చిన్నప్పుడు స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు ఓ భిక్షగాడు అనిత దగ్గరికి వచ్చి "అమ్మా ధర్మం చేయండి ఆకలిగా ఉంది" అడిగాడు.. వెంటనే మరో ఆలోచన లేకుండా అనిత తన దగ్గరున్న లంచ్ బాక్స్ ఇచ్చేసి ఆ వృద్ధుని ఆకలి తీర్చేసింది. దానికి పక్కనున్న తోటి మిత్రులు "మరి నీకెలా" అంటే "నాకు అమ్మ నాన్నలున్నారు నేను ప్రతి రోజు తింటాను, పాపం ఇతనికి లేరు కదా" అంటూ బదులిచ్చేశారు. ఈ ఒక్క ఉదాహారణ చాలు "అనిత రావల" గారి గురించి. చిన్నతనం నుండి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందిని ఆదుకుంటున్నారు. అదంతా ఒక ఎత్తు ఇప్పుడు పాఠశాల దత్తత మరో ఎత్తు.
పాఠశాల దత్తత: ఒక వ్యక్తిని దత్తత తీసుకున్న దాని కన్నా ఒక స్కూల్ ను దత్తత తీసుకోవడం వల్ల అటు పిల్లలకు ఇటు దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అనిత రావల గారు ప్రస్తుతం అమెరికాలో ఉంటారు. నరేష్ పోలిశెట్టి గారు జర్మనీలో సైంటిస్ట్ వీరిద్దరూ మంచి మిత్రులు.. వీరిద్దరి ఆలోచన, ఆశయం ఒకటే అవ్వడంతో విదేశాల్లో ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే "విలాగ్ నిర్మాణ్ ఫౌండేషన్" స్థాపించి గుంటూరు జిల్లాలోని కాకర్లమూడి, ఏటుకూరు, చిత్తూరు జిల్లాలోని పల్లం హరిజన వాడ పాఠశాలలను దత్తత తీసుకుని వాటిలో ఏ లోపాలు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
దత్తత మాత్రమే కాదు: ఇంటర్, డిగ్రీలలో మంచి ర్యాంక్ సాధించిన లావణ్య తల్లిదండ్రులు కూలి పనులుచేస్తుంటారు. పై చదువుల కోసం మంచి కాలేజీలలో జాయిన్ అవ్వడానికి ఆర్ధికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. చదువుకోవాలంటే చదువుకొనే పరిస్థితులలో మనం ఉన్నాం. చదువుకొనలేని దయనీయమైన పరిస్థితులలో ఉన్న లావణ్యను కొంతమంది స్థానికుల ద్వారా విషయం తెలుసుకుని తన చదువుకయ్యే ఖర్చును "విలాగ్ నిర్మాణ్ ఫౌండేషన్" ద్వారా భరిస్తున్నారు. ఇదొక్కటి మాత్రమే కాదు పేద, దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతిభా వంతులను గుర్తించి వారికి ఆర్ధికంగా, కెరీర్ పరంగా సరైన గైడెన్స్ ఇవ్వడంలోనూ వీరు ముందుంటున్నారు.
ఇందులో భాగంగా ఎల్.కే.జి నుండి పీజి వరకు చదువుతున్న సుమారు 50మంది విద్యార్ధులకు అండగా నిలబడ్డారు. చదువుకునే విద్యార్ధులకు మాత్రమే కాదు గ్రామాలలోని మహిళలకు కుట్టు మిషీన్లను అందించి ఆర్ధికంగా ఇంకొకరి మీద ఆధారపడకుండా తొడ్పాటునందిస్తున్నారు. కేవలం వారి సొంత గ్రామాలనే కాకుండా రాష్ట్రంలోని పలుచోట్ల ఉన్న నవజీవన్ అంధుల పాఠశాల, దీనజనబంధూ, ఓల్డేజ్ హోమ్స్ లాంటి సంస్థలకు కూడా అండగా నిలబడుతూ ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నారు.