాలు, ఎండా కాలం లో ఎండలు పడుతూ వ్యవసాయానికి ఏ లోటు లేకుండా దేశం సుభిక్షంగా ఉన్న రోజులు. అప్పుడప్పుడే చదువు మీద అవగాహనతో, చదువుపై మక్కువ పెరగడంతో..మద్రాసు, ఢిల్లీ లాంటి నగరాలకు ఇంట్లో అందరిని విడిచిపెట్టి పయనమౌతున్న యువకులు. కొడుకు దూరంగా వెళ్తున్నాడనే బాధతో తల్లికి వచ్చిన కన్నీళ్ల కన్నా, వేగంగా ప్లాటుఫార్మ్ మీదకి దూసుకు వచ్చిన రైలు. " ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు. నేనేమన్నా వేరే దేశానికీ వెళ్తున్నానా? పట్టణానికే కదా వెళ్ళేది. వెళ్ళగానే కచ్చితంగా ఉత్తరం రాస్తాను. నాన్న! అమ్మ జాగ్రత్త" అని ట్ర0కుపెట్టె రైలులో పెట్టుకున్న కొడుకు. "ఏమో నాయన. చిన్నప్పటినుండి నిన్ను విడిచి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు అంత దూరం అది కూడా ఒక్కడివే వెళ్లి ఎన్ని ఇబ్బందులు పడతావో అని ఒకటే బెంగగా ఉంది. చేరిన వెంటనే ఉత్తరాలు రాయి. నెలకు ఒక ఉత్తరం రాయడం అన్నా మరిచిపోకు.నీ ఉత్తరం వచ్చేవరకు ఎదురు చూస్తుంటాను" అని వీడ్కోలు చెప్తూ అమ్మ. ఎన్ని రోజులకి తిరిగివస్తాడో తెలియని ఆ తల్లికి. కొడుకు యోగక్షేమాలు తెలుసుకోవటానికి ఉన్న ఏకైక ఆధారం ఆ ఉత్తరం మాత్రమే. ఎప్పుడో నెలకు ఒక్కరోజు వచ్చే ఉత్తరం కోసం నెలంతా ఎదురుచూపులు. ఉత్తరం చదవగానే, ఆ చదివిన ఉత్తరాన్ని గుండెలకు హద్దుకుని తన కొడుకునే హద్దుకున్న భావనతో, మల్లి ఊర్లో విషయాలతో..ఆనందాన్ని, బాధని పంచుకుంటూ ఇంకో తిరుగు ఉత్తరం. ఇలా నెలనెలా ఉత్తరం కోసం ఎదురు చూడటం. ఉత్తరం రాగానే తిరిగి ఉత్తరం రాయడం. కాలం అంతా ఆ ఎదురుచూపులోనే అయిపోతుంది. అలాంటి ఎదురు చూపులో ఒక రోజు. "గౌరవనీయులైన తల్లిదండ్రులకు, నేను క్షేమంగానే ఉన్నాను, మీరు కూడా క్షేమమే అని భావిస్తున్నాను. ఈ నెలలో నా పరీక్షలు పూర్తవుతున్నాయి. రేడు నెలలు సెలవు ఉండటంతో ఇంటికి వస్తున్నా......." అనే ఉత్తరం చదువుతున్న తల్లి ఆనందం భావోద్వేగాలను అంచనా వేయగలమా? ఇక పోతే తండ్రి, కొడుకు దూరంగా వెళ్తున్నందుకు ఒక పక్క బాధగా ఉన్నా..ప్రయోజకవంతుడు అవ్వబోతున్నాడనే గర్వం తో ఆ బాధను దిగమింగుతూ పగలంతా పొలం పనులతో, సాయంత్ర కొడుకు కోసం బాధపడుతున్న తల్లిని ఓదారుస్తూ కాలం గడిపేస్తాడు. ఆ ఓదార్చటం లో కలిపించే ప్రేమ ఆప్యాయతలే కదా నిజమైన భార్య భర్తలకు నిర్వచనం. ప్రియుడి లేఖ కోసం ఎదురు చూసే ప్రేయసి, యుద్ధంలో ఉన్న భర్త నుంచి ఎప్పుడెప్పుడు ఉత్తరం వస్తుందా అని వేచి చూసే భార్య, విదేశాలలో ఉన్న కొడుకు టెలిగ్రామ్ కోసం తండ్రి, ఇలా దూరంగా ఉన్న మనుషుల కోసం దగ్గరగా ఉన్న మనుషులను కలుపుకుంటూ..ఎడ్ల బండి వేగంతో కదులుతున్న కాలంలో, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, మనిషికి మనిషే కాలక్షేపంగా ఉండేవారట ఆ రోజుల్లో.
ముప్పై సంవత్సరాల క్రితం:
ఇంటింటికి ఫోను లేకపోయినా, ప్రతి 20-30 ఇళ్లకు ఒక ఫోన్ ఉన్నా రోజులు. ఉత్తరాలు రాస్తున్నప్పటికీ రెండు వారాలకు ఒకసారైనా ఫోన్లో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎడ్లబండి నుంచి రిక్షా వేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనే ఇంటింటికి టి.వీ లు రావటం కూడా మొదలయ్యాయి. ఎదురు చుపుల బాధను మర్చిపోవటం కోసం చిన్నగా మనిషితో మాట్లాడటం మానేసి టీవీలు చూడటం మొదలుపెట్టాం. అప్పట్లో దూరదర్శన్లో రోజుకి రెండు సినిమాలు, అంటే ఆరు గంటలు. ఆ ఆరు గంటలు సినిమా చూస్తూ సమయం ఎలా గడిచిపోయింది ఎవ్వరికీ తెలియదు. టెక్నాలజీ చిన్నగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మనిషికీ మనిషికీ మధ్య నెమరువేసుకోడానికి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి ఆ కాలంలో కూడా.
ఇక పోతే ఇప్పుడు:
రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న కాలం. యెంత దూరంలో ఉన్నా నిమిషాలలో ప్రయాణం. అనుకోవడమే ఆలస్యం మాట్లాడటానికి చేరువలో సెల్ ఫోను. అంతర్జాలం పుణ్యమా అని ఎదురు చూపులతో పనిలేకుండా వెంటనే మాట్లాడుకోటానికి సులువుగా వీడియో కాల్స్. Facebook, instagram, Twitter,YouTube అని మనల్ని నిత్యం బిజీ బిజీగా ఉంచే యంత్రాలు. డబ్బు కోసం వేటలో మన చుట్టూ ఎవరున్నారో కూడా గమనించలేనంత వేగంగా వెళ్ళిపోతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరుకు ఉరుకుల పరుగుల జీవితం. సాయంత్రం ఇంటికి రాగానే, ఆ ఉన్నా కొంత సమయంలో కూడా కాలక్షేపం కోసం ఎన్నో పోగు చేసుకున్నాం. అసలు ఈ వేగంలో ఒక్క నిమిషం ఆగి 'WHO AM I ?" అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే..మనలో ఎంతోమంది ఆలోచించకుండా, తడబడకుండా సమాదానం చెప్పగలం? మన పనులు తొందరగా పూర్తవడంకోసం రోజు రోజుకి అభివృద్ధి వేగాన్ని పెంచి మనం సాధించేదేంటంటే...ఎండాకాలం లో పిడుగులతో వర్షాలు, వర్షాకాలం లో ఎండలతో అభివృద్ధి ముసుగులో ప్రకృతినే తలకిందులు చేసాం. అడిగిన వెంటనే ఇస్తే వస్స్తువు విలువ తెలీదంట. ఇప్పుడున్న పరిస్థితులలో మనకి అన్ని అనుకున్న వెంటనే రావటంతో కాలం విలువ తెలియట్లేదు. కాలం వేగంగా వెళ్తుందంటే మన మరణం కూడా వేగంగా సమీపిస్తుందని అర్థం. ఈ పరిగెడుతున్న కాలంలో మనల్ని మనం గాయించుకుంటే, మనం ఎం కోల్పోతున్నామో గుర్తొస్తుంది.
___________________________x________________________
అదండీ సంగతి ఈ ఆర్టికల్ రాద్దామని ఆలోచన రాగానే, మీతో పాటు మా ఇంటికి కూడా ఒక ఉత్తరం పంపించాను. FITNESS CHALLENGE, ICE-BUCKET CHALLENGE లాగే మనం కూడా ఒక ఉత్తరం ఛాలెంజ్ తీసుకొని, మీకు నచ్చినవారికి ఒక ఉత్తరం రాయండి. "Trust me, the day they receive the letter and call you back with excitement, that will be one of the priceless moment in your life". ఈ ఉతత్రంకి తిరుగు ఉత్తరం రాసే ప్రయత్నం చెయ్యకండి. అన్ని రోజులు ఎదురు చూసే ఓపిక నాకు లేదు. ఉత్తరం చదవగానే నా Whatsapp number కి 'Hi' అని మెసేజ్ చెయ్యండి చాలు That would be a priceless moment. చివరిగా 'పరిగెడుతున్న కాలం, గమనిస్తున్నావా నేస్తం?' ఇట్లు చేతన్