నా మిత్రుడు ఎం.బి.ఏ పూర్తిచేశాడు జాబ్ కోసం కనీసం రెజ్యూమే కూడా తయారుచేసుకోలేని దుస్థితి.. సరే అని చెప్పి నీ సర్టిఫికెట్స్ స్కాన్ కాపి నాకు మేయిల్ చేయిరా అన్నాను.. మేయిల్ ఎలా చేయాలి రా అని అడిగాడు. నాకు కాసేపు ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్ధం కాలేదు. 3క్లాస్ చదివేవాడు కూడా ఫేస్ బుక్ వాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని కాసేపు షాక్ లో ఉండిపోయా. సిటీలో ఉంటున్నామంటే టెక్నాలజీ మీద ఖచ్చితంగా అవగాహన ఉంటుంది, లేదంటే పరిస్థితులు తీసుకువస్తాయి. మరి గ్రామాలలో చదువుకుంటున్న పిల్లల సంగతేంటి.?
మణిదీప్(99086 24615) మరియు రోహిత్ ది దిగువ మధ్య తరగతికి చెందినవారు. కష్టాలను అనుభవించని వారి కన్నా అనుభవించిన వారికే వాటిపైన పూర్తి అవగాహన ఉంటుంది.. సమస్య పరిష్కారం అవ్వాలనే తపన ఉంటుంది.. ఓపిక ఉంటుంది. మణిదీప్, రోహిత్ ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్ధులే. చదువుతున్నప్పుడే పార్ట్ టైం జాబ్ చేస్తున్న విద్యార్ధులలా మెక్రోసాఫ్ట్ స్టూడెంట్ పార్ట్ నర్' ద్వారా గ్రామాలలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో టెక్నాలజీ కి సంబంధించిన విద్యను బోధించడం ప్రారంభించారు. ఈ ప్రయాణంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితిని చూసి చలించిపోయి 2014లో "టెక్ సేవ" అనే ఓ స్వచ్చంద సంస్థను స్థాపించి తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు.
తెలంగాణాలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా వరంగల్. టెక్ సేవ మొదటిసారి వరంగల్ లోని దాదాపు 10 పాఠశాలలో టెక్నాలజీ పాఠాలు అందించారు. మనలో సంకల్పం ఉన్నంత మాత్రాన, మనం సేవ చేస్తున్నంత మాత్రాన సమాజం మనం ఆశించినంత వేగంగా మారదు మనలాంటి మనుషులంతా ఒకచోట కలిస్తే తప్ప. ఇద్దరు మొదలు పెట్టిన ఈ టెక్ సేవ సభ్యుల సంఖ్య ప్రస్తుతం 40 మందికి చేరుకుంది. వరంగల్ నుండి ప్రస్తుతం హైదరాబాద్ కు వీరి సేన వచ్చి ఇక్కడి పిల్లలకు టెక్నాలజీ మీద పూర్తి అవగాహన అందిస్తున్నారు.