Chai Bisket Short Stories - యదలో మెదిలిన కథలు (Episode 1)!

Updated on
Chai Bisket Short Stories - యదలో మెదిలిన కథలు (Episode 1)!

వసుమతి... రాజా ఛాతిపైన చేతులు కలిసేలా ఉంచి, ఆ చేతులపైన తన పెదవి కింది బాగాన్ని ఉంచి, పెద్ద కళ్ళతో రాజ వైపు చూస్తూ... వసుమతి: ఎంతసేపు అలానే చూస్తూ ఉంటావ్ ? ...రాజ నుండి సమాధానం లేదు సరి కదా, కనురెప్ప కదిలితే కనులేదో చెప్తున్నాయ్ అనుకుంటుందేమో అనే సందేహం తో రెప్ప వేయకుండా చూస్తున్నాడు వసుమతిని.... వసు: ప్రతీ రోజు ఇలానే గడిచిపోతుంది. నేనంటే ఎందుకంత మోజు ? రాజ: మోజు కాదు ప్రేమ. వసు: ఓహ్! పేరు ఏదైతే ఏమిటి లే. దేనికోసం నా దగ్గరికి వస్తున్నావ్ ? రాజ: ప్రేమ కోసం. వసు: అందరూ నా వద్దకు అందుకే వస్తారు. ఒక్కోరిది ఒక్కో రకం ప్రేమ. ఈ శరీరం పైన కదా ప్రేమైనా మరేదైనా. రాజ: కాదు. నీకు తెలిసింది ప్రేమ కాదు, ప్రేమ తెలిసిన వాళ్ళు ఇప్పటివరకు నీ దగ్గరికి వచ్చినట్టు లేరు. వసు: నాలాంటి వాళ్ళ దగ్గర ప్రేమ కోరుకోవటం నీ పిచ్చితనం. రాజ: ప్రేమ మనసుకి సంబంధించింది. శీలం మనసుది కాని శరీరానిది కాదు. నువ్వు నచ్చి ఈ పని చేయటం లేదు కదా. వసు: నిజమే, నీలాంటి వాడిని ఇంత వరకు చూడలేదు. మృగాల్లా తప్ప మనుషుల్లా ప్రవర్తించిన వారు చాలా తక్కువ. రెప్పమూయకుండా నన్ను చూడటం వలన నీకేం వస్తుంది. రాజ: ఆనందం, రోజంతా నేను ఎదురుచుసేదే ఈ క్షణాల కోసం. వసు: ఇంత సొమ్ము ఖర్చు చేసి ఈ ఆనందాన్ని కోరుకోవటం నీ అమాయకత్వం. రాజ: కాదు, అనురాగం. ఖర్చు చేయటం లేదు, అపరాధ రుసుము చెల్లిస్తున్నాను నీ సమయాన్ని వృధా చేస్తున్నందుకు. వసు: మాటలు బాగా నేర్చావు. నీ సమయం, సొమ్ము వృధా అవ్వటం తప్ప నీకేం ఉపయోగం ఉండదు. ఖర్చు చేసిన సోమ్మకు తగిన సుఖాన్ని కుడా పొందటంలేదు నువ్వు. రాజ: సుఖం వద్దు, సంతోషం కావాలి. నిన్ను ఈ మురికి కూపం నుండి తీసుకెళ్ళిపోతాను, నాతో వచ్చేయ్! వసు: నేను పుట్టిందే ఇక్కడ. రాజ: తామర కూడా మురికిలోనే పుడుతుంది. వసు: మురికిలో పుట్టే ప్రతీది తామర కాదు. రాజ: నిజమే! కానీ నువ్వు తామారవే కదా. వసు: మురికిలో తామర పెరుగుతుందని, దాన్ని అందుకోవాలనే తొందరలో నువ్వూ ఆ కూపంలోనికి వస్తున్నావు ఎందుకని ? రాజ: ఎప్పటికైనా తామర దొరుకుతుందన్న ఆశతో. వసు: దొరికితే ఏం చేస్తావ్ ? రాజ: ఇంటికి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి పూజిస్తా. వసు: తామరని పూజలో వాడతారు కాని తామరని పూజించే వెర్రివాల్లెవరుంటారు ? రాజ: నా పూజ గదిలో తామరే పూజ్యురాలు. వసు: ఆహా! మరుసటి రోజు అయ్యేప్పటికి వాడిపోతుంది, వాసన పోతుంది. అప్పుడు మరో తామరని వెతుక్కుంటావ్. ఈ మాత్రానికి ప్రేమ అనురాగం అనే పిచ్చి ప్రేలాపనలు ఎందుకు. రాజ: వాడిపోయిన తామరతో పాటు రోజు కూడా వెళ్ళిపోతుంది. నా జీవితం అనే రోజులో, పూజా గదిలాంటి నా హృదయంలో, తామర లా ఉండిపోతావా ? ...వసు కంట్లో నీటితో... వసు: నీతో రావాలని నాకూ ఉంది, కాని...రాలేను. రాజ: నీకు, మీ వాళ్ళకి ఏం కావాలో చెప్పు ఇచ్చి తీసుకెళ్తా. వసు: నా వద్దకి వచ్చేవారికి నేను కావాలి, మా వాళ్ళకి నా కోసం ఇచ్చే సొమ్ముకావలి, ఆ ఇద్దరి మధ్యలో నా గురించి ఎవడికి కావలి. ఈ విషయం మర్చిపో, సరే సమయం అయిపోతుంది నేను వెళ్తాను మరి. రాజ: కాని...నీకోసం నేను రోజూ రాగాలను. వసు: దేనికోసం ? రాజ: ప్రేమకోసం. వసు: సరే...మళ్ళీ రేపు వస్తాను. ...వసు వెళ్ళిపోయింది రాజాని చూస్తూ...