Contributed By Manohar Uttej
ఒక క్షణకాలంలో పుట్టే ప్రేమ అంతరిక్షానికే ఒక కొత్త శక్తిని జోడిస్తుంది చిన్న చిరునవ్వుతో మొదలయ్యే ప్రేమ పెను పరిమాణంలో ఒక ప్రపంచాన్నే నిర్మిస్తుంది
ఆ ప్రపంచంలో అణువు అణువునా ప్రతీ కణంలో, కొలపరిమాణంలో అన్ని దిక్కుల్లో, కోణాల్లో ప్రేమ వ్యాపించి ఉంటుంది
ప్రేమ గాలులు దూసుకొస్తుంటాయి విరహ వేదనలు గర్జిస్తాయి ప్రేమ నదులు ఉప్పొంగుతాయి తలపు తలుపులు విరిగిపడతాయి ప్రేమ తుఫానులు చెలరేగుతాయి వలపు వాయివులు చుట్టుముట్టుతాయి ఇది ఆ ప్రేమ సృష్టి...
నీ ప్రపంచంతో సంబంధం లేదు ఈ ప్రపంచానికి ఏ బంధం లేదు ఆ ప్రపంచం జీవం పోసుకుని భూగోళంలా నిలబడుతుందా? లేక... గాలీ నీరు లేని గ్రహంలా విశ్వం వెలివేసిన అంతరిక్ష శిధిలంలా లక్షలాది అగ్ని పర్వతాలు బద్దలయిన బూడిద-గోళంలా మారుతుందా?
ఆ ప్రపంచం తన ప్రయాణాన్ని ఒక ప్రమాణంతో మొదలపెడుతుంది దాని అంతం చేసిన ప్రళయాన్ని ఒక ప్రవచనంగా నీ చేతికిస్తుంది
ఆ ప్రవచనమే మరో ప్రపంచపు పిలుపుకి సిద్ధం చేస్తుంది అలా ప్రేమ నుండి ప్రేమకి మరో ప్రపంచానికి!!