బీ.టెక్ అయిపోయింది. ఏమి చేయాలో తెలీని అయోమయం లో ఉన్న నాకు అనుకోకుండా తను పరిచయం అయ్యింది. మొదట్లో తనని చూస్తే నవ్వొచ్చేది, కాని మెల్లగా తనని అర్థం చేసుకోవడం మొదలెట్టాకా.... తన మీద ఇష్టం ఏర్పడింది. ఒక్క రోజు కూడ తనని విడిచి ఉండలేక పోయేవాడ్ని. తరుచు ఏవో ఊహలు,ఊసులు. రోజుకో కొత్త విషయం నాలో ఎదో తెలీని నూతన ఉత్సాహాన్ని నింపేది. తన స్పూర్థి తో నాలోని నా బలాన్ని తెలుసుకోగలిగాను. నన్ను నేను వెతుక్కోగలిగాను. తన వల్లే ఓ మంచి జాబ్ లో సెటిల్ అయ్యాను. క్రమంగా మా ఇద్దరి మధ్య ఎవరూ విడదీయలేని ప్రేమ మొదలయ్యింది.
కాని, ఇంతలో ఇంట్లో వాళ్ళు పెళ్ళి చూపులు ఫిక్స్ చేసి రేపు అనగా ఈరోజు నాకు ఆ విషయం చెప్పారు. అసలు విషయం చెప్పాలంటే ఎందుకో తెలీని భయం తో, నాకిప్పుడే పెళ్ళి వద్దు అని చెప్పాను, కాని అమ్మాయి మాకు బాగా నచ్చింది నీకు నచ్చుతుంది అని బలవంతంగా మా అమ్మ,నాన్న తీసుకెళ్ళారు.
పెళ్ళికూతురు వాళ్ళింటి కి చేరుకున్నాం, అందరికి కాఫి ఇచ్చి అమ్మాయి నా ఎదురుగా కుర్చుంది. అమ్మాయి లో ఏదో తెలీని కళ ఉంది. సహజంగా నవ్వుతూ ఉన్నట్టు ఉండే తన మోము నిజంగా నవ్వితే ఇంకా బాగుంటుందేమో అనిపించింది. అమ్మాయి పేరు " స్వప్న" అని అమ్మ చెవిలో చెప్తోంది... ఇంతలో " ఇల్లు చూపించమ్మ" అని పెళ్ళి కూతురు తండ్రి అనడం తో సరే అని తను పైకి లేచింది.నా మనస్సు లో మాట తనకి చేప్పే అవకాశం దక్కింది అన్న ఆనందం తో నేను తనని అనుసరించాను, . పై రూం బాల్కని కి వెళ్ళాకా "ఎస్క్యూజ్ మి స్వప్న గారు" అని తనని పిలిచాను.తను తిరిగి నా వైపు చూసింది.
నేను: నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఇష్టం లేదండీ. నేను ఒకర్ని ప్రేమిస్తున్నాను.
స్వప్న:థ్యాంక్ గాడ్ నాకూ ఇష్టం లేదు. నేనూ లవ్ లో ఉన్నాను... ఇఫ్ యు డొంట్ మైండ్. మీరు ఎవర్ని ప్రేమిస్తున్నారో తెలుసుకోవచ్చా?
(ఎందుకో తెలీదు తను ఎవరినో ప్రేమిస్తోంది అని తెలిసిన వెంటనే, అతని మీద నాకు తెలీని ఒక ఈర్ష్య పుట్టింది ,అయినా ఆమె అడిగిన ప్రశ్న కి సమధానంగా నా ప్రేమ విషయం తనతో పంచుకున్నాను).
నేను: నేను నా కథల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ రైటింగ్. ప్రస్తుతానికి కంటెంట్ రైటెర్ గా పని చేస్తున్నాను. కాని భవిష్యత్తు లో సినిమాలకి మంచి కథలు రాయలి. అది నా కల. అది పూర్తయ్యేంత వరుకు పెళ్ళి చేసుకోక పోతే మంచిదని అనుకుంటున్నాను..,. మీరు ఎవర్ని లవ్ చేస్తున్నారు??
స్వప్న: (చిన్నగా నవ్వుతూ) నేనా... డైరెక్షన్ ని నాకు డైరక్టర్ అవ్వాలని ఆశయం. కోర్స్ కూడ చేశాను. మంచి కథ దొరికితే షార్ట్ ఫిల్మ్ తీద్దామని అనుకుంటున్నాను. నేనెక్కడ సినిమాలా వైపు గా వెళ్ళి, పెళ్ళి చేసుకోనేమో అని భయపడి మా వాళ్ళు పెళ్ళిసంబాంధాలు చూస్తున్నారు..
(తను ప్రేమించేది వ్యక్తి ని కాదు, నా లాగే వృత్తి ని అని తెలుసుకున్న వెంటనే నాకెందుకో పట్టరాని సంతోషం వచ్చింది. అయినా బయట పడకుండా...)
నేను: ఓ... మీరు షార్ట్ ఫిల్మ్ తీస్తా అంటే నా దగ్గర చాల కథలు ఉన్నాయ్ అందులో నచ్చిన దాంతో తీద్దాం.
స్వప్న :తప్పకుండా చేద్దాం... మరి ఈ పెళ్ళి చూపుల కథ ఏం చేద్దాం??
(కథలే లోకంగా బ్రతికే నాకు, తను కూడా నా లోకం లో ఒక భాగమైతే బాగుండని అనిపించింది.ఈ సారి తన కళ్ళలో చుశాను. తనకి నేనంటే ఇష్టమనిపించింది .అందుకే ఆలస్యం చేయకుండా నా మనస్సులో మాట చెప్పాలనిపించింది).
నేను:మంచి కథ కి మంచి దర్శకత్వం తోడైతే మంచి సినిమా అవుతుంది. అలాగే ఒకరి మనస్తత్వాన్ని ఇంకొకరు అర్థం చేసుకుంటే మంచి దాంపత్యం అవుతుంది. నేను ప్రేమించే కథల్ని, గౌరవించి, అర్థం చేసుకునే మనస్తత్వం మీకు ఉంది అని నాకు అనిపించింది. ఎక్కడో నా మనస్సు కి కూడా అనిపించింది. అందుకేనేమో అమ్మ నాన్నలకి కూడ భయపడి చెప్పని నా కథల విషయం మీకు చెప్పాను. మీకు నేను నచ్చితే మనం పెళ్ళి చేసుకుందాం.
స్వప్న:(మళ్ళీ అదే అందమైన నవ్వుతో) మరి సినిమాలోలా మీరు నా వెంట పడలేదు నేను మిమ్మల్ని తిట్టలేదు, మీరు నన్ను ఇంప్రెస్ చేయలేదు కదా. మనం పెళ్ళి చేసుకుంటే మీరు ప్రేమించిన కథలు, నేను ప్రేమించిన డైరక్షన్ ఎమైపొతాయ్?
నేను: మీరు నేను మనమైతే.... మన కలయిక ఈ లోకం లోనే అందమైన, ఆనందమైన ప్రేమకథ అవుతుంది...
తను ఈసారి ఇంకొంచెం అందంగా నవ్వింది. సిగ్గు పడుతూ, తన అంగీకారాం తెలుపుతూ....మా ప్రేమ కథకి శ్రీకారంగా...