ఎన్నో పరిచయాలు కొన్ని మనతోనే సాగుతూ వస్తాయి మరికొన్ని ఆరంభంలోనే అంతం అవుతాయి, మరికొన్ని అప్పుడప్పుడు పలకరిస్తాయి, మరికొన్ని ఆశలు రేపుతాయి ఆనందం కలిగిస్తాయి మనతో జీవితమంతా ఉంటే బాగుండు అనిపిస్తాయి.
అలా జీవితం మొత్తం ఉండాలి అని కోరుకున్న ఒక పరిచయం ఒకరికి కన్నీళ్ల తడిని, మరపురాని అనుభుతిని తీసుకువస్తుంది. ఇంకొకరికి తిరిగిరాలేని పంతాన్ని, కదిలిపోయే కాలంలో చెదిరిపోయిన జ్ఞాపకాన్ని ఇస్తుంది.
ఆ పరిచయం విడిపోలేని బంధంలా మారినది అని అనుకున్న కొన్ని రోజులకే దూరము పెరిగిపోతే బంధం నుంచి బయటికి రాలేని, ముందుకి సాగిపోయే కాలంలో కలవలేని మనసుదీ.
మనతో జీవితం పంచుకునే వారికి మన అలవాట్లు, ఆలోచనలు పంచుకొని, వాళ్ళు అవి అన్ని ఒప్పుకున్నట్లు ఒప్పుకొని, మనతోనే జీవితం అని చెప్పి, కొన్ని రోజులకి మన ఆలోచనలో అలవాట్లలో లోటు ఉంది అని కారణాలు వెతుక్కొని విడిపోతే ఆ బాధ అమాయకంగా నన్ను నాలా అంగీకరించాలి, భరించాలి అనుకున్న మనసుదీ.
నాలో సగం నువ్వు విడిపోయేదే లేదు అని చెప్పి ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు జీవితం మొత్తం కలిసి ఉండటం కుదరదు అని చెప్పినా అర్థం చెసుకోలేని అర్దాంతరంగా విడిపోయిన బంధాన్ని తల్చుకుంటూ ఉన్న మనసుదీ.
కోపంలో ప్రేమని చూడలేని, బలహీనతలు అర్థం చేసుకోలేని, ఈ ప్రయాణం ఇంతె అనుకోమని చెప్పిన అలుపు లేని అలోచనలకు బందీ అయిన మనసుదీ.
నీ పేరులో అక్షరంలా తోడుగా ఉంటాను ఎప్పటికి ఇలానే ఉందాము అని చెప్పుకున్న ఊసులు మరవలేని మనసుదీ.
పొరపాటు కాలానిదా లేక ముందల అనుకున్నవి మర్చిపో అనవసరం అని చెప్పిన వినిపించుకోకుండ గొడవపడిన మనసుదా!!
తను ఉంటే చాలు అన్ని నీతోనే ఉంటాయి అనుకున్నావు కాని తను మునుపులా ఉండలేను అని చెప్పినా మనసు మునుపటి జ్ఞాపకాలలోనే ఉండిపోయినదా !!!
చాల విషయాలని తేలికగా తీసుకొని మర్చిపోయే మనసా ఎందుకు ఈ బంధాన్ని సంకెళ్లతో ప్రతి కదలికలో కట్టిపడేసి బరువుని పెంచుతున్నావు !!
మొదటి సారి కలిగిన ఈ పరవశం మనసు లోతుల్లో నిండిపోయింది మరోక జన్మకి కూడా నీడగా నీకై సాగుతుంది అని మురిసిపొయావా!!
మూడుముడులు పడలేదు కాని మనసుకు ముడిపడింది, ఏడు అడుగులు వెయ్యలేదు కాని ఏడేడు జన్మల బంధమిది, అగ్ని సాక్షిగా కొంగుముడి వేసి ప్రమాణాలు చేయలేదు కాని మనసే సాక్షిగా మనసా వాచా కర్మణా తనతోనే అనుకున్నావా !!
ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే చోట ఉన్నా కలవని ఈ దారులు ఎందుకు కలిసాయో!! నూరేళ్ళ బంధం కోసం కలిసిన ఈ పరిచయం ప్రేమగా సాగిన ప్రయాణం ఊహకి అందని విధముగా అసాధారణ కారణాలతో ఒక రోజులో ఆగిపోయి ఊహల్లోనే ఉండిపోయినదా!! ఊరుకో మనసా!! బంధం భాగ్యం ఇంతె అనుకో!!!
నిన్ను నీ మనసును అర్థం చేసుకున్నా, అంగీకరించలేని మనిషి గురించి ఎందుకు తపిస్తున్నావు !!
మర్చిపో మనసా !! మర్చిపో అని మేధస్సు చెప్పినా మరువలేను అని మనసు మొండిగా వాదిస్తున్నదా !!!