మన భారతదేశాన్ని కర్మ భూమి, వేద భూమిగా కీర్తిస్తారు. ఈ గడ్డ మీద లేని ఖనిజాలు, వనరులు అంటూ ఏది లేదు ఐన గాని ఇంకా దరద్రిం దేశ ధరిత్రి మీద ఉందంటే దానికి కారణాలు వ్యక్తి పూజ, కుల గజ్జి, సొమరితనం, స్వార్ధం.!! దేశం ఏమైపోయినా పర్వాలేదు కాని నా నాయకుడికి మాత్రం ఏ ఆపద రాకుడదు అనే వ్యక్తి పూజ దగ్గరి నుండి దేశ అభివృద్ధి ఆటంకాలపై, మనిషి అభివృద్ధికి, కార్మిక, కర్షకుల ఉన్నతికై ఆలూరి బైరాగి గారు తన కలంతో సాగించిన పోరాటం ఒక అద్భుతం అని వర్ణించుకోవచ్చు.
మన అదృష్టం తెలుగునాట ఎందరో భిన్నమైన కవులున్నారు విప్లవానికి శ్రీ శీ గారు, భావుకతకు దేవుల పల్లి కృష్ణశాస్త్రి గారు.. మొదలైన ఎందరో కవులు మన తెలుగు అక్షరాలలో వారి భావాలను సమాజానికి దానం చేశారు. కాని మన దురదుష్టం ఏమంటే మనకై రాసిన కవులను అంతగా గుర్తించలేకపోయాము. ఆ విషయంలో ఆలూరి బైరాగి గారికి తన ప్రతిభకు తగ్గ ఖ్యాతి రాలేదనే చెప్పుకోవాలి. కాని నిజాయితీని తమ శరీరంలో ఒక భాగంగా చేసుకున్న కవులకు పేరు ప్రఖ్యాతల కొరకు కాదు సంఘం అభ్యున్నతి కొరకే తాపత్రయపడుతుంటారు. గుంటూరు జిల్లా తెనాలిలో 1925 లో జన్మించిన బైరాగి గారు చిన్నతనం నుండి హిందీలోనే చదువుకున్నారు. మొదట హిందీలోనే కవితలు రాస్తూ, హిందీ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మాతృభాష తెలుగు మీద ప్రేమతో చీకటి నీడలు, నూతిలో గొంతుకలు, దివ్య భవనం మొదలైన ఎన్నో కథలు, కవిత్వాలు రచించారు. బైరాగి గారు రాసిన "ఆగమ గీతి" పుస్తకానికి కేంద్రప్రభుత్వం నుండి సాహిత్య పురస్కారం అందుకోవడం వారి ప్రతిభకు ఒక భౌతిక ఉదాహరణ. ఆలూరి బైరాగి గారి గురించి మరింత వర్ణించడం కన్నా శక్తివంతమైన ఆయన కవిత్వాలలో కొన్నీటిని చదివినా చాలు ఆ భావాల తేజస్సు మనకూ శక్తినిస్తుంది.
నాక్కొంచెం నమ్మకవిమ్ము కొండలను పిండి కొట్టెస్తాను. చితికిన టమోట లాంటి సూర్యుడిని ఆరిన అప్పడం లాంటి చంద్రుడిని ఆకాశపు ఎంకిని పల్లెలంలోంచి నెట్టెస్తాను. ఆకాశపు ఉదారంగు నుంచి చొక్కాలేని వారందరికి కుట్టిస్తాను.
ఆగబోదు ఈ తుఫాను.. మీ మేడలు మునుగు వరకు మీ కోటలు కూలు వరకు.. మీ అంత:పుర కాంతలు భూమిపైన దొరలు వరకు.. శోకంతో పొరలు వరకు ఆగరాదు ఈ తుఫాను.
నీ తళతళ మెరిసిన గాజులు, నీ గిల్టు చంద్రహారం! అణా పూలు, కానీ తాంబూళం నలిగిన చీరలు, చీకటి ముసుగులు ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం? ఈ సౌందర్య ప్రపంచపుదానం? చీకటి కొలతల ఆతృత వినిపించని మెల్లని గుసగుసలూ క్షణమాత్రపు చూపుల సంతోషం చెరగుచాటు పాపపు రుసరుసలూ నిదురించిన ప్రపంచగర్భంలో మేలుకొన్న ఆకలిలా పాపం మిణుకుమనే ఆవీధి లాంతరుల నీడల పొంచియున్న విధిశాపం!! (వేశ్య కవిత)
ఈ మన బ్రతుకొక పోరాటం సుఖదుఃఖపు అలల చెలగాటం ఈ జీవిత జలధి ఈ చావు బ్రతుకు తేల్చుకొండి! తిరిగిరండి! మరలిరండి! మీ క్షుద్రప్రేమ గాధలూ మీ తుచ్ఛ విరహ బాధలూ ఈ సంక్షుబ్ధ ప్రభంజన రణధ్వనిలో ముంచేసీ తిరిగిరండి! మరలిరండి! నూతన సూర్యోదయ కాంతులు సరిక్రొత్త ప్రపంచపు దూతలు తలుపులు తట్టారదిగో! స్వాగత మివ్వండి! లెండి! తిరిగిరండి! మరలిరండి!నవజగతికి తరలి రండి!
తాజ్ మహల్ పడగొట్టండోయ్! వెన్నెలరాత్రుల్లో కలగా సౌందర్య సాగరపు అలగా మా పీడిత హృదయాల్ చీల్చీ మా ఎత్తిన తలలను వాల్చి దరిద్రులను హేళనచేస్తూ మానవులను చులకన చేస్తూ ఆకాశంవైపుకు చూపే ఈర్ష్యలతో హృదయం ఊపే తాజ్ మహల్ పడగొట్టండోయ్!
అదిగో! అది జనసైన్యం మహాయుద్ధంగ ఆకలి వజ్రకవచమా దైన్యం మును ముందుకు సాగుతోంది అది దరిద్ర జనసైన్యం మొగముపైన నవోదయపు నవనవరక్త జ్యోతులు కాళ్ళకింద నలిగిపోవు క్రుళ్ళిన చీకటిలోతులు వారివెనుక నిదురమత్తు ముందునవ్య కార్యశక్తి ఒకవైపున మంచుపొరలు ఒకవైపున వెలుగు తెరలు చీకటివెలుగుల కలయిక ఏడ్పులనవ్వుల కలయిక.!
ఈ జీవిత కేళి గృహంలో సుఖమే ఒక విరిపాన్పైతే మేం కాలసర్పమై వస్తాం విషజ్వాలల ధార విడుస్తాం మీ నిద్రాసుఖసమయంలో స్వాప్నిక ప్రశాంతి నిలయంలో మేం పీడకలలుగా వస్తాం రౌరవదృశ్యం చూపిస్తాం మీ ప్రణయోత్సుక మధుగీతం మీనృత్యమత్త సంగీతం మీకటుక్షుధారోదనంలో ముంచేస్తామొక్క క్షణంలో మీ హేమాసన పాత్రల్లో మీ స్వప్నజగతి యాత్రల్లో మా అశృధార నింపేస్తాం మీబాటను జారుడు చేస్తాం. పానకపు పుడకగా వస్తాం టీ కప్‌లో ఈగై చస్తాం మా ప్రాణాలైనా విడుస్తాం మీశాంతిని భగ్నం చేస్తాం. (కడుపుమంట కవిత)
ఆకలి కోకిల పలికిన పలుకులు చెవులకు ములుకులు దారిలేని బలిపశులకు వధకుని కత్తుల తళుకులు ఆకలి పాడిన గేయం దీనుల మౌనరోదనం ఆకలి చెప్పిన మంత్రం పూటకు చాలు భోజనం. ఆకలి! తన శిశువులనే చంపే తల్లుల ఆకలి! పూటకూటికై శీలం అమ్మే కన్యల ఆకలి! చూచావా, ఎప్పుడైనా ఎంగిలికై రోడ్లపైన కుక్కల్లా కాట్లాడే ప్రేతాలను? విన్నావా ఎప్పుడైనా బరువెక్కిన గాలిలోన ఆకలితో మరణించిన మృతకాత్మల రోదనం? పాలులేని తల్లి రొమ్ము పీడించే పసిపాపల ఏడ్పులు వినలేదా? డొక్కలు అంటుకపోయిన కన్నులు లోతుకుపోయిన నల్లని ఎండిన ముఖాలు కనలేదా? కనలేదా? (ఆకలి కవిత)
ఎక్కడ? ఆశ్రయ మెక్కడ? దిక్కులేని పక్షులకూ ఇళ్ళులేని మనుజులకూ సర్వజీవ జంతువులకు ఎక్కడ? ఆశ్రయ మెక్కడ? జలమయ మగు జగతిలోన!యుగయుగాల తరతరాల పేదజనుల స్వేదధార మానధనుల అశృధార ఆకాశపు కళ్ళలోంచి కట్టలు తెగి పొరలుతోంది. గౌతమబుద్ధుని హృదయం కరుణాంబుధి సముచ్ఛయం ఉప్పెనగా కప్పుతోంది పాపకళంకిత పృధ్విని.
మానెత్తుట నింపినవే మీ మధురాసన పాత్రలు మాశవములపై నడచిన మీదిగంతజయయాత్రలు మా ఎముకల గూళ్ళపైన కట్టిన మీసౌధాలూ, మా జీవితజ్యోతి ఆర్పి వెలిగిన మీదీపాలూ మమ్ము వెక్కిరిస్తున్నయ్! అవహేళన చేస్తున్నయ్!
అమ్మా! ఈ కవిత్వాల ప్రతిచరణంలో బ్రతికియున్న ప్రతి శబ్దంలో పలుకరిస్తున్న నీకు ఇవ్వటానికి నా దగ్గిర ఇంతకంటే ఏముంది?