NNOK Director Venu Udugula's Real Life Story Is All Kinds Of Inspiring To Today's Youth!

Updated on
NNOK Director Venu Udugula's Real Life Story Is All Kinds Of Inspiring To Today's Youth!

గమనిక: ఇది రాహుల్ ద్రావిడ్ యాడ్ లేని సినిమా.. హీరో ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎదురుచూడకండి, ఇంట్రవెల్ ట్విస్ట్ ఉహించుకోవద్దు, బాంబ్ బ్లాస్ట్ లు, సుమోలు గాల్లో ఎగరడాలు ఉంటాయనుకోవద్దు, ఐటెమ్ సాంగ్, క్లైమాక్స్ లో భారీ ఫైట్లకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇది మీ కథ, మా కథ, మనందరి కథ.

నీది నాది ఒకే కథ సినిమా కోసం చిత్ర యూనిట్ విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇది. ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇలా తమ సినిమా కోసం ప్రమోట్ చేయడం మనం చూశామా..? లేదు. ఇలా రిలీజ్ చేయాలంటే ప్రేక్షకుల మీద నమ్మకం ఉండి తీరాలి. నమ్మకం కలగాలంటే వారి జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించి తీరాలి. ప్రేమకు చాలా శక్తి ఉంటుంది. అది మనల్ని ఖచ్చితంగా ప్రయోజికులను చేసి తీరుతుంది. సినిమా మీద ప్రేమనే వేణు ఉడుగులను ఈ స్థాయికి తీసుకువచ్చింది. సమాజాన్ని వేరొక కోణంలో చూసేలా చేసింది. కొరియర్ బాయ్ గా, ఫ్యాక్టరీ కార్మికునిగా ఇలా ఏ పనైనా నమోషి లేకుండా చెయ్యగలిగేంతటి స్థితికి తీసుకువచ్చింది.

అమ్మ కథలే ప్రేరణ:

చిన్నతనం నుండి మన జీవితంలో జరిగే సంఘటనలే మన లక్ష్యాన్ని నిర్ధేశిస్తాయి. ఒక్కొక్కరికి అవ్వి ఒక్కోలా ఉంటాయి. వేణు అమ్మ గారు కథలను కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా వర్ణిస్తారు. ప్రతి రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, చల్లని గాలితో పాటుగా అమ్మ చెప్పే కథలను వేణు వినేవాడు. అమ్మ వల్లనే ఆ కథలలోని ఆత్మను ఇప్పటికీ తనతో పాటుగా అల్లారు ముద్దుగా దాచుకోగలిగాడు. ఆ కథలే తన మదిలో ఓ అందమైన ప్రపంచంగా రూపుదిద్దుకున్నవి.

సిటీ కేబుల్ నుండి:

వరంగల్‌ జిల్లాకు చెందిన వేణు నాన్నగారు కొమ్మాలుగౌడు సర్పంచిగా పనిచేశారు. చదువు పూర్తిచేశాక స్థానిక సిటికేబుల్ వారు తీస్తున్న సీరియల్ కు అసోసియట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడే అనుకున్నాడు ఇక్కడే ఎక్కువ కాలం ఉండిపోకూడదు అని. అలా దర్శకుడిగా తన భావాలను వివరించాలని హైదరాబాద్ కు వచ్చేశారు. ఇప్పుడే మొదలయ్యాయి అసలైన సినిమా కష్టాలు..

ఫ్యాక్టరీ కార్మికునిగా కూడా:

సినీ పరిశ్రమలో తెలిసిన వారు అంతగా లేకపోవడం ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడంతో ముందుగా కాలం వేసే శిక్షణను తీసుకున్నాడు. అవకాశాలు అందుకోవాలంటే ముందు బ్రతకాలి.. న్యాయంగా చేసే ప్రతి పని కూడా ఉన్నతమయినదే అని భావించి కొరియర్ బాయ్ గా, ఫ్యాక్టరీలో రోజువారీ కార్మికునిగా ఇలా రకరకాల పనులు చేస్తూ తానూ బ్రతుకుతూ లక్ష్యానికి దగ్గరిగా వెళ్ళాడు. మొదట లోక్ సత్తా యాడ్స్ కు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత త్రిపురనేని సాయిచంద్ గారి సహకారంతో ఆ నలుగురు సినిమాకు అసోసియట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం లభించింది.

15 సంవత్సరాల వేట:

సక్సెస్ వచ్చిందంటే ఆ జర్నీ చాలా అందంగా మారిపోతుంది. కాని ఒక్కోరోజు ప్రయత్నం చేసేవాడికి తెలుస్తుంది ఆ గతం ఎంతటి తీవ్రమయినదో అని. మన దగ్గర టాలెంట్ ఉన్నంత మాత్రానా మొదటి చాన్స్ అంత తేలికగా రాదు. వేణు ఉడుగుల ఇప్పుడు వస్తున్న కథల కన్నా భిన్నమైన నేపథ్యంతో కొన్ని కథలను రీసెర్చ్ చేసి రాసుకుని ఎంతోమందికి వివరించారు. చాలామంది పాజిటివ్ గా రియాక్ట్ ఐనా గాని కొన్నాళ్లకు పట్టించుకోవడమే మానేసేవారు.

కథ మారిపోయింది:

నటుడు శ్రీ విష్ణుతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఈ ప్రయాణంలోనే. కథ వినగానే నారా రోహిత్ గారికి వివరించడం జరిగింది. రోహిత్ ప్రేక్షకుల ఆనందాన్ని ముందుగానే చూసి ప్రశాంతి, కృష్ణ విజయ్‌, నారా రోహిత్‌, శ్రీవిష్ణు కలిసి సినిమాను మొదలుపెట్టారు. అంతకుముందు అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి భిన్నమైన కథలతో మాంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు చేస్తుండడంతో ఈ సినిమా ప్రేక్షకులను త్వరగానే చేరుకున్నది.

నాన్న మరణం:

ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. అప్పటి వరకు కొడుకు కష్టాలను చూసి సంఘంలో ఒక ఉన్నతమైన గుర్తింపును అందుకోబోతున్న సమయంలోనే తండ్రి మరణం ఎంతగానో కలిచివేస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయ్యి, రీలీజ్ కు మరో 10 రోజులు సమయం ఉందనగా వేణు నాన్న గారికి ఆరోగ్యం విషమించింది. "సినిమా పూర్తికావచ్చిందా.? రిలీజ్ ఎప్పుడు.?" ఈ చివరి మాటలే వేణుతో మాట్లాడిన చివరి మాటలు.

సినిమా హిట్ కాదు:

సినిమా రిలీజ్ కు ముందు ఇండస్ట్రీలో అనుభవం ఉన్న కొందరికి చూపించడం జరిగింది అందులో ఓ పెద్ద నిర్మాత మాత్రం ఈ సినిమా అస్సలు ఆడదు అని నిఖ్ఖచ్చిగా చెప్పేశారట. తర్వాత శేఖర్ కమ్ముల గారు, తేజ గారు వంటివారు చూసి సినిమా రిటీన్ కు భిన్నంగా ఉంది. మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు, ధైర్యంగా అడుగువెయ్యండి అని ప్రోత్సహించారట.

కొత్త దర్శకులు కొత్త శక్తి, కొత్త కథలతో మాత్రమే కాదండి కొత్త టెక్నాలజీ తో కూడా వస్తున్నారు. నాడు రామ్ గోపాల్ వర్మ గారు స్టడీ కెమెరా తో మొదలు పెడితే, తరుణ్ భాస్కర్ పెళ్ళిచూపులు కోసం సింక్ సౌండ్ ఉపయోగించడం, నేడు వేణు ఉడుగుల ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించే డోగ్మా 95 ని తెలుగులో మొదటిసారి ఉపయోగించి రాబోయే సినిమాలకు ఓ గొప్ప దారిని అందించారు