Here Is How Mokkapati Narasimha Sastri Garu, Writer Of "Barrister Parvateesam" Struggled For Selling His Book

Updated on
Here Is How Mokkapati Narasimha Sastri Garu, Writer Of "Barrister Parvateesam" Struggled For Selling His Book

"బారిష్టర్ పార్వతీశం" గ్రంథాన్ని అమ్మడానికి రచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు పడిన కష్టాలు ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి) మాటలలో..

ఒక రోజు కళాశాల నుంచి ఇంటికొచ్చేసరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు "బారిష్టర్ పార్వతీశం" నవలా రచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు.

వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను బారిష్టర్ పార్వతీశం. పదిహేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్ళో నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.. ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొనవచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయి పావలా. రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ను కలుసుకోవాలి. పని ఎంతవరకు అవుతుందో ... ?

నాకు చాలా బాధ కలిగింది. బారిష్టర్ పార్వతీశం అంటే ఒక హాస్య మహాకావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ వెళ్ళి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?

"ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అనడిగాను.

"వంద. అంటే నూట పాతిక రూపాయిలవి" "మీరెక్కడికీ వెళ్లకండి. అవి అమ్ముడయే మార్గం నేను చూస్తాను" అన్నాను. ఆ మర్నాడు ఒక తెల్ల కాగితం మీద ఒక ఆహ్వాన పత్రికను రాశాను ఇలా.

"మొక్కపాటి వారు వచ్చారు. వారి బారిష్టర్ పార్వతీశం నవల వారి సంతకంతో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయంత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి డాబా మీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది " అంటూ ఒక విద్యార్థికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులకు చూపించి, వారు చూసినట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించాను.

కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సమర్పించినవి. మొక్కపాటి వారు ఎంత సంతోషించారో.... నా చేతులు పట్టుకొని " నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి.... నీ వల్లనే " అన్నారు. క్షమించండి ఇది నా వల్లగాదు, బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల.. ఒక మంచి గ్రంథాన్ని... రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్ల.. ఇది వీరందరి రసజ్ఞత... సంస్కారమూను" అన్నాను.

ఈరోజుల్లో ఇది సాధ్యమేనా?

Here is our article on "Barrister Parvateesam". A Cute Throwback.