Contributed By Masthan Vali.K
నేను తనను కలుస్తుంటాను, తరచూ కాకపోయినా, అప్పుడప్పుడు తనే కనిపిస్తుంటుంది.
పొట్టిగా, అందంగా, నాజూగ్గా ఉంటుంది. చూడగానే నచ్చేస్తుంది. దాదాపు అలాంటి స్నేహితులే ఉంటారు తన చుట్టూరా, కానీ వాళ్లందరికంటే తాను కొంచెం ప్రత్యేకం అనిపిస్తుంది. అంటే, వయసులో చిన్నది కాకపోయినా... అందరికన్నా చివర్న పుట్టిన చంటిపిల్ల మీద ఉండేటువంటి ఒక విశేషత ఉంటుంది తనలో. వంపుగా కదలాడుతుంది. సొంపుగా మాట్లాడుతుంది. చటుక్కున మనసును మీటేస్తుంది. పొడిపొడి గా రాల్చే ఆ నాలుగు మాటల్లోనే నాలుగు తరాల వారిని ఆలోచింపచేస్తుంది. అంతలా ఏం మాట్లాడుతుంది అనడిగితే, ' ఇది - అది ' అని మడి కట్టుక్కూర్చోదు. లోక జ్ఞానం చాలా ఎక్కువే. లింగ వర్గ వర్ణ వివక్ష నుంచి అంతరిక్షపు తారల మీదుగా విశ్వాన్ని దాటి అనంతాన్ని చేరి అక్కడేముందో కూడా చెప్పేయగలదు మరి, అది నిన్ను తీవ్రంగా కదిలించేసినా ఆశ్ఛర్యపోనక్కర్లేదు. ఏంటి ఇంత విషయముందా అనిపించక మానదు తను కనిపించే తీరుకి, కలిగించే స్ఫూర్తికి. తననర్థం చేసుకోవాలే గానీ, తాను మాట్లాడే సరదా మాటల్లో కూడా కనిపించని తత్త్వం ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే, నువ్వు సర్వం కోల్పోయి అగాధం లో ఉన్నావా...? తనను కలువు. అగాధం లో ఉన్నావో, ఉన్నాననుకుంటున్నావో ఒక స్పష్టత వస్తుంది. నువ్వు సకలం సాధించేసి ఆనందాన్ని ఏలుతున్నావా...? తనను కలువు. భ్రమలో బ్రతుకుతున్నావో లేదో వివరం దొరుకుతుంది.
నువ్వు మనుషుల్లోకెల్లా మంచోడివి అనిపించుకుంటున్నావా...? తనను కలువు. అనిపించుకోవాల్సిన అవసర-అనవసరాలు తెలిసొస్తాయ్. నువ్వు జీవితాన్ని పూర్తిగా చదివేసాననుకుంటున్నావా ...? తనను కలువు. జీవితపు అర్థం కొత్తగా తెలుసుకోడమెలానో తెలుస్తుంది . నువ్వు అసలు ఏమి ఆలోచించట్లేదా, ఆలోచించాలని అనుకుంటూ అయోమయం లో ఉన్నావా …? తనను కలువు. ఆలోచన పుడుతుంది, లేదా ఆలోచనకు బీజం పడుతుంది.
ఇంతకీ ఎవరు తను...? కవిత. అబ్బే, అమ్మాయి కాదండి.! మామూలు కవితే. ఒకసారి కలిసి చూడండి.