A List Of Extraordinarily Talented People From The Land Of Warangal!

Updated on
A List Of Extraordinarily Talented People From The Land Of Warangal!

ప్రతి ఊరిలో గొప్ప కట్టడాలుంటాయి.. విలువైన ఖనిజ సంపద ఉంటుంది.. చారిత్రక నేపద్యం ఉంటుంది.. ఇవి ఆ ఊరికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తుంది. సామాన్యులుగా పుట్టి అసామాన ప్రతిభాపాఠవాలతో స్థానిక చరిత్రకు అతి దగ్గరిగా వారి స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అలాంటి వరంగల్ లో పుట్టి పెరిగిన కొందరి మహానుభావుల గురుంచి తెలుసుకుందాము.

1. నేరెళ్ళ వేణు మాధవ్ గారు. (మిమిక్రి)

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో పుట్టి పెరిగిన వేణుమాధవ్ గారు దేశంలోనే ఘనత వహించిన మిమిక్రి కళాకారుడు. ఒకసారి చిన్నతనంలో 30 ఇంగ్లీష్ సినిమాలు చూసి వాటిలోని ఆర్టిస్టుల గొంతులు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సహా సరదాగా ప్రిన్సిపాల్ గారికి వినిపిస్తే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అలా మొదట ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసి ఆ తర్వాత లక్షలాది మందిని ఆశ్చర్యంతో కూడిన ఆనందానికి లోను చేసి "ధ్వన్య అనుకరణ సామ్రాట్" అనే బిరుదుని అందుకున్నారు.

2. దాశరథి కృష్ణమాచార్య గారు (రచయిత)

"నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని కలమే సైన్యం.. అక్షరాలే సైనికులుగా దాశరథి కృష్ణమాచార్య గారు నాటి నిజాం పాలకులపై దండెత్తారు. వరంగల్ జిల్లా చిన్న గూడూరు లో పుట్టి ఇంగ్లీషు, సంస్కృతం, ఉర్దూ బాషలలో పండితునిగా ఎదిగారు. ఆ తర్వాత నిజం పాలకులపై పోరాడి జైలు జీవితం కూడా గడిపారు. అగ్నిధార, రుద్రవీణ లాంటి ఎన్నో పుస్తకాలు రాసి కేంద్ర సాహిత్య అకాడెమి నుండి అవార్డులను కూడా అందుకున్నారు. అలాగే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆస్థానకవిగా (1922 - 1983) కూడా సేవలందించారు. 1961 నుండి 1971 వరకు కొన్ని వందల తెలుగు సినిమా పాటలు కూడా రాశారు. అటు సాహిత్యానికి, ఇటు పోరాటానికి దాశరథి గారు ఎందరికో ఆదర్శం.

3. కాళోజి నారాయణ రావు గారు (రచయిత)

కాళోజి గారికి జ్ఞానం పెరిగినప్పటి నుండి ఉద్యమంలోనే బ్రతికారు. భారత స్వతంత్ర పోరాటం, నిజాం పాలకులపై పోరాటం, గ్రంథాలయ ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలలోను పాల్గొన్నారు. పదుల సంఖ్యలో అద్భుతమైన పుస్తకాలు రాసి తెలుగు సాహిత్యానికి వెలకట్ట లేని సాహితీ సంపదను అందించారు. కాళోజి జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి అసలైన గౌరవాన్ని అందించింది. ఎక్కడో వరంగల్ మడికొండ ప్రాంతం నుండి మొదలైన ఆయన జీవన ప్రస్థానం అంచలంచలుగా పెరుగుతూ సాగింది. 1992 లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి "పద్మవిభూషన్" పురస్కారంతో దేశ ప్రజల తరుపున గౌరవించింది.

4. రామ చంద్రమౌళి గారు (ప్రొఫెసర్, రచయిత)

వరంగల్ గణపతి ఇంజినీరింగ్ కాలేజి లో వైస్ ప్రిన్సిపాల్ గా, ప్రొఫెసర్ గా పనిచేస్తూనే రాష్ట్రపతి గారి చేత ఉత్తమ టీచర్ గా స్వర్ణ పతాకం అందుకున్నారు. అలాగే ఇప్పటి వరకు దాదాపు 200 కథలు, 18 నవలలు, 8 కవిత సంపుటాలు, ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలు రాశారు.

5. సామల భాస్కర్ గారు (సినిమాటోగ్రఫీ)

చిన్నతనం నుండి ఫోటోగ్రఫి మీద మక్కువ ఎక్కువ ఉండడంతో JNAFU లో ఫోటోగ్రఫి మీద గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనుకున్నట్టుగానే తన శ్రమతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి శశిరేఖ పరిణయం సినిమాకు మొదటిసారి కెమెరామెన్ గా పనిచేశారు. ఆ తర్వాత 11 తెలుగు సినిమాలు సినిమాటోగ్రఫీ ని అందించి తన మార్క్ ను చూపించగలిగారు.

6. అందె శ్రీ గారు (రచయిత)

"జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం.." తెలంగాణ మాతృ గీతాన్ని అందెశ్రీ గారే రచించారు. అందె శ్రీ గారు తల్లిదండ్రులెవరో తెలియని అనాథ గా పెరిగారు. అందెశ్రీ గారు ఏ స్కూల్ కి వెళ్లి చదువుకోలేదు. కేవలం జీవితాన్ని చదివి ఇంతటి జ్ఞానాన్ని ఆర్జించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ తో పాటు గంగ అనే తెలుగు సినిమాలోని పాటకు గాను నంది అవార్డును అందుకున్నారు.

7. మాడభూషి శ్రీధర్ గారు (అధ్యాపకులు)

నేను ఏ ఊరిలో ఐతే ఇంటింటికి తిరిగి పేపర్లు పంచానో అదే ఊరిలో గౌరవ సూచికగా నన్ను ఊరేగించారు - శ్రీధర్ గారు.. చిన్నతనం నుండే శ్రీధర్ గారితో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. "బాల సంఘం" ఏర్పాటు చేసి హరికథలు, పాటలు పాడడం లాంటివి చేస్తుండేవారు. విద్యతో ఉహకందనంత ఎదిగి ప్రతిష్టాత్మక నల్సర్ లా యూనివర్సిటీ లో అధ్యాపకునిగా బోధనలు చేస్తూ కేంద్ర సమాచార శాఖ కమిషనర్ గా బాధ్యతలు అందిస్తున్నారు. లా లో దాదాపు 30 విలువైన పుస్తకాలు రచించి విద్యార్థి లోకానికి అంకితమిచ్చారు.

8. అంపశయ్య నవీన్ గారు (రచయిత)

వరంగల్ వావిలాల గ్రామంలో జన్మించిన నవీన్ గారు ఆర్ధిక శాస్త్ర టీచర్ గా పనిచేస్తూనే గొప్ప నవలలు, కథలు రాశారు. తెలుగు సాహిత్య చరిత్రలో ఆయనదొక విశిష్ట వ్యక్తిత్వం. "అంపశయ్య" అనే నవలనే తన ఇంటిపేరుగా చేసుకుని 30 పుస్తకాలకు పైగా రాసి కేంద్ర సాహిత్య అకాడెమి అందుకుని ప్రస్తుతం సాహిత్య అకాడెమీ కి సలహాదారునిగా పనిచేస్తున్నారు.

9. భూపతి కృష్ణమూర్తి గారు (స్వాతంత్ర్య సమరయోధుడు)

‌భగత్ సింగ్ లానే చిన్ననాటి నుండి స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి భూపతి గారు. నాటి మహాత్మ గాంధీ గారి అడుగు జాడల్లో నడిచి బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాటం చేశారు. స్వాతంత్రం తరువాత1969 తెలంగాణ ఉద్యమంలో సొంత ఆస్తులను అమ్మేసి ఉద్యమానికి ఊపిరి పోశారు. తెలంగాణ ప్రజా సమితి ని స్థాపించి పార్టీని నడిపించారు. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూసే ప్రాణం విడుస్తాను అని ప్రకటించిన భూపతి గారు తన కోరిక నెరవేరక ముందే తనువు చాలించారు. వరంగల్ జిల్లా గిర్మాజీపేట భూపతి గారి జన్మస్థలం.

‌10. చంద్రబోస్ గారు ( సినీ పాటల రచయిత)

‌వరంగల్ చల్లగారిగె గ్రామంలో చిన్నతనం నుండే పాటలు, పద్యాలు, భజనలు పాడేవారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాత పాటలపై ప్రేమ పెరిగి అవకాశాల కోసం మిత్రుల సహాయంతో ప్రయత్నించారు. రామానాయుడి గారి తాజ్ మహల్ సినిమాలో "మంచు కొనడల్లోన" పాట చంద్రబోస్ గారి మొదటిపాట. అన్ని రకాల భావాలను అద్భుతంగా రాస్తుండడంతో అవకాశాలు వెతుక్కుంటూ బోస్ గారి దగ్గరకు వచ్చాయి ఇప్పటి 3000 వేలకు పైగా బోస్ గారు పాటలు రాశారు.

11. చక్రీ గారు (సంగీత దర్శకులు)

‌వరంగల్ జిల్లాలోనే వయోలిన్, కర్ణాటక సంగీతం నేర్చుకుని స్థానికంగా జరిగే వివిధ శుభకార్యాలలో "సాహితీ కళాభారతి" పేరుతో ప్రదర్శనలు ఇస్తుండేవారు. మిత్రుల ప్రోత్సాహంతో హైదరాబాద్ కు వచ్చి "పండు వెన్నెల" అనే మ్యూజిక్ ఆల్బమ్ తో పాటు 30 ఆల్బమ్స్ కంపోజ్ చేశారు. చివరకు పూరి జగన్నాథ్ గారి కలయిక తో చక్రిగారి ఎదుగుదల మనందరికీ తెలిసిందే..

‌12. చుక్కా రామయ్య (అధ్యాపకులు)

‌రామయ్య గారికి ఉన్న మరో పేరు ఐ.ఐ.టి రామయ్య. రామయ్య గారి ఐ.ఐ.టి కోచింగ్ లో ఉన్నతులు రామయ్య గారి శిష్యరికంలో ఏంతో మంది విద్యార్థులు తమ జీవితాన్ని మార్చుకున్నారు. యువకుని గా ఉన్న సమయంలో హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేక పోరాటం, నిజాం పాలకులపై పోరాడి జైలు జీవితం కూడా అనుభవించారు. విద్యార్థులకు ఉపాయోగపడే 20 పుస్తకాలకు పైగా రాసి ఆంద్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగానూ సేవలందించారు.

‌13. బమ్మెర పోతన గారు (రచయిత)

‌బొమ్మెర గ్రామంలో జన్మించిన పోతన గారు తెలుగు అక్షరం తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితులు. పోతన నిరుపేద కుటుంబంలో పుట్టి పశువులు మేపుతుండేవారు. ఓ మహర్షి అడవిలో కలిసి తారక మంత్రం ఉపదేశించిన తరువాత నుండి ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. ఆంధ్రమాహా భాగవతము లాంటి గ్రాంధాలను రాసి తెలుగు సాహిత్య చరిత్రలో అగ్రగణ్యులుగా వెలుగొందుతున్నారు.

14. సందీప్ రెడ్డి గారు (సినీ దర్శకులు)

‌ఫిజియోథెరపి చేసి ఆ తర్వాత ఇది కాదు నా జీవితం అని తెలుసుకుని ఆస్ట్రేలియా థియేటర్ అండ్ ఫిల్మ్ మేకింగ్ లో కోచింగ్ తీసుకున్నారు సందీప్ గారు. 2010 నుండే ఆయన సినీ ప్రస్థానం మొదలయ్యింది. మొదట కేడి సినిమా, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలకు పనిచేశారు. ఇక తన సొంత బ్యానర్ లో దర్శకత్వం చేసిన అర్జున్ రెడ్డి సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజై పెద్ద సినిమా కలెక్షన్లు వసూలు చేసి అటు డబ్బు పరంగా, ఇటు పేరు పరంగా ఎంతో సాధించారు సందీప్ గారు..

15.తరుణ్ భాస్కర్

తెలుగు తెరకి ఒక కొత్త రకమైన ప్రేమ కథ ని పరిచయం చేసిన దర్శకుడు "తరుణ్ భాస్కర్". వరంగల్ జిల్లా వడ్డేపల్లిలో పుట్టిన ఆయన సినిమా రంగంలో కి వెళ్లాలని తన తొలి ప్రయత్నంగా "అనుకోకుండా", "సైన్మా" అనే షార్ట్ ఫిలిమ్స్ తీశారు. ఆలా తన తొలి అడుగులు తెలుగు సినిమా వైపు వేశారు. పెళ్లి చూపులు సినిమా తో తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత తన వైపు చూసేలా చేసారు. చిన్న సినిమా గా విడుదలై నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఆ సినిమా.