This Story About How The Great Sage Valmiki Was 'Born' Will Make You Reflect Deeply On Today's Society!

Updated on
This Story About How The Great Sage Valmiki Was 'Born' Will Make You Reflect Deeply On Today's Society!

త్రేతా యుగం, తేదీ ఎవరికీ అంత పర్టికులర్ గా ఐడియా లేదు.

అప్పట్లో రత్నాకరుడనే బందిపోటు కుటుంబ పోషణ కోసం దారిన పోయే బాటసారులను భయపెట్టి, హింసించి, దోచుకునేవాడు. ఒక రోజు అదే దారిలో తన మహతిని (వీణ పేరు మహతి) మీటుతూ హరి గానం చేసుకుంటూ వెళుతున్న నారద మహర్షిని పట్టుకుని ఎప్పటిలాగే ధనం కోసం బెదిరించాడు. తాను సన్యాసిననీ, తన వద్ద అటువంటివేమి ఉండవని, విన్నవించుకున్నాడు నారదుడు. కానీ అంతకంటే విలువైన విషయం ఒకటి చెబుతానని ఆఫర్ చేశాడు. నీ ధర్మాలు, శాస్త్రాలు నాకెందుకు గాని, పో ఈరోజు నీ టైం బాగుంది, నిన్ను ఒదిలేస్తున్నా అని వరమిచ్చాడు రత్నాకరుడు."అర్రే, శాస్త్రం కాదయ్యా, చిన్న డౌట్ వొచ్చింది అంతే. ఇలా హింసించడం, దోచుకోవడం పాపం కాదు? ఎందుకిలా చెడు దారులు పడుతున్నావ్?" అని ప్రశ్నించాడు నారదుడు. అందుకు రత్నాకరుడు రావు గోపాల్ రావు లాగా కిస్సున నవ్వేసి," ఓసినీ తస్సారావుల బొడ్డు, ఇంకా నయం, ఇక్కడితో ఆగావు కాదు.

ఇట్లా పాపం పుణ్యం అనుకుంటూ కూర్చుంటే, నా భార్యా పిల్లల బతుకు ఏం గాను? ఇవన్నీ నాకు తప్పవు గాని నువ్వెళ్ళు, అని జవాబిచ్చాడు రత్నాకరుడు. అందుకు నారదుడు చిన్నగా నవ్వి," నువ్వు ఎవరి కోసమైతే ఇన్ని పాపాలు మూటగట్టుకుంటున్నావో, వాళ్ళు నీ కష్టఫలాల్లోనే గాక, అందుకు కారణమయ్యే పాపాల్లోనూ వాటా పంచుకుంటారా? అని రత్నాకరుడి మదిలో ఒక చిన్న సందేహ విత్తనాన్ని ఒడుపుగా నాటి వీణ మీటుకుంటూ వెళ్ళిపోయాడు నారదుడు. ఆ ప్రశ్న శనగ పిండి అతిగా తింటే పొట్టను సతాయించే మంట లాగా వేధించింది రత్నాకరుడిని.వెంటనే అతను ఇంటికెళ్లి దొడ్లో మల్లె పూలు కోసుకుంటూ కూని రాగాలు తీసుకుంటున్న తన భార్య దగ్గరికి వెళ్ళాడు. టైం గాని టైం లో అలా రత్నాకరుడు ఇంటికి రావటం ఏమిటని సందేహం తో "ఏమయ్యా, ఈ పూట పని అప్పుడే అయిపోయిందా? ఎంతెంత సరుకు కొట్టుకొచ్చావేంటి?" అని ప్రశ్నించింది. అందుకు రత్నాకరుడు మొహం విసుగ్గా పెట్టి,"ఒక్క క్షణం ఆగకూడదూ, ఏమిటంత తొందర నీకు... నాకు ఒక చిన్న సందేహం కలిగింది, అందుకే వచ్చా.నేను నీకోసం, మన బుడ్డోడి కోసం ఇంతమంది ఉసురు పోసుకుంటున్నానే, ఆ పాపం లో నువ్వు కూడా భాగం పంచుకుంటావా? అందుకు నీకు సమ్మతమేనా?" అని అడిగాడు రత్నాకరుడు. అందుకు భార్య నవ్వి,"అలా ఎలా కుదురుతుంది పెనిమిటీ, ఎవరి కష్టం వారిదే, ఎవరి పాపం వారిదే. పాల వాడి దగ్గర పాలు కొనుక్కున్నాక, ఆ పాలల్లో నీళ్లు నాకొద్దు అంటే ఎలా కుదురుతుంది?" అని లాజిక్ మాట్లాడింది భార్య. దిమ్మ తిరగటం రత్నాకరుడి వంతు అయ్యింది. దీని కోసం ఇంత చేస్తే, ఇలా మాట్లాడిందేవిటి అని.

అలా నడుచుకుంటూ గుమ్మం లో గోళీలు ఆడుకుంటున్న బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. వాడు తండ్రిని చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి "నాకోసం ఏమేం తీసుకొచ్చావ్ అయ్యా?" అని ఆశగా అడిగాడు. నడుము దగ్గర సంచిలో చేయి పెట్టి ఒక రేగి పండు వాడి చేతిలో పెట్టాడు. వాడు అది ఆశగా తీసుకుని మెల్లిగా ఆస్వాదిస్తూ తింటూ ఉండగా భార్య ను అడిగిందే వీడ్ని అడిగి చూద్దాం అనుకున్నాడు."ఒరేయ్ బిడ్డా, నాకొక చిన్న సందేహం రా, నీ కోసం, నీ అమ్మ కోసం ఇంత కష్టపడి నలుగురి పొట్టా కొడుతున్నా కదా, ఆ పాపం లో నువ్వు కూడా కాస్త భాగం పంచుకుంటావా?" అని ప్రశ్నించాడు. పిల్లోడు ఆ రేగి పండు విత్తనం వెనక్కి విసిరేసి, " అలా ఎలా కుదురుతుంది నాయనా, నీ పాపాలు నేను తీసుకుంటే, మరి నా పాపలు ఎవడు తీసుకుంటాడు? అని ఎదురు ప్రశ్నించాడు.

"నా బాబే, నా తండ్రే ఇంత చిన్నోడివి నీకెంత తెలివి రా కొండా! మీ అమ్మే అనుకుంటే, మీ అమ్మను మించిపోయావే! మీ ఇద్దరితో కాదు గాని, ఇక ఆ నారద మునే నా దిక్కు" అని పరుగు అందుకున్నాడు రత్నాకరుడు.

"గోవిందా గోవిందా, ఏడు కొండలు ఏసీ చేస్తా..." అని తన్మయత్వంలో పాడుకుంటూ వెళుతున్న నారదుడి కాళ్ళ మీదికి లాంగ్ జంప్ చేసి మరి పట్టుకున్నాడు రత్నాకరుడు. ఉలిక్కిపడ్డాడు నారదుడు. "ఏంటయ్యా, ఏమైంది..అసలేమైంది అని.."అని అంటుండగానే, రత్నాకరుడు తన ఇంట్లో కేసెట్ అంతా వినిపించాడు నారాదుడికి. "హ్మ్మ్..సరే అయ్యిందేదో అయిపోయింది, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావ్" అని ప్రశ్నించాడు నారద ముని. "ఇక మీరు చెప్పిందే నాకు దిక్కు. నరక ద్వారాలు నా మీద తెరుచుకోకుండా, నన్ను కాపాడాల్సిన బాధ్యత మీదే స్వామి" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు నారదుడు 'రామ' మంత్రాన్ని జపించమని అది అతన్ని సత్మార్గంలో నడిపిస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. రత్నాకరుడి కి అది అర్థంకాక, దాన్ని 'మర' అని పలకడమూ, అలా పలికి పలికి అది రామ మంత్రమవడమూ జరిగింది.

అలా ఒకే చోట కూర్చుని ఏళ్ళకి ఏళ్ళు రామ మంత్రోచ్చారణ చేయటం వల్ల, అతని చుట్టూ చీమలు పుట్టలు (పుట్టను వాల్మీకం అని కూడా అంటారు) పెట్టి, అటు వైపు మళ్ళీ వచ్చిన నారదుడు అతన్ని పుట్టలోనుండి బయటకు తీసి, ఒక రకంగా పునర్జన్మ అతనికి కలిగిన కారణంగా, వాల్మీకి అని పేరు పెట్టాడు నారదుడు. ఏ 'realization' కారణంగా ఒక దొంగ ఒక గొప్ప రచయిత, ఆది కవి, యుగ పురుషుడి గా మారతాడో చెప్పే కథ ఇది.

ఇప్పటి ఈ యుగంలో ఇంటింటా ఇటు వంటి రత్నాకరులు ఉన్నారు. పన్నులు ఎగ్గొట్టి, దేశం ఎటు పోయినా సరే, తమ తమ కుటుంబాలను బాగు పరుచుకోవాలి అనే ఆలోచనతో అభినవ బంధిపోట్లు గా మారుతున్నారు. సిలిండర్ సబ్సిడీలు తమకు ఆ ఆర్ధిక శక్తి ఉన్నా ఒదులుకోక, సరైన పన్నులు కట్టక తిరుగుతున్న మన అన్నలు, నాన్నలు,తాతలు ఎంతో మందిని మనం రోజు చూస్తూ ఉన్నాం. వీరందరూ ఇప్పటి రత్నాకరులు. అంటే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. అప్పట్లో నారదుడి లాగా నేటి నాయకులు లేరు. వారు ఆదర్శ వ్యవస్థ ను తీసుకు వచ్చి మాటలతో కాక, చేతల్లో వీరు ఆచరించలేరు. మనకు చేతనైనా సరే మనం చేయకపోవడం మూలాన, ఎందరికో అందాల్సిన ఫలాలు అందటం లేదు. అది దోచుకోవటమే గా మరి. మన ఈ రత్నాకరులందరూ, ఇక వారి పాపం వారే మోయాలేమో మరి. ఎందుకంటే, ధర్మం మూడు పాదాల మీద నడిచిన త్రేతా యుగంలో కూడా ఒకే ఒక్క వాల్మీకి కథే మనకు తెలుసు. ఇది కలియుగం. ఏమో ఉన్నాడేమో...... ఎక్కడో నేటి వాల్మీకి......!