అమ్మ మనపై ఎంతటి కరుణ చూపిస్తుంటుందో మనకు అపాయం కలిగించే దుష్టులపై కూడా అంతే కన్నెర్ర చేస్తుంది.. మహిశాశురుడు, నరకాసురుడు వంటి రాక్షసులను సంహరించి తనలో ప్రేమ, అనురాగం మాత్రమే కాదు అవసరమైతే రాక్షసులను సంహరించేతటి మహాశక్తి కూడా ఉందని వివిధ రూపాలలో నిరుపించి మనకు తెలియజేసింది. అంతటి మహిమాన్విత శక్తిగల అమ్మవారి మరొక అవతారమే భద్రకాళి అమ్మవారు. ఈ భద్రకాళి అమ్మవారి పరమ ఉన్నతమైన దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఉంది.
ఈ దేవాలయానికి వెయ్యేల్ల చరిత్ర ఉంది. క్రీ.శ. 625 లో దీనిని నిర్మించారు. వేంగి చాళుక్యలపై విజయం సాధించడానికై పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి భద్రకాళి అమ్మవారిని ప్రతిష్టించి ఆరాధించారని చరిత్ర. వరంగల్ అంటేనే మనకు కాకతీయుల రాజసం, వారి ఘన చరిత్ర గుర్తుకొస్తుంది కాని ఈ దేవాలయం కాకతీయుల కాలం కన్నా ముందే నిర్మించారు. కాళి అవతారం అంటే ఆగ్రహానికి ప్రతీక. రాక్షసుల పాపాలను చూసి కోపానికి లోనై వారని వధించే సమయంలో అపర భద్రకాళిగా మారుతుంది, కాని ఇక్కడ వరంగల్ లోని భద్రకాళి మాత్రం పేరుకు భద్రకాళి ఐనా అమ్మవారు సౌమంగా దీవెనలు అందిస్తున్నట్టుగా దర్శనమిస్తారు. శ్రీ భద్రకాళిదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా భక్తులను అనుగ్రహిస్తుంది.
కాకతీయుల పతనం అనంతరం ఈ దేవాలయం వైభవం కోల్పోయింది. తర్వాత 1950 కాలంలో ఓరుగల్లు లోని మగన్ లాల్ అనే వ్యాపారి స్వప్నంలో కనిపించి "రేపు నీ వద్దకు వచ్చే వ్యక్తులతో వచ్చి నన్ను దర్శించు" అని చెప్పిందట. ఉదయం తన ఇంటికి వచ్చిన వ్యక్తులను దైవదూతలుగా భావించి వ్యాపారి మగన్ లాల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, మూగ ఐన తన కూతురుకి మాటలు రావాలని వేడుకున్నాడు. అమ్మవారిని అభిషేఖించిన జలాన్ని కూతురికి తీర్ధంగా ఇవ్వడంతో కూతురికి మాటలు వచ్చాయి, ఆ ఆనందంతో నేటి భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని మగన్ లాల్, ఇంకొంత మంది దాతల సహాయంతో మరల నిర్మించారు.
మన దేశంలో గొప్ప కాళి దేవాలయాలుగా వెలసిల్లుతున్న కలకత్తా కాళి, చందా మహంకాళి, ఉజ్జయిని ఉగ్రకాళి, దక్షిణేశ్వర్ కాళి, భీమకాళి తరహాలోనే ఈ భద్రకాళి అమ్మవారి దేవాలయం కూడా అంతటి ప్రసిద్ధి చెందింది. తూర్పు ముఖంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించుకుంటే జయం, దక్షిణ ముఖంగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శుభాలు కల్పిస్తారు, కాని పశ్చిమ దిక్కుగా ఉన్నఅమ్మవారిని దర్శించుకుంటే భక్తుల సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం. ఇక్కడి భద్రకాళి అమ్మవారు పశ్చిమ ముఖంగా కనిపిస్తారు. ఈ గుడి సమీపంలో ఉన్న భద్రకాళి చెరువును పవిత్రమైన జలంగా పరిగనిస్తారు. ఈ నీరే వరంగల్ లోని చాలా ప్రాంతాలలోని ప్రజలకు త్రాగునీరుగా చేరుతుంది.
ఇక్కడ సంవత్సరానికి ఒకసారి శాకాంబరి దేవి ఉత్సవాలు జరుపుతారు ఈ వేడుకలలో అమ్మవారు కూరగాయల అలంకరనలో కనిపిస్తారు. ఇలా పండుగ జరుపడానికి ఒక కథ ఉంది. పూర్వం విపరీతమైన కరువు వచ్చిందట తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక ప్రజలు ఎంతో అవస్థలు పడుతుంటే ఋషులు, దేవతలు వేడుకుంటే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ తల్లి శరీరం నుండి ఆహార పదార్ధాలు ఉద్బవించి కరువును పోగొట్టి ప్రజల ఆకలిని తీర్చిందట.. ఇక అప్పటి నుండి ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దసర నవరాత్రి పర్వదినాలలో జరిగే వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశమంతటి నుండి వేలమంది భక్తులు దర్శిస్తారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.